రోడ్డుమీద సైకిల్‌వాలా అమ్మే టీకి కూడా ఓ బ్రాండ్ ఇమేజ్‌ని తెచ్చే ప్రయత్నం చేస్తోంది దమయంతి.. ఇప్పటికే తమిళనాడులో ‘నమ్మకేఫ్’ పేరుతో సైకిల్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రోత్సహిస్తున్న ఈ అమ్మాయి త్వరలో దేశమంతటా ఈ రకం కేఫ్‌లని విస్తరించేందకు సిద్ధమవుతోంది...
స్విట్జర్లాండ్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుకుంది దమయంతి. ఇండియాకొచ్చాక కొత్తగా ఏదైనా చేయాలనుకుంది. భారతీయులు ఎక్కువగా ఇష్టపడే చాయ్‌నే మరింత రుచిగా, శుభ్రంగా, అందరికీ అందుబాటులోకి తెస్తే? అనే ఆలోచన చేసింది. అనుకున్నదే తడవుగా ఇక్కడ పరిస్థితులపై ఓ చిన్నపాటి అధ్యయనం చేసింది. కాఫీ తాగాలంటే కాస్త ఖరీదైన కేఫ్‌కి వెళ్లాల్సిందే. అదే టీ అయితే రోడ్డువారన కూడా దొరుకుతుంది. కానీ అది మగవాళ్ల అడ్డా. పైగా శుభ్రత అంతంత మాత్రంగానే ఉంటుంది. అలా కాకుండా కాఫీ, టీలను ఒకే చోట, అది కూడా తక్కువ ధరకే అందించాలనుకుంది. తాజా లెమన్ చాయ్, ఘుమఘుమల అల్లం చాయ్, సుగంధ దినుసులతో మనసుదోచే సులేమానీ టీ వంటి వాటితో ప్రయోగాలు చేసింది. అవి సక్సెస్ ఫుల్. కానీ తమిళనాడు అంటేనే ఫిల్టర్‌కాఫీ ఘుమఘుమలు కదా! ముఖ్యంగా సాయంత్రం పూట బీచ్‌వారన అమ్మే కారుపట్టీ కాఫీ(శొంఠి కాఫీ) తయారీతోనే చిక్కొచ్చిపడింది. వెంటనే ఇంటి కెళ్లింది. కాఫీ చేయడంలో చేయితిరిగిన అమ్మ, నాయనమ్మలతో కలిసి చాలా ప్రయోగాలు చేసింది. చివరికి అనుకున్న రుచిని సాధించింది. అసలు ఆ కాఫీ, టీల రుచి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రోడ్డువారన ఓ సాధారణ చాయ్‌వాలా అమ్మినట్టే అమ్మింది. ఇలా మూడు నెలలు చేసింది. ప్రజలు కోరిన మార్పులు చేసుకుంటూ చెన్నైలో ‘నమ్మకేఫ్’ పేరుతో దుకాణాలు తెరిచింది. తర్వాత పుదుచ్చేరి, కోయంబత్తూరు, చెన్నైలో కూడా ఈ కేఫ్‌లను విస్తరించింది. ఆసక్తి ఉన్న వారు తన బ్రాండ్ ఇమేజ్ వాడుకునే అవకాశం ఇస్తూ ఫ్రాంచైజీలను ఆహ్వానించింది. వాస్తవానికి రద్దీగా ఉండే వీధుల్లో సైకిల్ మీదే చాయ్‌వాలాలు టీలు అమ్ముతుంటారు. వారిని దమయంతి మరిచిపోలేదు. చిరువ్యాపారం చేయాలనుకునేవారికి ఓ సైకిల్, టీ, కాఫీలతో పాటూ శాండ్‌విచెస్, బ్రెడ్ అండ్ బటర్ వంటి క్విక్‌బైట్స్‌ని కూడా అందిస్తోంది. వాళ్లు లాభంలో కొంత మొత్తాన్ని ఇస్తే చాలు. నమ్మకేఫ్‌కు వెళ్తే అక్కడ గోల్డెన్ సులేమాన్, పసుపుతో చేసిన లవ్ ఎల్లో వంటి ఎనిమిది రకాల టీలు, శొంఠితో చేసిన కాఫీ వంటి నాలుగు రకాల కాఫీలను ఆస్వాదించవచ్చు. ధర పది నుంచి నలభై రూపాయల్లోపే. మరో వెయ్యి అవుట్‌లెట్లతో దేశమంతా విస్తరించడానికి సిద్ధంగా ఉన్న దమయంతికి ఈ ఆలోచన రావడానికి కారణం ఎవరో తెలుసా? తన తల్లి నిర్వహిస్తున్న నేచురల్స్ సెలూన్లే. దేశమంతా విస్తరించిన నాచురల్స్ సెలూన్లని మహిళలే నిర్వహిస్తున్నారు. పదివేలమంది మహిళలు వీటిపై ఆధారపడ్డారు. ఇప్పుడు చాయ్ దుకాణాల నిర్వహణ కూడా మహిళలకు ఇస్తే వాళ్లు ఆర్థికంగా బలపడతారనే ఆలోచనతోనే ఈ నమ్మకేఫ్ గొలుసుకట్టు దుకాణాలని ప్రారంభించానని అంటోంది దమయంతి.