కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
ముంబయి: భారత్‌లో స్వదేశీ ఉత్పత్తులకు ఊతమిస్తూ విదేశీ వస్తువుల దిగుమతికి ముగింపు పలకాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎగుమతులను పెంచాలని ఆయన సూచించారు. ఇందుకోసం ‘దిగుమతుల ప్రత్యామ్నాయం, ఎగుమతుల ఆధారిత విభాగాన్ని’ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు మార్గనిర్దేశం చేయడంతో పాటు కేవలం స్వదేశీ, స్వావలంబన సూత్రంపైనే ఈ విభాగం పూర్తిగా పనిచేయాలని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ‘స్వదేశీ జాగరణ్ మాంచ్’ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఓ వర్చువల్ కార్యక్రమంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘దిగుమతి వస్తువుల ప్రత్యామ్నాయాలపై భారీ ప్రచారం కల్పిస్తూ, దిగుమతులకు ముగింపు పలకాలి. ఇదే సమయంలో భారీ స్థాయిలో ఎగుమతులను ప్రోత్సహించాలి’ అని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల భాగస్వామ్యంతో ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.5లక్షల కోట్ల విలువను సృష్టించవచ్చని తెలిపారు. గత సంవత్సరం రూ.80వేల కోట్లుగా ఉన్న గ్రామీణ పరిశ్రమ విలువ ప్రస్తుతం రూ.లక్ష కోట్లకు చేరుకుందని స్పష్టం చేశారు. దీన్ని రూ.5లక్షల కోట్లకు తీసుకుపోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రక్షణరంగం, ఆటోమొబైల్స్‌తోపాటు మరిన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని.. వచ్చే ఐదు సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద హబ్‌గా మారబోతోందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.