శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ధోనీని అవమానించి భంగపడ్డారు

బంగ్లా అభిమానుల అత్యుత్సాహంలో మార్పు!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ప్రపంచ క్రికెట్‌లో సంచలన విజయాలకు మారు పేరు బంగ్లాదేశ్‌. పసికూనగా పేరున్నా అనేక సార్లు అత్యుత్తమ జట్లను గడగడలాడించింది. ఆటలో గెలుపోటములు సహజమని తెలిసినా.. ఆ ఆటగాళ్ల ఓవర్‌ యాక్షన్‌ అంతా ఇంతా కాదు. ప్రత్యర్థులపై మ్యాచ్‌ గెలిస్తే వాళ్లు చేసే నాగిని డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెటర్లే ఇలా ఉంటే ఇక అభిమానుల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం బంగ్లా జట్టు భారత్‌లో పర్యటిస్తున్న సందర్భంగా గత అనుభవాలను గుర్తు చేసుకుంటే..

ఆ సిరీస్‌తోనే ప్రారంభం..
2015లో మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లింది. తొలి రెండు వన్డేల్లో ఆ జట్టు బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ రాణించడంతో భారత్‌ 1-2 తేడాతో సిరీస్‌ కోల్పోయింది. ఈ సందర్భంగా అక్కడి పత్రిక ఒకటి దుస్సాహసం చేసింది. భారత ఆటగాళ్లను అవమానించే విధంగా ఒక యాడ్‌ను రూపొందించి ప్రచురించింది. రెహ్మాన్‌ చేతిలో కత్తిపెట్టి.. భారత ఆటగాళ్లకు సగం నెత్తి గొరిగినట్లు ఉన్న ఫొటోను ప్రచురించింది. అలా తొలిసారి భారత్‌, బంగ్లా అభిమానుల మధ్య వివాదం తలెత్తింది.

ధోనీని అవమానించి భంగపాటు..

2016 ఆసియా కప్‌ సందర్భంగా బంగ్లా అభిమానులు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ టోర్నీలో పాకిస్థాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్‌ ఫైనల్‌కు చేరింది. టీమిండియాతో తలపడిన టైటిల్‌పోరులో భారత్‌ ఘన విజయం సాధించింది. అయితే, ఫైనల్‌ మ్యాచ్‌కు ముందే ఓ బంగ్లా అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. బంగ్లా బౌలర్ తస్కిన్‌ అహ్మద్‌.. టీమిండియా బ్యాట్స్‌మన్‌ ధోనీ తల నరికి చేతిలో పట్టుకున్నట్లు ఓ ఫొటోను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. కాగా ఫైనల్లో టీమిండియా గెలవడంతో భారత అభిమానులు ఆ ఫొటోకు బదులుగా బంగ్లా క్రికెటర్‌ తలను ధోనీ పట్టుకున్నట్లు రూపొందించారు. దీంతో బంగ్లా అభిమానులు భంగపాటుకు గురయ్యారు.

ఆ వీరాభిమానులనూ వదల్లేదు..

భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్లు ఎక్కడ మ్యాచ్‌ ఆడితే అక్కడ ప్రత్యక్ష్యమవుతారు ఇద్దరు వీరాభిమానులు. టీమిండియా డైహార్డ్‌ ఫ్యాన్‌ సుధీర్‌ గౌతమ్‌ కాగా.. పాకిస్థాన్‌ వీరాభిమాని మహ్మద్‌ బషీర్‌. ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రికెట్‌ అభిమానులకు వీరిద్దరూ సుపరిచితమే. అయితే, బంగ్లా అభిమానులు వీరిని కూడా వదల్లేదు. 2015 బంగ్లా పర్యటన సందర్భంగా ఢాకా వెళ్లిన సుధీర్‌పై రెండో వన్డే అనంతరం అక్కడి స్థానికులు దాడి చేశారు. అతడు ప్రయాణిస్తున్న ఆటోపై రాళ్లు విసిరారు. అదృష్టం కొద్దీ అతడికి గాయాలు కాలేదు. మరోవైపు పాక్‌ వీరాభిమాని బషీర్‌ను ఆసియా కప్‌ సందర్భంగా అవమానించారు. ఆ టోర్నీలో బంగ్లా చేతిలో పాక్‌ ఓటమిపాలయ్యాక.. స్థానిక రాజకీయ నాయకుడి ముందే బషీర్‌ను అవమానించారు. బంగ్లాదేశ్‌ జెండాను బలవంతంగా ధరించేలా చేశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో బయటకు పొక్కడంతో తీవ్ర దుమారం రేగింది.

బంగ్లా అభిమానుల అత్యుత్సాహంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో ఆ దేశ క్రికెట్‌ బోర్డు వారిని హెచ్చరించింది. పలువురు క్రికెటర్లు సైతం సామాజిక మాధ్యమాల్లో అభిమానులను సరిగ్గా నడుచుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో బంగ్లా అభిమానుల ప్రవర్తనలో ఇటీవల మార్పు కనిపిస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా ప్రస్తుతం భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. దిల్లీలో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ గెలుపొందగా.. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమానంగా మారింది. ఆదివారం జరిగే నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సిరీస్‌ కైవసం చేసుకుంటారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని