శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఏమిటీ కర్తార్‌పూర్‌.. ఎందుకంత ప్రత్యేకత..?

సిక్కు మత స్థాపకులు గురునానక్‌ 550వ జయంతి (నవంబర్‌ 12) సమీపిస్తున్న వేళ కర్తార్‌పూర్‌ యాత్రకు సిక్కు యాత్రికులు పాక్‌ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కర్తార్‌పూర్‌ కారిడార్‌ శనివారం (నవంబర్‌ 9న) ప్రారంభం కానుంది. ఓ వైపు భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిణామాలు కొనసాగుతుండగా, మరోవైపు ఈ రెండు దేశాలే కలిసి ఈ ప్రాజెక్టును సంయుక్తంగా నిర్మించడం విశేషం. రెండు దేశాల మధ్య వారధిగా ఉండబోయే ఈ కారిడార్‌ ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కర్తార్‌పూర్‌ మందిరం ప్రత్యేకత ఏమిటి?ఆ నడవా నిర్మాణం విశేషాలేమిటో తెలుసుకుందాం..

కర్తార్‌పూర్‌ మందిరం విశిష్టత
రావి నది ఒడ్డున ఉన్న ఈ కర్తార్‌పూర్‌ మందిరాన్ని సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఎందుకంటే సిక్కుమత స్థాపకుడైన గురునానక్‌ దేవ్‌ తన జీవితంలో చివరి 18 సంవత్సరాలు ఇక్కడే జీవితం గడిపారని మత గ్రంథాల ద్వారా తెలుస్తోంది. భారత్‌ను రెండుగా విభజించినప్పుడు ఈ ప్రాంతం పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లిపోయింది. దీంతో సిక్కులు తమ పవిత్ర క్షేత్రంగా భావించే ఈ మందిరం దర్శనం కోసం పాక్‌కు వెళ్లడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. గురుదాస్‌పూర్‌ జిల్లా సరిహద్దు నుంచి పాక్‌లోని ఈ మందిరం కనిపిస్తుంది. అయితే వెళ్లాలంటే లాహోర్‌కు వెళ్లి అక్కడ నుంచి తిరిగి కర్తార్‌పూర్‌కు రావాల్సిఉంది.  దీంతో ఈ నడవాను నిర్మించాలని సిక్కులు అనేక సంవత్సరాలుగా కోరుతున్నారు. ఈ కారిడార్‌ పాక్‌లోని దర్బార్‌ సాహిబ్‌ ఆలయం నుంచి పంజాబ్‌లోని డేరాబాబా నానక్‌ మందిరాన్ని కలుపుతుంది. 

దశాబ్దాల స్వప్నం
1999లో అప్పటి భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ లాహోర్‌ సందర్శనకు వెళ్లినపుడు ఈ కారిడార్‌ నిర్మాణానికి సూచనలు చేశారు. కానీ అది అప్పుడు అమలుకు నోచుకోలేదు. అప్పటి నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడా అని ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం చివరి దశలో దీనికి అనూహ్యంగా పచ్చజెండా ఊపి వారి కలలకు బాటలు పరిచింది. పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత, అప్పటి మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ.. ఇమ్రాన్‌ ప్రమాణస్వీకారానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన పాక్‌ ఆర్మీ చీఫ్‌ జావెద్ బజ్వాను హత్తుకున్నారు. దీనిపై భారత్‌లో పెద్ద వివాదం రాజుకుంది. దీంతో సిద్ధూ దీనికి వివరణ ఇస్తూ పాకిస్థాన్‌ కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణానికి మద్దతు పలికినట్లు ఆయన చెప్పారు. అందుకే సంతోషంతో కౌగిలించుకున్నా అని చెప్పడంతో కారిడార్‌ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఈ కారిడార్‌కు గత సంవత్సరం నవంబర్‌ 22న అంగీకారం తెలిపింది. గురునానక్‌ జయంతికి సిక్కులకు ఈ కారిడార్‌ను కానుకగా ఇవ్వాలని కోరుతూ భారత్‌ పాక్‌ను కోరగా సానుకూలంగా స్పందించింది. వెంటనే నిర్మాణానికి కూడా చర్యలు వేగవంతం చేసి శంకుస్థాపన చేశారు. అలా రెండు దేశాల మధ్య సంయుక్తంగా ప్రారంభమైన ఆ ప్రాజెక్టు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. దీని నిర్మాణంతో దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న సిక్కుల కల నెరవేరబోతోంది.

తొలివిడతలో ప్రముఖులు
శనివారం భారత్‌లో ఈ కారిడార్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇందుకోసం గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పాకిస్థాన్‌లో ఎవరు ప్రారంభిస్తారన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. పంజాబ్‌ మాజీ మంత్రి సిద్ధూ మాత్రం పాక్‌ వైపు ప్రారంభోత్సవానికి వెళ్లనున్నారు. ఇందుకు ఆయనకు కేంద్రం అనుమతిచ్చింది. తొలుత పాక్‌ తరఫున ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించగా.. ఆయన తిరస్కరించారు. మన్మోహన్‌ తొలి విడత భక్తులతో కలిసి సాధారణ భక్తుడిలాగే కర్తార్‌పూర్‌కు వెళ్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి, హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌తో పాటు పలువురు వీఐపీలు తొలి విడత భక్తులతో కలిసి మందిరాన్ని దర్శించుకోనున్నారు. 

అదే రోజు తిరుగు ప్రయాణం
సిక్కుల దర్బార్‌ సాహిబ్‌ యాత్రకు భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరిన్ని భద్రతా పరమైన చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. వెళ్లాలనుకునే భక్తులు నెల ముందే ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. కర్తార్‌పూర్‌ దర్శనానికి వెళ్లే భక్తులు దర్శనం అనంతరం అదే రోజు తిరిగి రావల్సి ఉంటుందని పేర్కొంది. బృందాల వారీగా దర్శనానికి అనుమతి ఇస్తూ ప్రతి బృందానికి అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. కర్తార్‌పూర్‌ సందర్శనకు వెళ్లే భక్తులకు పాస్‌పోర్ట్‌ తప్పనిసరి. పైగా 20 డాలర్లు ప్రవేశ రుసుము చెల్లించాలి. తొలి రోజు సందర్శనకు ఫీజు వసూలు చేయబోమని చెప్పిన పాక్‌ తర్వాత మాట మార్చింది. పాస్‌పోర్ట్‌ కూడా అవసరం లేదని చెప్పి మళ్లీ యూటర్న్‌ తీసుకుంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని