ఇంటర్నెట్ డెస్క్: సీతాకోక చిలుక.. ఒక అందమైన కీటకం. రంగురంగుల రెక్కలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఇట్టే ఎగిరిపోతాయి. సాధారణంగా సీతాకోక చిలుకలు చేతికి చిక్కవు. ఎవరైనా దగ్గరికి వచ్చినా, ప్రమాదం ఉందని తెలిసినా వెంటనే వాటి రెక్కలకు పని చెప్పి ఒక ఉదుటున గాల్లోకి ఎగురుతుంటాయి. ఉన్న చోట నుంచి క్షణాల్లో సీతాకోక చిలుకలు గాల్లోకి ఎలా ఎగరగలుగుతున్నాయో తెలుసుకోవడం కోసం గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని పరిశోధకులు కనిపెట్టారు.
సీతాకోక చిలుక తన రెక్కలను ఒకేసారి చాచి చప్పట్లు కొట్టినట్టుగా దగ్గరకు చేర్చడం ద్వారా గాలిపై ఒత్తిడి పెంచి వ్యతిరేక దిశలో సులభంగా ఎగరగలుగుతున్నాయని పరిశోధకులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కొన్నేళ్లుగా ఈ సిద్ధాంతాన్నే అందరూ నమ్ముతున్నారు. అయితే, ఇటీవల స్వీడెన్‌లోని లుండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం మరోసారి సీతాకోకచిలుక ఎగిరే విధానంపై పరిశోధనలు చేశారు. గత సిద్ధాంతం నిజమే అయినప్పటికీ.. సీతాకోక చిలుకలు ఎగరడంలో వాటి రెక్కల ఆకృతి కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనుగొన్నారు.
చిలుకలు ఎగిరే సమయంలో వాటి రెక్కల్లో జేబువంటి ఆకారం ఏర్పడుతుందని, వాటిలో గాలి నిండటంతో చదునుగా ఉండే రెక్కలతో పోలిస్తే 22 శాతం ఎక్కువ బలంగా.. వేగంగా ఎగరే వీలు ఉంటుందని, 28శాతం తక్కువ శక్తి వినియోగం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన కోసం సీతాకోక చిలుకకు ఉండే రెక్కల మాదిరిగానే యంత్రాలతో రెక్కలు తయారు చేశారు. దీంతో వాటి రహస్యం బయటపడింది. ఈ పరిశోధన ద్వారా వెల్లడైన విషయాలు.. డ్రోన్ల తయారీ, వినియోగంలో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి..