దిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ కేంబ్రిడ్జి అనలిటికా, గ్లోబల్ సైన్స్ రీసెర్చి లిమిటెడ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం కేసు నమోదు చేసింది. భారత్‌కు చెందిన ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా సేకరించినందుకు గానూ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గ్లోబల్ సైన్స్ రీసెర్చి 2014లో ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ (this is your digital life) అనే యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశోధన, విద్యా సంబంధిత అవసరాల కోసం తన వినియోగదారుల సమాచారాన్ని సేకరించేందుకునేందుకు గ్లోబల్ రీసెర్చికి ఫేస్‌బుక్ అనుమతినిచ్చింది. తర్వాత ఈ డేటాను వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునేందుకు గ్లోబల్ రీసెర్చితో కేంబ్రిడ్జి అనలిటికా అక్రమంగా ఒప్పందం కుదుర్చుకుంది.
ఇలా అక్రమంగా కేంబ్రిడ్జి అనలిటికా చేతుల్లోకి సమాచారం వెళ్లిన విషయం తొలిసారి 2018లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.. ప్రపంచవ్యాప్తంగా 87 మిలియన్ల మంది యూజర్ల సమాచారం అక్రమంగా కేంబ్రిడ్జి అనలిటికా చేతుల్లోకి వెళ్లి ఉండొచ్చని అంగీకరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. ఈ విషయంపై వివరణ కోరుతూ ఫేస్‌బుక్, కేంబ్రిడ్జి అనలిటికాకు నోటీసులు జారీ చేసింది. 2018లో కేంబ్రిడ్జి అనలిటికా ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికాతో పాటు అనేక దేశాల ఎన్నికల్లో ఇది కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016 అమెరికా ఎన్నికల్లో రాజకీయ సహాయ సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ అక్రమాలను తొలిసారి క్రిస్టోఫర్ విలీ అనే వ్యక్తి వెలుగులోకి తెచ్చారు. ఇది పూర్తిగా వ్యక్తుల గోప్యతా నిబంధనల్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. అలాగే, ఈ డేటాను ఓటర్లను ప్రభావితం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని జొప్పించేందుకు వినియోగిస్తున్నారని వెల్లడించారు. 2003 నుంచే ఈ సంస్థ భారత ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందని విలీ ఆరోపించారు. భారతదేశంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు తమ సేవలను ఉపయోగించుకున్నాయని వివాదాస్పద కేంబ్రిడ్జి అనలిటికా అప్పట్లో ప్రకటించింది. దీన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ఐటీ శాఖ.. ఫేస్‌బుక్, కేంబ్రిడ్జి అనలిటికాకు నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు నిజమేనని ప్రాథమిక విచారణలో తేలడంతో తాజాగా కేసు నమోదు చేసింది.
ఇవీ చదవండి...