లద్ధాఖ్‌ను చైనాలో చూపిన వైనం
ఈ నెల 30నాటికి తప్పు సరిదిద్దుకుంటామని హామీ
దిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. లద్దాఖ్‌ను చైనాలో భాగంగా చూపడంపై క్షమాపణలు తెలియజేసింది. తమ తప్పును ఈ నెల 30 నాటికి సరిదిద్దుకుంటామని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (వ్యక్తిగత డేటా రక్షణ)కి వివరించింది. దీనిపై జేపీసీ ఛైర్‌పర్సన్ మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. లద్దాఖ్‌ను చైనాలో చూపినందుకు ట్విటర్ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిందన్నారు. భారత చిత్రపటాన్ని తప్పుగా జియో ట్యాగ్ చేసినందుకు క్షమాపణ కోరుతూ ట్విటర్ ఇండియా మాతృసంస్థ ట్విటర్ ఐఎన్‌సీ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డమైన్ కరియన్ అఫిడవిట్ రూపంలో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పినట్టు తెలిపారు. భారతీయుల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరారని, ఈ నెల 30 నాటికి తప్పును సరిదిద్దుకుంటామని చెప్పిందని ఆమె వెల్లడించారు.
ఇంతకముందే మొట్టికాయలు!
లద్దాఖ్‌ను చైనా భూభాగంగా చూపిన విషయంలో ట్విటర్‌కు గత నెలలో పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ట్విటర్ ఇండియా మాతృసంస్థ ట్విటర్ ఐఎన్‌సీ అఫిడవిట్ రూపంలో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సమాచార పరిరక్షణ బిల్లుపై భాజపా ఎంపీ మీనాక్షీ లేఖి నేతృత్వంలో ఏర్పాటైన జేపీసీ ముందు గతంలో హాజరైన ట్విటర్ ప్రతినిధులు తమ వివరణ ఇచ్చుకున్నారు. లద్దాఖ్‌ను చైనా భూభాగంగా చూపిన అంశంపై క్షమాపణలు చెప్పారు. దాదాపు 2గంటల పాటు ప్రతినిధులను ప్రశ్నించిన కమిటీ.. ట్విటర్ చర్యను నేరంగా పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రశ్నించేలా ఉందని అభిప్రాయపడింది. ఈ చర్యను రాజద్రోహంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనిపై ట్విటర్ ఇండియా కాకుండా అమెరికాలోని ట్విటర్ ఐఎన్‌సీ అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్విటర్ ఐఎన్‌సీ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ అఫిడవిట్ రూపంలో లిఖితపూర్వక క్షమాపణలు చెప్పారు.