ప్రపంచవ్యాప్తంగా పరీక్షల విధానం మారుతోందన్న మనీశ్ సిసోడియా
దిల్లీ: దేశవ్యాప్తంగా నీట్, జేఈఈ పరీక్షలపై చర్చ నడుస్తోన్న సందర్భంగా తాజాగా దిల్లీ ప్రభుత్వం కూడా స్పందించింది. నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయడం లేదా పరీక్షల నిర్వహణకు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేశించడమో చేయాలని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కేంద్రాన్ని కోరారు. ‘దేశవ్యాప్తంగా 28లక్షల మంది విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతుండగా కేంద్రం మాత్రం చేతులెత్తేసి నిద్రపోతోంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయడమో లేదా వీటికి ప్రత్యామ్నాయ మార్గాన్ని తప్పనిసరిగా చూడాలి’ అని మనీశ్ సిసోడియా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పరీక్షల విధానం మారుతోందని, పరీక్షలను నిర్వహించడానికి వెయ్యి మార్గాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1నుంచి 6వరకు నీట్, 13వ తేదీన జేఈఈ పరీక్ష జరిపేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
ఇదిలా ఉంటే, నీట్, జేఈఈ పరీక్షలు, జీఎస్టీ, ఇతర అంశాలపై చర్చించేందుకు పలు విపక్షపార్టీ ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భేటీ అయ్యారు.