వ్యాక్సిన్ సమర్థతను ప్రకటించని డ్రాగన్ సంస్థలు
ప్రజావినియోగం కోసం నియంత్రణ సంస్థల వద్దకు..
ఇంటర్నెట్ డెస్క్: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు చైనా పుట్టినిల్లు అన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా విషయంలో పాటించినట్లే వ్యాక్సిన్ విషయంలోనూ చైనా గోప్యతను పాటిస్తుందనే అనుమానం వ్యక్తమవుతోంది. కరోనా వ్యాక్సిన్‌లపై జరుగుతున్న ప్రయోగాల ఫలితాలను ప్రపంపవ్యాప్తంగా ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా, మానవ వినియోగానికి కీలకమైన మూడోదశ ప్రయోగ సమాచార విశ్లేషణలను కూడా అంతర్జాతీయ వ్యాక్సిన్ సంస్థలు ప్రకటిస్తున్నాయి. కానీ, చైనా కంపెనీలు మాత్రం తమ వ్యాక్సిన్‌ల ప్రయోగ సమాచారంపై గోప్యతను పాటిస్తున్నాయనే అభిప్రాయం నెలకొంది. అత్యవసర వినియోగం కింద లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తోన్న చైనా, ఇప్పటివరకు వ్యాక్సిన్ సమర్థతపై ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ప్రత్యర్థుల ప్రకటనలతో అప్రమత్తం..
గత కొన్నిరోజులుగా అంతర్జాతీయ వ్యాక్సిన్ కంపెనీలు ఆయా వ్యాక్సిన్‌ల సమర్థతపై మధ్యంతర విశ్లేషణ ఫలితాలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే మోడెర్నా, ఫైజర్, స్పుత్నిక్-వి, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లు 90శాతం సమర్థత కలిగివున్నట్లు ప్రకటించాయి. వీటిలో కొన్ని అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇవ్వాలంటూ నియంత్రణ సంస్థలను సంప్రదిస్తున్నాయి.ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాల ప్రత్యర్థి కంపెనీల ప్రకటనలతో చైనా అప్రమత్తమైంది. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద దాదాపు పది లక్షల మందికి వ్యాక్సిన్ అందించిన చైనా, నేరుగా ప్రజా వినియోగం కోసం చైనీస్ నియంత్రణ సంస్థల వద్ద దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఈ సమాచారాన్ని చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్(సీఎన్‌బీజీ) సంస్థ వెల్లడించింది. అయితే, వ్యాక్సిన్ సమర్థత, ప్రభావంపై బాహ్యప్రపంచానికి అటు సీఎన్‌బీజీ, దాని మాతృసంస్థ సినోఫార్మ్‌లు ఎలాంటి సమాచారాన్ని అందుబాటులో ఉంచలేదు. కేవలం తమ వ్యాక్సిన్‌లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని మాత్రమే ప్రకటించాయి. దీంతో మిగతా దేశాల వ్యాక్సిన్‌లతో పోలిస్తే చైనా వ్యాక్సిన్ సమర్థతను పోల్చలేకపోతున్నారు.
అత్యవసర వినియోగం కిందే పదిలక్షల మందికి..
సినోఫార్మ్ తయారు చేసిన రెండు వ్యాక్సిన్‌ల ప్రయోగాల సమాచారాన్ని చైనా నియంత్రణ సంస్థ నేషనల్ మెడికల్ ప్రాడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఎంపీఏ)కు అందజేశాయి. వీటి ఫలితాలను ఎన్‌ఎంపీఏ సమీక్షించనుందని సినోఫార్మ్ ఛైర్మన్ యాంగ్ షియోమింగ్ వెల్లడించారు. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద భారీస్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టిన చైనా, ఒకవేళ అనుమతి లభిస్తే మాత్రం ప్రజలకు అందుబాటులో ఉన్న రెండో దేశంగా నిలువనుంది. వ్యాక్సిన్‌ను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచిన దేశంగా రష్యా తొలిస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, నియంత్రణ సంస్థల అనుమతి లేకున్నా ఇప్పటివరకు పదిలక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సాధారణ ఉష్ణోగ్రతల వద్దే టీకా నిల్వ..!
చైనాకు చెందిన సినోఫార్మ్ అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్‌ల మూడో దశ ప్రయోగాలను 50వేల మందిపై ప్రయోగిస్తున్నట్లు సీఎన్‌బీజీ వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని పేర్కొంది. చైనాకు చెందిన మరో వ్యాక్సిన్ సంస్థ సినోవాక్ బయోటెక్ మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న ఒక వాలంటీర్ మరణించడంతో బ్రెజిల్‌లో కొంతకాలం ప్రయోగాలు నిలిపివేసింది. అయితే, సినోఫార్మ్ టీకాలను చైనా వ్యాప్తంగా భారీ సంఖ్యలో పంపిణీ చేస్తున్నారు. దీనిని నిల్వ ఉంచేందుకు సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతే సరిపోతున్నట్లు సినోఫార్మ్ వెల్లడించింది. ఇప్పటికే మలేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, యూఏఈ దేశాల్లో ప్రయోగాలు చేపట్టిన చైనా, ఆయా దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఇదిలాఉంటే, పలు అంతర్జాతీయ సంస్థలు ఆయా వ్యాక్సిన్‌ల సమర్థతలను వెల్లడిస్తున్న సమయంలో చైనా సంస్థల ఫలితాల వెల్లడి తప్పనిసరైంది. దీంతో త్వరలోనే చైనా వ్యాక్సిన్‌ల సమర్థతపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి..
చైనా టీకా: 10లక్షల మందికి పంపిణీ
ఆ రెండింటి కంటే ఆక్స్‌ఫర్డే బెటరేమో..!