పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని పించా నది వద్దనున్న గుట్టలో చిక్కుకుపోయిన ఆరుగురిని రాష్ట విపత్తు నిర్వహణ బృందం (ఎస్డీఆర్‌ఎఫ్) సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఆకులవారిపల్లెకు చెందిన సీతారామయ్య అనే వృద్ధుడి కుటుంబం వ్యవసాయ పనుల నిమిత్తం పించా నది వద్ద నున్న గుట్టపై గుడిసె వేసుకుని నివాసముంటోంది. నివర్ తుపాను కారణంగా నది ఉప్పొంగడంతో గుట్టకు కుడివైపునకు నీటి ప్రవాహం రాక మొదలైంది. దీంతో గురువారం రాత్రి మొత్తం సీతారామయ్యతో పాటు ఐదుగురు కుటుంబసభ్యులూ అక్కడే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు ఈరోజు ఉదయం కర్నూలు నుంచి 31 మందితో కూడిన ఎస్డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. ఆ బృందం క్రేన్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి గుట్టపై చిక్కుకున్న ఆరుగురిని రక్షించారు. పీలేరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, మదనపల్లె సబ్‌కలెక్టర్ జాహ్నవి, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి సహాయక చర్యలను పర్యవేక్షించారు.