చర్చలతోనే సమస్య పరిష్కారమవుతుందన్న గడ్కరీ
20వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గత కొద్దిరోజులుగా ఉద్యమం చేస్తున్న అన్నదాతలు ఏ మాత్రం పట్టువీడట్లేదు. వణికించి చలిని కూడా లెక్కచేయకుండా వరుసగా 20వ రోజు హస్తిన సరిహద్దుల్లో తమ ఆందోళన సాగిస్తున్నారు. దిల్లీ-హరియాణా మార్గంలోని సింఘు, టిక్రీ వద్ద రైతుల నిరసన కొనసాగుతూనే ఉంది. అయితే రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సంసిద్ధంగానే ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం మరోసారి స్పష్టం చేశారు. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆందోళనపై స్పందించారు. ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కాదని, నూతన చట్టాలను అన్నదాతలు అర్థం చేసుకోవాలని కోరారు.
చర్చలతోనే రైతుల సమస్య పరిష్కారం
రైతుల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రైతులు చర్చలకు రావాలని, కొత్త చట్టాలను అవగాహన చేసుకోవాలని కోరారు. చట్టాలపై అన్నదాతలు ఇచ్చే సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. కొన్ని శక్తులు ఈ ఆందోళనలను దుర్వినియోగం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని గడ్కరీ ప్రతిపక్షాలనుద్దేశిస్తూ పరోక్ష విమర్శలు చేశారు. ‘రైతులకు వ్యతిరేకంగా మేం ఎలాంటి చట్టాలు చేయలేదు. కొత్త చట్టాలతో అన్నదాతలు తమ పంటలను ఎక్కడైనా.. ఎవరికైనా.. ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు. ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చర్చలు జరగకపోతే దుష్ప్రచారం, వివాదాలు రేకెత్తే ప్రమాదం ఉంది. అందుకే అన్నదాతలు ప్రభుత్వంతో చర్చలకు రావాలి. అప్పుడు ప్రభుత్వం వారికి అన్ని విషయాలు వివరించగలుగుతుంది. అప్పుడే సమస్య పరిష్కారమవుతుంది. ఆందోళనలు సమసి రైతలకు న్యాయం జరగుతుంది. రైతుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది’ అని గడ్కరీ చెప్పుకొచ్చారు.
గుజరాత్ రైతులతో మోదీ భేటీ
కాగా.. రైతుల ఉద్యమం ఉద్ధృతమవుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌కు చెందిన రైతు సంఘాలు, నేతలతో మోదీ సమావేశం కానున్నట్లు సమాచారం. మరోవైపు దిల్లీ శివారుల్లో ఆందోళన చేస్తున్న రైతులు కూడా నేడు భేటీ కానున్నారు. తదుపరి కార్యాచరణపై వారు చర్చలు జరపనున్నారు.
ఆందోళనలో భాగంగానే రైతులు సోమవారం దేశ్యవాప్తంగా ధర్నాలు, రిలే నిరాహార దీక్షలతో హోరెత్తించిన విషయం తెలిసిందే. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి..