శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

గత్యంతరం లేక రాజకీయాల్లోకి రాలేదు

●మా నాన్న కల ఇప్పటికి నెరవేరింది ●
నటుడు, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌

కమల్‌హాసన్‌ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కమల్‌హాసన్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: తాను ఎలాంటి గత్యంతరం లేక రాజకీయాల్లోకి రాలేదని విశ్వనటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వస్థలమైన పరమకుడిలో ఆయన తండ్రి శ్రీనివాసన్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో కమల్‌హాసన్‌, చారుహాసన్‌, సుహాసిని, శ్రుతిహాసన్‌, అక్షరలతోపాటు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. శ్రీనివాసన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం కమల్‌హాసన్‌ మాట్లాడారు. సాయంత్రం పూట కళాశాలకు వెళ్లి చదివి ఐఏఎస్‌ కావాలని తాను సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత కూడా తండ్రి సూచించారని చెప్పారు. ముందు ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఉత్తీర్ణత సాధించాకే మిగిలినవన్నీ అని తాను సమాధానం ఇచ్చానన్నారు. బాలచందర్‌ పని ఇచ్చాక తనకు చదువు ఎక్కలేదని పేర్కొన్నానని చెప్పారు. తన మాటలు విన్న తండ్రి కాస్త ఆవేదనతో కనీసం సంగీతమైనా నేర్చుకోమని సూచించారని వివరించారు. తమది అద్భుతమైన కుటుంబమని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబాన్ని నాన్న చాలా చక్కగా చూసుకున్నారని గుర్తు చేశారు. ఆయన నుంచే తాను హాస్యంతోపాటు అన్ని విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. తనకు రౌద్రం అంటే ఇష్టమని.. అదే సమయంలో హాస్యం కూడా అని తెలిపారు. తనకు చదువు వచ్చా? అంటే సమాధానం చెప్పలేనని, కానీ ‘స్కిల్‌’ తెలుసని కమల్‌ పేర్కొన్నారు. దాని ద్వారానే వేదికలపై మాట్లాడుతున్నానని తెలిపారు.
విగ్రహం పూజించేందుకు కాదు
కార్యక్రమంలో ఆయన ఇంకా మాట్లాడుతూ... ‘‘ నాకు నీడగా నిలిచిన కె.బాలచందర్‌కు నా కార్యాలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశా. చెన్నై వెళ్లిన తర్వాత ఆవిష్కరించనున్నా. అది సమాజం కోసం కాదు. నాకోసం! పూజ చేయడం కోసం నేను ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. నేను రాజకీయాల్లోకి రావడం నా కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. కానీ నాన్న మాత్రమే రాజకీయాల్లోకి రావాలని ఆశపడ్డారు. ఇప్పుడు ఆయన కల నెరవేరింది. ‘మీరు స్వాతంత్య్రం కోసం పోరాడారని, నేను రాజకీయాల్లోకి రావాలా?’ అని మా నాన్నను చూసి చాలా సందర్భాల్లో అడిగా. ‘ఒకవేళ ఆ ఆవశ్యకత వస్తే..?’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఆ పరిస్థితి రానేవచ్చింది. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చేశా. వేరే గత్యంతరం లేక నేను రాజకీయాల్లోకి రాలేదు. మన రాష్ట్రంలో ప్రతి ఏడాది 61 లక్షల మంది విద్యార్థులు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. ఉన్నత విద్యకు వెళ్లేసరికి వారి సంఖ్య 58 లక్షలకు పడిపోతోంది. పారిశుధ్య పనులకు కూడా పీహెచ్‌డీ పట్టభద్రులు దరఖాస్తు చేసుకునే అత్యంత దారుణమైన పరిస్థితి ఇక్కడ నెలకొంటోంది. నేను సెలూన్‌లో నెలన్నర పనిచేశా. అక్కడ లభించిన అనుభవంతోనేఇతర భాషల్లో అభివృద్ధి సాధించాను. ఏ వృత్తీ హీనమైనది కాదు.
నైపుణ్యాభివృద్ధి కోసం..
సత్యాగ్రహం తర్వాత నైపుణ్యాభివృద్ధి పోరాటం చేసి ఉండాల్సింది. కానీ జరగలేదు. అందులో తమిళనాడు ఇంకా భాగస్వామ్యం కాలేదు. ఇతర రాష్ట్రాలు యువతలో నైపుణ్యాన్ని పెంచే ప్రక్రియలను చేపడుతున్నాయి. ఉపాధి కల్పించేందుకు విశ్వవిద్యాలయాలు మాత్రమే సరిపోవు. పలు వృత్తులను నేర్చుకునేందుకు సరైన వేదిక లేదు. అభివృద్ధి చెందిన నగరాల్లో సెలూన్‌లో పని చేసుకుని జీవించినా రూ.లక్ష వరకు సంపాదించవచ్ఛు ఇక, మిలిటరీలో ప్రాణాలు కోల్పోయే వారికన్నా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందే వారి సంఖ్యే వంద రెట్లు ఎక్కువగా ఉంది. అందువల్ల యువకులను సైనికదళంలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలి. నేను ప్రారంభించిన ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.. నేను చేసిన దానం కాదు.. నేనిచ్చే బహుమతి! ప్రభుత్వాలు అందించే ఉచితాలు మూడు నెలలు కూడా ఉండవు. కానీ ఈ కేంద్రాలు జీవితాంతం సహకరిస్తాయని’’ పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల్లో పూజాకుమార్‌!
ఈ కార్యక్రమం కోసం చాలా కాలం తర్వాత ‘హాసన్‌’ కుటుంబ సభ్యులందరూ ఒకచోట కనిపించి అలరించారు. చారుహాసన్‌, సుహాసిని, శ్రుతి, అక్షర.. ఇలా అందరూ ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా తీసుకున్న ‘ఫ్యామిలీ ఫొటో’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో నటి పూజాకుమార్‌ కూడా ఉన్నారు. కమల్‌హాసన్‌ కుటుబికుల్లో పూజాకుమార్‌ ఎప్పుడు సభ్యులయ్యారు?.. అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కమల్‌తోపాటు ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమవిల్లన్‌’ చిత్రాల్లో నటించారు పూజాకుమార్‌. ఇదిలా ఉండగా సోదర సమానుడిగా భావించే నటుడు ప్రభు ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కమల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అక్షర, కమల్‌, శ్రుతి

కమల్‌తో ప్రభు

శ్రీనివాసన్‌ విగ్రహం ప్రారంభోత్సవంలో...


చారుహాసన్‌, కమల్‌హాసన్‌


శ్రీనివాసన్‌ విగ్రహం

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని