అమెరికా-చైనా ఆర్థిక భద్రత సమీక్ష కమిషన్ నివేదిక
వాషింగ్టన్: భారత్ పొరుగుదేశం చైనా కుతంత్రాలు, కవ్వింపులు మరోసారి బయటపడ్డాయి. సరిహద్దుల్లో రెచ్చగొడుతూ డ్రాగన్ కావాలనే పక్క దేశాలతో ఘర్షణలు దిగుతోందని అమెరికా నిఘా సంస్థల కమిటీ ఒకటి తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన గల్వాన్ ఘర్షణలకు కూడా చైనా పక్కా పథకం రూపొందించినట్లు ఆ నివేదిక వెల్లడించింది.
అమెరికా-చైనా ఆర్థిక భద్రత సమీక్ష కమిషన్(యూఎస్‌సీసీ) తాజాగా అక్కడి కాంగ్రెస్‌కు ఓ నివేదిక సమర్పించింది. అందులో భారత్-చైనా మధ్య జరిగిన గల్వాన్‌లోయ ఘర్షణపై కీలక విషయాలు వెల్లడించింది. గల్వాన్ లోయలో చైనా ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా దాడులకు పాల్పడినట్లు నివేదిక పేర్కొంది. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నట్లు తెలిపింది.
‘జూన్ 15 ఘర్షణలకు కొన్ని వారాల ముందు చైనా రక్షణమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా ప్రభుత్వ అధీనంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రిక తన సంపాదకీయంలో గల్వాన్ లోయపై భారత్‌ను హెచ్చరిస్తూ ఓ వివాదాస్పద కథనం ప్రచురించింది. అమెరికా-చైనా శత్రుత్వంలో జోక్యం చేసుకుంటే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదని, చైనాతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు దెబ్బతింటాయని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో హెచ్చరించింది. మరోవైపు గల్వాన్ సంఘటనకు వారం ముందు డ్రాగన్ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు ధ్రువీకరించాయి. చైనా ఆర్మీకి చెందిన దాదాపు 1000 మంది జవాన్లు గల్వాన్ లోయలో మోహరించినట్లు శాటిలైట్ చిత్రాలు వెల్లడించాయి. వీటన్నింటిని చూస్తే డ్రాగన్ ఓ పథకం ప్రకారం హింసకు పాల్పడినట్లు అర్థమవుతోంది’ అని యూఎస్‌సీసీ నివేదిక పేర్కొంది. 2012లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్- చైనా మధ్య ఐదు సార్లు పెద్ద స్థాయిలో ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పిన అమెరికా.. ఈ ఏడాది వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రెచ్చగొట్టే ధోరణి వెనుక అసలు ఉద్దేశమేంటో స్పష్టం కావట్లేదని తెలిపింది.
లద్ధాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జూన్ 15న గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలతో పరిస్థితి మరింత జటిలమైంది. ఆ సంఘటనలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. చైనా వైపు కూడా చాలా మందే మరణించారు. అయితే ఆ సంఖ్యను చైనా ఇప్పటికీ వెల్లడించకపోవడం గమనార్హం. మరోవైపు 1975 తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.