శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నాన్న డైరెక్షన్‌.. వారసుల యాక్షన్‌

నాన్నే పిల్లలకు సూపర్‌ హీరో. పిల్లలు వేసే బుడి బుడి అడుగులు తడబడకుండా చేయిపట్టుకొని నడిపించే నాన్న పిల్లలు జీవితంలో తప్పటడుగులు వేయకుండానూ తీర్చిదిద్దాలనుకుంటాడు. ఓ వయసువచ్చాకా పిల్లలకు సలహాలు ఇవ్వడం తప్పితే దగ్గరుండి పిల్లల కెరీర్‌ను తీర్చిదిద్దే అవకాశం కొంతమంది నాన్నలకే వస్తుంది. ఇప్పుడు అలాంటి అవకాశం బాలీవుడ్‌ దర్శకులకు వచ్చింది. కొందరికి ఇదే తొలి అవకాశం కాగా, మరికొందరు మళ్లీ మళ్లీ ఆ ఆనందాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కొన్ని కొత్త కలయికలు ఆసక్తిని రేపుతున్నాయి. తండ్రి మెగాఫోన్‌ పట్టుకొని స్టార్ట్‌...కెమెరా...యాక్షన్‌.. అంటుంటే వారసులు పాత్రల్లోకి ప్రవేశించి తమ సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నారు. మహేష్‌భట్‌ దర్శకత్వంలో ఆయన తనయ ఆలియాభట్‌, తండ్రి రాకేష్‌ రోషన్‌ తెరకెక్కించనున్న చిత్రంలో హృతిక్‌ రోషన్‌, డేవిడ్‌ ధావన్‌  దర్శకత్వంలో ఆయన తనయుడు వరుణ్‌ధావన్‌ వెండితెరపై మెరిపించడానికి సిద్ధమవుతున్నారు.

ప్రముఖ దర్శకుడు మహేష్‌భట్‌ వారసురాలిగా వెండి  తెరకొచ్చినా తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లో తన సత్తా చాటిన నాయిక ఆలియాభట్‌. ఇప్పుడు తొలిసారి తండ్రి దర్శకత్వంలో నటించే అవకాశం దక్కించుకుంది. 1991లో తను తీసిన ‘సడక్‌’కు కొనసాగింపుగా ‘సడక్‌ 2’ తెరకెక్కిస్తున్నారు   మహేష్‌భట్‌. ఆయన చాలా కాలం తర్వాత మెగాఫోన్‌ పట్టడం, అందులో ఆయన తనయ ఆలియా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి క్రేజ్‌ ఏర్పడింది. ‘‘సడక్‌ 2’ నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. నాన్నతో కలిసి పనిచేసే అవకాశం రావడం మరింత స్పెషల్‌. నేను చేయాల్సింది ఒక్కటే.... అంచనాలకు తగ్గట్టు వందశాతం నా పాత్రకు న్యాయం చేయడానికి కష్టపడటమే’’ అంటోంది ఆలియా. వరుణ్‌ధావన్‌   నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ నెం.1’. ఈ చిత్రానికి వరుణ్‌ తండ్రి డేవిడ్‌ ధావన్‌ దర్శకుడు. ఆయన దర్శకత్వంలోనే గోవిందా హీరోగా వచ్చిన   ‘కూలీ నెం.1’కు రీమేక్‌ ఇది. ఈ తండ్రీకొడుకల కలయికలో వస్తోన్న మూడో చిత్రమిది. ‘మైనే తేరా హీరో’, ‘జుడ్వా 2’ చిత్రాలు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఇప్పుడు ఈ మూడో చిత్రం చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. వారసులతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఎవరికైనా చాలా సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా తమ వారసుల్ని ప్రత్యేకంగా చూపించే అవకాశంతో పాటు వాళ్లలో దాగున్న గొప్ప నటనని వెలికితీసే బాధ్యతను కూడా తీసుకోవచ్చు దర్శకులు. ఈ విషయం గురించి డేవిడ్‌ధావన్‌ మాట్లాడుతూ ‘‘అలాంటిదేమీ లేదు. అయితే వరుణ్‌తో పనిచేయడం సౌకర్యంగా ఉంటుంది. అమితాబ్‌బచ్చన్‌ నుంచి రితేష్‌ దేశ్‌ముఖ్‌ వరకూ 35 మంది హీరోలతో పనిచేశాను. ఇప్పుడు మా అబ్బాయితో పనిచేస్తున్నా అంతే. వాడితో పని చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. నిజంగా వాడికి నటన రాకపోతే నా సినిమాలో అవకాశమే ఇవ్వను’’ అంటున్నారు.

‘క్రిష్‌’ సిరీస్‌ చిత్రాలు బాలీవుడ్‌కు కాసులు కురిపించాయి. తన తండ్రి రాకేష్‌ రోషన్‌ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌ నటించిన ‘క్రిష్‌’  సిరీస్‌లో తాజాగా ‘క్రిష్‌ 4’ రాబోతుంది. వచ్చే నెల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘సూపర్‌ 30’. ‘వార్‌’ చిత్రాలతో విజయాలు అందుకున్న హృతిక్‌తో సినిమాలు చేయడానికి దర్శక   నిర్మాతలు ఎగబడుతున్నారు. కానీ హృతిక్‌ ‘క్రిష్‌ 4’ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారట. ‘క్రిష్‌’ సిరీస్‌ చిత్రాల్లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుందని రాకేష్‌ రోషన్‌ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ప్రముఖ నటుడు, దర్శకుడు సన్నీడియోల్‌ కూడా తన తనయుడు కరణ్‌ డియోల్‌ని వెండితెరకు పరిచయం చేస్తూ ‘పాల్‌ పాల్‌ దిల్‌ కే పాస్‌’ని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ‘‘మా అబ్బాయి కరణ్‌ సినిమా కోసం సాధ్యమైనంత కష్టపడ్డాను. మంచి ఫలితం వస్తుందని అందరూ భావించాం. కానీ వేరేలా జరిగింది’’ అంటున్నారు సన్నీ డియోల్‌.

తండ్రి దర్శకత్వంలో సినిమా చేయడం తనయులకు కలిసొచ్చే అంశమే కావచ్చు. కానీ అదొక్కటే నాలుగు టికెట్లు తెగడానికి ఉపయోగపడదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ‘‘తండ్రీకొడుకులు కలిసి పనిచేయడం వాళ్లకు బాగానే ఉంటుంది. సినిమాకు మంచి క్రేజ్‌ కూడా వస్తుంది. కానీ కథలో సత్తా లేకపోతే ప్రేక్షకుడు అవన్నీ పట్టించుకోడు. గతంలో వారసుల చిత్రాలకు దర్శకత్వం వహించి పరాజయాలు పొందిన వారు కూడా ఉన్నారు’’ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనా ‘కూలీ నెం.1’, ‘సడక్‌ 2’, ‘క్రిష్‌ 4’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని