దిల్లీ: దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు మంగళవారం కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో మంగళవారం మధ్యాహ్నం వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తనకు కరోనా వైరస్ సోకిందని, ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు సెప్టెంబర్ 14న ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. కానీ, తరవాత శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే డెంగీ కూడా సోకినట్లు ఆయన కార్యాలయ అధికారులు వెల్లడించారు. శరీరంలో రక్తకణాల సంఖ్య తగ్గిపోయినట్లు తెలిపారు. దాంతో వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించగా ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. అయితే వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దిల్లీలో కరోనా వైరస్ కట్టడికి ఇతర మంత్రులతో పాటు మనీశ్ కూడా చురుగ్గా వ్యవహరించారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు దిల్లీలో 2.7 లక్షల మందికి పైగా వైరస్ సోకగా, వారిలో సుమారు 5,200మంది ప్రాణాలు కోల్పోయారు.