శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బడ్జెట్‌పై ఆటోరంగ ఆశలివే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార‌త వాహ‌న‌రంగం 2019లో క‌నివినీ ఎరుగ‌ని స్థాయిలో గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంది. వాహ‌న విక్రయాలు భారీగా ప‌డిపోవ‌డంతో త‌యారీ సంస్థలు కుదేల‌య్యాయి. కొన్ని కంపెనీలైతే ప్రొడ‌క్షన్ హాలిడే కూడా పాటించాయి. మ‌రికొన్ని ఉద్యోగుల సంఖ్యలో కోత విధించి ఖ‌ర్చులు త‌గ్గించుకొని పొదుపులు పాటించాయి. భారత వృద్ధిరేటు సైతం అంత‌కంత‌కూ దిగ‌జారుతూ రావ‌డంతో ఏడాది మొత్తం ఏ ద‌శ‌లోనూ వాహ‌న‌రంగానికి ద‌న్ను ల‌భించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ప‌రిశ్రమ వ‌ర్గాలు రానున్న బడ్జెట్‌పై అనేక ఆశ‌లు పెట్టుకున్నాయి. జీడీపీ వృద్ధి రేటులో కీల‌క పాత్ర పోషించే వాహ‌న‌రంగానికి ఊత‌మిచ్చేలా ప‌లు నిర్ణయాలు ఉండొచ్చని ఆశిస్తున్నాయి. ఇంత‌కీ ఆటో రంగం ఆశిస్తున్న ప్రోత్సాహ‌కాలేంటో చూద్దాం..!

*గ్రామీణ భార‌త ఆర్థిక వ్యవ‌స్థ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో ప్రజ‌ల కొనుగోలు శ‌క్తి తీవ్రస్థాయిలో దెబ్బతింది. ఆ ప్రభావం వాహ‌నాల కొనుగోలుపైనా ప‌డింది. ప్రభుత్వం జీఎస్టీ త‌గ్గిస్తే.. వాహ‌న ధ‌ర‌లు త‌గ్గి ప్రజ‌లు విక్రయాల‌వైపు మళ్లే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. జీఎస్టీ రేటుపై తుది నిర్ణయం జీఎస్టీ మండలిదే అయినప్పటికీ.. ఆ దిశగా కృషికి  ప్రభత్వం నుంచి సానుకూల సంకేతాలు ఉంటాయని కంపెనీలు ఆశిస్తున్నాయి.

*రీ-రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు పెంచాల‌న్న డిమాండ్ కూడా ఉంది. త‌ద్వారా పాత వాహ‌నాల కొనుగోలు త‌గ్గి వినియోగ‌దారులు కొత్త వాటి వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.  అలాగే వినియోగ‌దారుల‌కు లబ్ధి చేకూరేలా స‌రికొత్త తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్ పాల‌సీ) తీసుకురావాల‌ని కూడా వాహ‌న సంస్థలు కోరుతున్నాయి.

*ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బీఎస్‌-6 వాహ‌నాల త‌యారీని ప్రోత్సహిస్తోంది. అయితే ఈ వాహ‌నాల‌ త‌యారీ ఖ‌ర్చు 8-10 శాతం పెరుగుతోంది. ఈ భారం వినియోగ‌దారుల‌పై ప‌డ‌కుండా బీఎస్‌-6 వాహ‌నాల‌పై ఉన్న 28 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి త‌గ్గించాల‌ని ప‌రిశ్రమ వ‌ర్గాలు కోరుతున్నాయి.

*లిథియం అయాన్ బ్యాట‌రీ సెల్స్ దిగుమ‌తిపై ఉన్న సుంకాన్ని త‌గ్గించాల‌ని ప‌రిశ్రమ వ‌ర్గాలు కోరుతున్నాయి. దీని వ‌ల్ల దేశీయంగా బ్యాట‌రీ ప్యాక్‌ల‌ను త‌యారుచేసుకునే వెసులుబాటు క‌లుగుతుందని.. భ‌విష్యత్తులో సెల్ త‌యారీ ప‌రిశ్రమ కూడా వృద్ధి చెందే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు. దీంతో సుంకాలు త‌గ్గి విద్యుత్తు వాహ‌నాలు కాస్త చౌక‌గా ల‌భించే అవ‌కాశం ఏర్పడుతుందని యోచిస్తున్నారు.

*ప‌ట్టణాభివృద్ధి శాఖ‌కు భారీ స్థాయిలో నిధులు కేటాయించాల‌ని ప‌రిశ్రమ వ‌ర్గాలు కోరుకుంటున్నాయి. దీంతో ప్రజా రవాణా సౌక‌ర్యాలు మెరుగుప‌రిచే అవ‌కాశం ల‌భిస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం కొత్త బ‌స్సులు, ఇతర వాణిజ్య వాహనాల్ని కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. 

*రిజిస్ట్రేష‌న్ ఛార్జీల్ని పెంచాల‌న్న యోచ‌న‌ను కూడా ప్రభుత్వం విర‌మించుకోవాల‌ని వాహ‌న రంగం కోరుతోంది.

*గ్రీన్ వెహికల్స్ వినియోగాన్ని ప్రోత్సహించేలా.. వాటి కొనుగోలుకు ఇచ్చే రుణాల‌పై క‌ట్టే వ‌డ్డీకి ఆదాయ‌ప‌న్ను రాయితీలు క‌ల్పించాల‌ని ప‌రిశ్రమ ఆశిస్తోంది.

మరికొన్ని రోజుల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆటోరంగ పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి ఇప్పటికే తమ అంచనాల్ని తెలియజేసినట్లు సమాచారం. ఇటీవల పలువురు పారిశ్రామికవేత్తలు ప్రధాని మోదీని కలిసిన సందర్భంలోనూ పారిశ్రామిక వర్గాల ఆశలు, అంచనాల్ని ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని