శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మిలిటరీ లేని దేశాలూ ఉన్నాయ్‌..

శత్రుమూకల నుంచి రక్షణ పొందటానికి.. ఉగ్రవాదులు చొరబడకుండా ఉండేందుకు.. ఏ దేశానికైనా సైనిక వ్యవస్థ అవసరం. ఆక్రమణదారుల నుంచి భూభాగాన్ని కాపాడుకునేందుకు.. పౌరులను భద్రంగా చూసుకునేందుకు.. సరిహద్దుల్లో సైనికులు ఉంటే దేశ ప్రజలకు కొండంత భరోసా. ఒక దేశ రక్షణలో కీలక భూమిక పోషించే సైనికులు లేకుంటే ఆ దేశం ఎలా ఉంటుంది? అసలు మిలిటరీ లేకుండా ఒక దేశం తన ఉనికిని చాటుకో గలుగుతుందా? ఇంతకీ ప్రపంచంలో సైనిక వ్యవస్థ లేని దేశాలున్నాయా? ఒకవేళ ఉంటే అవి ఏవో తెలుసుకోవాలనుందా.. మరి ఇంకేందుకు ఆలస్యం.. అసలు మిలిటరీ లేకుండా పాలన సాగిస్తున్న దేశాల గురించి తెలుసుకుందాం పదండి..

ప్రత్యేక పోలీసు వ్యవస్థతో...  
అండోర్రా. యూరప్‌లో  ఉందీ దేశం. దీనికి సముద్ర తీరం లేదు. దేశానికి చుట్టూ వివిధ దేశాల భూభాగమే సరిహద్దు.  ఈ దేశం స్పెయిన్‌, ఫ్రాన్స్‌ దేశాల మధ్య ఉంది. దీంతో ఈ దేశాలతోనే అండోర్రా భద్రతా ఒప్పందాలను కుదుర్చుకుంది. దేశంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా అధునాతమైన అంతర్గత పోలీసు వ్యవస్థ ఉండటం అండోర్రా ప్రత్యేకత. ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక పోలీస్‌ యూనిట్‌ దేశంలో పనిచేస్తోంది. దీంతో శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేకంగా సైన్యం అవసరం లేకుండా పోయింది.

 

మారణకాండ కారణంగా... 
ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాకు మధ్యలో కోస్టారికా ఉంది. ఇక్కడ మిలిటరీ వ్యవస్థ లేకపోవడానికి ఓ కారణం ఉంది. దశాబ్దాల క్రితం ఆ దేశ పౌరులపై అప్పటి సైనికులు జరిపిన మారణకాండతో దేశవ్యాప్తంగా అగ్రహ జ్వాలలు రేగాయి. దీంతో ఆ దేశ పౌరులు పోరాడి మిలిటరీ వ్యవస్థను పూర్తిగా తొలగింపజేశారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 1వ తేదీన మిలిటరీ నిర్మూలన దినోత్సంగా ఆ దేశం జరుపుకొంటోంది. ప్రస్తుతం దేశ రక్షణ కోసం కోస్టారికా పారామిలిటరీ బలగాలను ఉపయోగిస్తోంది. ఈ బలగాలే ప్రస్తుతం దేశ రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

 

చిన్న దేశంలో... 
ప్రపంచంలో ఉన్న సార్వభౌమ దేశాల్లో అతిచిన్న దేశం వాటికన్ సిటీ. వైశాల్యంలోనే కాదు.. జనాభాలోనూ వాటికన్ సిటీ చిన్నదే. ఇది యూరప్‌లో ఉంటుంది. శత్రువుల నుంచి దేశాన్ని కాపలా కాసే నోబుల్ గార్డ్‌, పాలటైన్‌ గార్డ్‌ను 1970లో రద్దు చేశారు. దీంతో పొరుగు దేశం స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్‌ గార్డ్ బలగాలే దేశానికి రక్షణ కల్పిస్తున్నాయి. 

పోలీస్‌ ఫోర్స్‌తో... 
మిలిటరీ వ్యవస్థలేని మరో దేశం డొమినికా. ఈ దేశం కరీబియన్‌ ద్వీపాల్లో ఉంటుంది. 1981లో ఈ కరేబియన్‌ దేశం సైనిక వ్యవస్థను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ దేశ రక్షణ బాధ్యతలను కామన్‌వెల్త్‌ ఆఫ్‌ డొమినికా పోలీస్‌ ఫోర్స్‌ నిర్వర్తిస్తోంది. ఇందులో డొమినికా కోస్ట్‌ గార్డ్ కూడా భాగంగా ఉంది.  

మంచు దేశంలో... 
పూర్తిగా మంచుతో కూడుకున్న ఐస్‌లాండ్‌లో 1869లోనే మిలిటరీ వ్యవస్థను రద్దు చేశారు. నాటో సభ్యత్వ దేశాల్లో ఒక్క ఐస్‌లాండ్‌కు మాత్రమే మిలిటరీ లేదు. అయితే అమెరికా ఐస్‌లాండ్‌లో 1951 నుంచి 2006 వరకు తన బేస్‌ క్యాంపును ఏర్పాటు చేసుకుంది. ఈ దేశానికి వాయు రక్షణ వ్యవస్థ కూడా లేదు. శాంతిని పరిరక్షించేందుకు, దేశ భద్రత కోసం అధునాతన ఆయుధ వ్యవస్థ కలిగిన పోలీసులే ఐస్‌లాండ్‌కు సైన్యం. 

పోలీసులకు తోడుగా నావికా గస్తీ... 
హిందూ మహా సముద్రంలో అక్కడక్కడ వెదజల్లినట్టుగా మార్షల్ ఐలాండ్స్‌ ఉంటాయి. ఈ దేశ రక్షణకు కూడా సైనిక వ్యవస్థ లేదు. దేశంలో అంతర్గతంగా ప్రజలకు రక్షణ, భద్రత కల్పించే పోలీసులే భద్రత కల్పిస్తారు. దేశ రక్షణ బాధ్యతలను మొత్తం పోలీసులే నిర్వహించటం గమనార్హం. పోలీసులకు తోడు కోస్టల్‌గార్డ్‌ విభాగం కూడా దేశ రక్షణలో కీలక బాధ్యత వహిస్తుండడంతో ఇక్కడ సైనిక వ్యవస్థ అవసరం రాలేదు.

మూడు ఫోర్స్‌లు కలసి... 
హిందూ మహా సముద్రంలో ఉండే ఒక సుందర ద్వీప దేశం మారిషస్‌. ఈ దేశంలో 1968 నుంచి మిలటరీ వ్యవస్థ లేదు. మార్షల్ ఐలాండ్ మాదిరిగానే ఈ దేశంలో కూడా పోలీసులే రక్షణ కల్పిస్తారు. ప్రజలను సురక్షితంగా ఉంచడం కోసం మిలిటరీకి బదులు మూడు వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అవే మారిషస్‌ పోలీస్‌ ఫోర్స్‌, స్పెషల్‌ మొబైల్‌ ఫోర్స్‌, నేషనల్ కోస్ట్ గార్డ్‌ దేశానికి రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి.

రాయల్ గ్రెనెడా పోలీస్ దళాలే...
గ్రెనెడా దేశం కరేబియన్‌ దీవుల్లో ఉంటుంది. గ్రెనెడా చుట్టూ ఆ దేశానికి చెందిన మరో ఆరు ద్వీపాలు ఉంటాయి. 1983లో అమెరికా గ్రెనెడాను ఆక్రమించుకోవడంతో అక్కడ సైనిక వ్యవస్థను రద్దు చేశారు. ప్రస్తుతం రాయల్ గ్రెనెడా పోలీస్ దళాలే అంతర్గత భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. దేశ రక్షణను రీజనల్‌ సెక్యూరిటీ వ్యవస్థ చూసుకుంటోంది. దీంతో గ్రెనెడాలో మిలిటరీ అవసరం లేకుండా పోయింది.

ఆస్ట్రేలియాతో ఒప్పందం... 
మధ్య పసిఫిక్‌ మహా సమద్రంలో అత్యంత ప్రశాంతమైన దీవి రిపబ్లిక్ ఆఫ్‌ నౌరు. ఈ దేశంలో జనాభా చాలా తక్కువ. నౌరు దేశ రక్షణ కోసం ఇక్కడ ఎలాంటి సైనిక వ్యవస్థను పాలకులు ఏర్పాటు చేయలేదు. పక్కన ఉన్న ఆస్ట్రేలియాతో దేశ రక్షణ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నౌరును శత్రుమూకల నుంచి కాపాడే బాధ్యత ఆస్ట్రేలియాదే. అంతర్గతంగా పౌరుల రక్షణ కోసం సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ నౌరు సొంతం. ప్రపంచంలో నౌరు దేశ పౌరులు అధికంగా ఊబకాయం కలిగి ఉండటం విశేషం.

ఆరు ద్వీపాల సమూహం... 
మిలటరీ వ్యవస్థలేని మరో దేశం సాలమన్‌ ఐలాండ్స్‌. పసిఫిక్‌ మహా సముద్రంలో పపువా న్యూ గినియా దేశానికి పక్కన ఈ దేశం ఉంటుంది. ఈ దేశం ముఖ్యంగా ఆరు ద్వీపాల సమూహం. దేశ భద్రత కోసం రాయల్‌ సాలమన్‌ ఐలాండ్స్‌ పోలీస్‌ దళం ఉండేది. కానీ అంతర్గత కలహాల వల్ల 2003లో ఈ పోలీసు వ్యవస్థను రద్దు చేశారు. మళ్లీ ఆ దేశంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి ఆస్టేలియా, న్యూజిలాండ్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ  దేశ రక్షణ కోసం ఒక పోలీసు దళం, నావికా నిఘా విభాగం పని చేస్తున్నాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని