దిల్లీ: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోగ్యం కలవరపెడుతోంది. ఇప్పటికే ఓవైపు ఆయన కరోనా వైరస్ బారిన పడగా.. ప్రస్తుతం డెంగీ కూడా సోకినట్లు ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు. ఆయన శరీరంలో రక్తకణాల సంఖ్య తగ్గిపోయినట్లు వెల్లడించారు. దీంతో ఆయనను దిల్లీలోని మాక్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇటీవల కరోనా వైరస్ సోకడంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయనకు శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తడంతో లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు.