కథామృతం

Updated : 18/05/2021 13:51 IST
అందరికీ వందనాలు

కథావిజయం 2020 పోటీల్లో తృతీయ బహుమతి (రూ.10 వేలు) పొందిన కథ

వైశాలితో పాటు గదిలోకి నడిచాడు శివనాథ్‌.

‘కూర్చోండి’ అంది వైశాలి మంచం పక్కన ఉన్న కుర్చీ చూపిస్తూ.

ఆ గదిలో ఇంకో కుర్చీ లేదు... వైశాలి ఎక్కడ కూర్చుంటుందా అన్నది గమనించాలి అన్నట్లు ఆగాడు శివనాథ్‌. అలమార పక్కన ఉన్న స్టూల్‌ ని వైశాలి అనువుగా అమరుస్తున్నప్పుడు శివనాథ్‌ కూర్చున్నాడు.

ఆమె కూడా కూర్చున్నాక శివనాథ్‌ గొంతు విప్పాడు. ‘మీరు ఏమీ అనుకోను అని అంటే ముందుగా నేను రెండు విషయాలు చెప్పాలి’ అన్నాడు.

‘చెప్పాలనుకున్నవి దాయకుండా బయటపెట్టాలనే కదా మనకి ఈ అవకాశం ఇచ్చింది’ అని వైశాలి మనసులో అనుకుంది. పైకి మాత్రం ‘చెప్పండి’ అంది.

ఎలా మొదలుపెట్టాలా, ఏ విషయం ముందు చెప్పాలా అన్న ఆలోచనకి ప్రేరణ దొరుకుతుందా అన్నట్లు గదిని పరీక్షగా చూడటంలో కొన్ని క్షణాలు గడిపాడు శివనాథ్‌. సాధారణ మధ్యతరగతి వాతావరణం కనబడటం అతనికి నచ్చింది... మనసులో ఉన్నది సూటిగా చెప్పచ్చు అన్న ధైర్యం కలిగింది.

పెళ్ళిచూపులలో ఏకాంతంగా అతను చెప్పబోయే మొదటి విషయం ఏమిటా అన్న కుతూహలం సహజంగానే వైశాలికి కలిగింది.

ఫోటోలో శివనాథ్‌ని చూసినప్పుడు ఎక్కడో తారసపడ్డ వ్యక్తి అన్న భావన కలిగింది వైశాలికి. కొన్ని నిముషాల క్రితం ముఖాముఖీ చూసినప్పుడు ఆ తారసపడటం అన్నది ఎలా జరిగిందో ఆమెకి చప్పున స్ఫురించింది.

వైశాలి ఒక స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నది. స్కూల్‌లో అదనంగా కొన్ని క్లాసు గదులు నిర్మించాలి అన్న ప్రతిపాదన తొమ్మిది నెలల క్రితం వచ్చింది.

తొమ్మిది నెలలల క్రితం అంటే... 2019 సంవత్సరం చివరి నెలలో ఇంకొన్ని వారాలలో మొత్తం ప్రపంచ జనాభాని భయకంపితులని చేసి వారి దినచర్యలలో జీవన శైలిలో పెను మార్పులు సృష్టించబోతున్న విపత్తు గురించి అప్పటికి ఎవరికీ తెలియదు.కొరోనా అన్న పదం వాడుకలోకి రాలేదు...లాక్‌ డౌన్‌ అంటే ఏమిటో జనబాహుళ్యానికి ఇంకొన్ని వారాల తరువాత అనుభవంలోకి రాబోయే రోజులు అవి...

భవన నిర్మాణానికి తమ వంతు సాయం అందించటానికి పూర్వ విద్యార్ధులు ముందుకు వచ్చారు.

చిత్రకారుడిగా దేశ వ్యాప్తంగా మంచి పేరున్న ఒక పూర్వ విద్యార్ధి అయితే తను గీసిన చిత్రాలని విరాళంగా ఇచ్చాడు. ఆ చిత్రాలని చక్కగా ప్రదర్శించే ఏర్పాట్లు చేసే బాధ్యత వైశాలికి ఇచ్చింది యాజమాన్యం.

స్థానిక టివి చానెల్స్‌ పుణ్యమా అని ఆ చిత్రకళా ప్రదర్శనకి మంచి ప్రచారం వచ్చింది. ఒకటొకటిగా చిత్రాలు అమ్ముడుపోసాగాయి.ఊహించినదాని కన్నా ఎక్కువ ఆదాయమే రావటం సంతోషం కలిగిస్తున్నా మిగిలిన ఒక చిత్రాన్ని మాత్రం కొనటానికి ఎవరూ ముందుకురాకపోవటం వైశాలికి చిత్రంగా తోచింది.

క్లాసు అయిపోయాక ప్రదర్శనా స్థలికి వెళ్ళింది వైశాలి..

ఇంకొన్ని రోజులలో ప్రదర్శన ముగుస్తుంది.అయినా వీక్షకులు ఇంకా వస్తూనే ఉన్నారు..అయితే ఆ రోజున మాత్రం మొదటి సారిగా అంతవరకూ ఎదురుపడని విషయం వైశాలి కంటపడింది.

అమ్ముడుపోని చిత్రం ముందు ఒకతను నిలబడి తదేకంగా చూస్తున్నాడు.

ఆ చిత్రాన్ని చూసిన పిల్లలు అయితే నవ్వుకోవటం పెద్దలు అయితే మొహం చిట్లించటం ఇంతవరకూ గమనించిన వైశాలికి గంటన్నర గడిచినా ఇంకొన్ని నిముషాలలో ప్రదర్శన మూసే సమయం అవబోతున్నాఏ ఇతర చిత్రాన్ని చూసే ఆసక్తి లేనట్లు అతను అలాగే శిలలా అక్కడే ఉండటం ఆశ్చర్యం కలిగించింది.

‘ఏమో!..అతగాడికి అంతగా నచ్చితే కొనేస్తాడేమో..’అనుకుందివైశాలి వినోదంగా.

ఆ చిత్రాన్నిఅతని కళ్ళతో అతని దృక్కోణంతో చూద్దాం అన్నట్లు అతని వెనకగా నిలబడింది వైశాలి.

చుట్టుపక్క గ్రామాలలో జరిగే బతుకమ్మ సంబురాలు,టాంక్‌ బండ్‌ పైన గణపతి నిమజ్జన ఊరేగింపులు మొదలయిన మిగిలిన చిత్రాలు అన్నీ అందరికీ పరిచమయిన దృశ్యాలే ..అయితే ఈ చిత్రం మాత్రం ముంబాయి నగర జీవితాన్ని చూపిస్తున్నది. జీబ్రా క్రాసింగ్‌ దాటుతున్న జనసమూహం చిత్రం అది.స్కూల్‌ బ్యాగులతో వివిధ వయసుల పిల్లలు, బ్రీఫ్‌ కేసులు బ్యాక్‌ ప్యాక్‌ లతో ఆడామగా ఉద్యోగులు, విద్యార్ధులు, లంచ్‌ డబ్బాలు ట్రాలీ పైన తీసుకువెడుతున్న డబ్బా వాలాలు , వాకింగ్‌ స్టిక్‌ సాయంతో నడుస్తున్న వృధ్ధులు అందరూ ఉన్నారు..పిల్లల యూనిఫార్ములు , ఉద్యోగుల దుస్తులు ,డబ్బావాలాల టోపీలు , వృధ్ధుల వయోభారం అన్నీ సుస్పష్టమయ్యే విధంగా చిత్రించాడు కానీ ఒక్కరికీ కనుముక్కులు లేవు..అన్నీ కోలగా ఉన్న బ్లాంక్‌ మొహాలు..

చిత్రంలో డజన్‌ కి పైగా ఉన్న ఆడ ఉద్యోగుల విద్యార్ధినుల దుస్తులు విభిన్నంగా ఉన్నాయి..చాలా ఆకర్షణీయమయిన రంగులతో డిజైన్లతో గీశాడు.. ఫ్యాషనబుల్‌ గా వేసుకునే చిరుగుల జీన్స్‌ పాంట్‌ ని, దూరంగా కనబడుతున్న హోర్డింగ్స్‌ ని కూడా ఫోటో తీసినంత స్పష్టంగా గీసిన ఆర్టిస్ట్‌ మనుషుల మొహాలని మాత్రమే కాకుండా బిచ్చగాడి పక్కన నిలబడి ఉన్న కుక్క మొహాన్ని కూడా ఎందుకు ఖాళీగా వదిలాడో అంతుపట్టని పజిల్‌ అనుకుంది వైశాలి.దీన్ని మోడరన్‌ ఆర్ట్‌ అనుకోవాలా జీవితంలో అనూహ్యంగా ఎదురయ్యి జటిలమయిన ప్రశ్నలు వేసి నిలదీసే సమస్యలకి ప్రతీక అనుకోవాలా అని వైశాలి అనుకుంటుంటే అతను వెనక్కి తిరిగి ఒక్క క్షణం వైశాలిని చూసి తిరిగి చిత్రం అంతరార్ధాన్ని మధనం చేసే పనిలో పడ్డాడు.

ప్రదర్శన ఎలా జరుగుతున్నదో కనుక్కోవటానికి చిత్రకారుడు ఆ రాత్రి ఫోన్‌ చేసినప్పుడు చిత్రాన్ని ఏక దీక్షగా చూస్తూ ఉండిపోయిన వ్యక్తి గురించి వివరంగా చెప్పింది వైశాలి.

కొన్ని నిముషాల క్రితం శివనాథ్‌ ని పరిచయం చేసినప్పుడు ‘ఓహో ఇతనే కదూ అప్పుడు ఆ చిత్రానికి అంతగా ఆకర్షితుడు అయిన వ్యక్తి’ అనుకుంది  వైశాలి. ఆ విషయం ఇప్పుడు ప్రస్తావించటం సబబుగా ఉంటుందా అన్న ఆలోచనలో ఉన్న వైశాలి‘మరీ అంత గంభీరమయిన విషయం కాదు..కాని జాగ్రత్తగా వినండి’అని శివనాథ్‌ అనటంతో అతని వంక తిరిగింది.

అప్పటికి శివనాథ్‌ ఏ విషయం ముందుగా చెప్పాలో ఒక నిర్ణయానికి వచ్చాడు.‘నేను చెప్పాలనుకున్న మొదటి విషయం...’ శివనాథ్‌ చెబుతూ చిన్నగా నవ్వాడు. ‘ అది విన్నాక ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతని చాలా దూరదృష్టితో రూపకల్పన చేశారు అని అనుకుని హాయిగా నవ్వుకోండి..పర్వాలేదు..ఈ అబ్బాయికి కాసింత స్కూ్ర లూజ్‌ అనుకున్నా నాకు అభ్యంతరం లేదు కాని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి.రాజ శేఖరం మాస్టారు నాకు చేసిన సాయం అంతా ఇంతా కాదు.రెండో పూటకి కడుపు ఎలా నిండుతుందా అన్న స్థితిలో ఉన్న నేను ఇంజినీర్‌ ని అయ్యాను అన్నా ఈ స్థాయికి రాగలిగాను అన్నా అంతా ఆయన చలవే!నేనేం చేసినా ఆ రుణాన్ని తీర్చుకోలేను.. ఆయన పేరు గుర్తుకి వచ్చేలాగా నిత్యం స్మరించేలాగా మొదటి సంతానానికి పెట్టుకోవాలి అనుకుంటున్నాను ...’ అంతవరకూ చెప్పాక ఆ మాటలు ఇంకా పొడిగిస్తే సభ్యత పరిధిని దాటినట్లు అవుతుందేమో అన్న శంకతో దృష్టి మరల్చి తల దించుకున్నాడు శివనాథ్‌.

పెళ్లి చూపులలో ఇటువంటి ప్రస్తావనా అన్న ఆలోచనతో వైశాలి నుదుటి మీద ముడతలు ప్రత్యక్షమయ్యాయి.అంతలోనే ఒక అల్లరి ఊహ మెదడులో మెదిలి చిరునవ్వు ప్రత్యక్షమవటంతో మొహం ప్రసన్నంగా మారింది. సరిగ్గా అప్పుడే శివనాథ్‌ తల ఎత్తి ఆమె వంక చూశాడు. ‘చిన్నప్పుడే తల్లి తండ్రులని పోగొట్టుకున్నాను..రాజశేఖరం మాస్టారు సాయం చేసేంతవరకూ చాలా రోజులు దైన్యమయిన జీవితాన్ని గడిపాను.కడుపు నింపుకోవటానికి అందుబాటులో ఉన్న ప్రతిపనీ న్యాయబద్ధంగా చేశాను..ఆ విషయం చెప్పుకోవటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను...అలాగే..’ అంటూ వాక్యాని పూర్తి చేయకుండా ఆపాడు.

నాతొ జీవితాన్నిపంచుకునే సహచరి కూడా అలాగే భావించాలని అనుకుంటున్నాను అన్నది శివనాథ్‌ చెప్పకుండా వదిలిన భాగం అనుకుంది వైశాలి.ఏవేవో నియమ నిబంధనలు పెడుతున్నట్లుగా కాకుండా నచ్చచెప్పే విధంగా తన కోరికలు వివరించిన విధానం వైశాలికి నచ్చింది.

ఆ తరువాత కొరోనా సమయంలో ఉద్యోగ విదులకి హాజరు అవటంలో ఇబ్బందుల గురించి మాటలు దోర్లుతున్నప్పుడు వైశాలి చెప్పింది ‘మా స్కూల్‌ లో చిత్ర ప్రదర్శన జరిగినప్పుడు మీరు వచ్చారు..’

‘అవును ..’ అన్నాడు శివనాథ్‌.అతను క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాడు అని మాత్రమే అనుకుంది వైశాలి అప్పుడు.

అయితే పెళ్లి అయ్యి కాపురం పెట్టాక అతన్ని ఆకర్షించిన చిత్రాన్ని  ఇంట్లో చూశాక  క్లుప్తంగానే కాదు అతని మాటలు నర్మగర్భంగా కూడా ఉంటాయి అని ఆమెకి తెలిసింది.

‘మీరు వచ్చి వెళ్ళిన తరువాతి రోజు ఆర్టిస్ట్‌ ఫోన్‌ చేసి నాట్‌ ఫర్‌ సేల్‌ అన్న సూచిక పెట్టమని చెప్పాడు..మరి అది మీ దగ్గరకి ఎలా వచ్చింది?’ వైశాలి అడిగింది.

శివనాథ్‌ చిన్నగా నవ్వాడు.మెల్లగా చెప్పసాగాడు.చిత్రం అతనికి అంతగా ఎందుకు నచ్చిందో అతనికి స్పష్టంగా తెలియదు. కాని దాన్ని సొంతం చేసుకోవాలన్న కోరిక మాత్రం బలంగా కలిగింది. చిత్రానికి చెప్పిన ధర ఎక్కువో తక్కువో చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు కాని నా బడ్జెట్‌ కి మాత్రం అది అందనిది అనుకున్నాడు శివనాథ్‌.చివరికి ధైర్యం చేసి ముంబాయిలో ఉన్న ఆర్టిస్ట్‌ ఫోన్‌ నెంబర్‌ సంపాదించి మాట్లాడాడు. పెయింటింగ్‌ తనకి బాగా నచ్చింది అని స్కూల్‌ కి వచ్చే విరాళానికి గండి కొట్టే ఆలోచన లేదని కొంచం సమయం ఇస్తే ఆ మొత్తాన్ని వాయిదాల రూపంలో స్కూల్‌ కి ఇస్తాను అని చెప్పాడు.ఆర్టిస్ట్‌ ఒప్పుకుంటాడు అని శివనాథ్‌ అనుకోలేదు..ఎగతాళి చేసి కాల్‌ కట్‌ చేస్తాడు అనుకున్నాడు. అయితే ‘పెయింటింగ్‌ ముందు గంటల తరబడి నుంచున్నది మీరేనా?’ అన్న ప్రశ్న అటునుంచి రావటంతో శివనాథ్‌ ఆశ్చర్యపోయాడు. అవును అని శివనాథ్‌ చెప్పాక ‘వారం తరువాత నేను హైదరాబాద్‌ వస్తున్నాను..అప్పుడు నేనే స్వయంగా ఆ పెయింటింగ్‌ నా చేతులతో మీకు ఇస్తాను’ అన్నాడు ఆయన.

ఆ విధంగా నాట్‌ ఫర్‌ సేల్‌ అన్న సూచిక సంపాదించుకుని ఆ పెయింటింగ్‌ శివనాథ్‌ దగ్గరకి చేరింది.

‘మిమ్మల్ని ఆ పెయింటింగ్‌ ఎందుకంతగా ఆకట్టుకుంది?’వైశాలి భర్తని అడిగింది.

ఇబ్బందిగా నవ్వాడు శివనాథ్‌ ‘ఇప్పుడు ఆ సంగతి మాట్లాడటం నాకు ఇష్టం లేదు..ఎందుకు అంటే రెండు కారణాలు ఉన్నాయి..మొదటిది ..ఫలానా అందుకు నచ్చింది అన్న విషయం నాకే పూర్తిగా బోధపడకుండా  గజిబిజిగా అస్పష్టంగా ఉంది..అదీ ఇదీ అని కచ్చితంగా చెప్పలేను....రెండో కారణం ఏమిటంటే ఇప్పుడే మనం ఇద్దరం కలిసి కొరోనా భయం నీడలో కొత్త జీవితం తీయగా ఆరంభిస్తున్నాం..ఇంకొన్ని చేదు విషయాలని జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇది కాదేమో అన్న సందేహం ఉంది......’

అర్ధమయ్యింది అన్నట్లు తల ఊపి అతని భుజం పైన చేయి వేసింది వైశాలి.నిజానికి ఆమెకి అర్ధమయ్యింది ఏమీ లేదు..

శివనాథ్‌ ప్రతీ ఉదయం కాఫీ గ్లాసు పట్టుకుని ఆ చిత్రం ముందు నిలబడి చూస్తూ కాఫీ తాగటం గమనించినప్పుడు ఈయనగారికి ఆ చిత్రంలో ప్రతీ రోజూ ఏ అర్ధం ఇంకే పరమార్ధం స్ఫురిస్తున్నాయో అంత తదేకంగా చూస్తున్నారు అనుకుని నవ్వుకునేది వైశాలి.

దేశంలో క్రమంగా కొరోనా కేసులు తగ్గుముఖం పట్టసాగాయి..మెల్లగా జనజీవనం సాధారణ స్థితికి రాసాగింది. ఇంకొన్ని రోజులు జాగ్రత్తలు పాటిస్తే చాలు రేపో మాపో టీకా వచ్చేస్తుంది అన్న ఆశ అందరిలో పెరిగింది.

రాజశేఖరం మాస్టారు నుంచి ఆ రోజున ఉత్తరం వచ్చింది.ఉత్తరం భార్యకి చూపిస్తూ శివనాథ్‌ ‘వైశాలి! నాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి పెళ్లి అయిన వెంటనే వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుందాం అనుకున్నాను.అయితే ఆ సమయంలో ప్రయాణాలు చేయటం మంచిదికాదు అని ఆయన వద్దు అన్నారు.ఇప్పుడు పరిస్థితి దాదాపు సాధారణ స్థితికి వచ్చింది కదా..వచ్చే నెల రైళ్ళు తిరిగి పట్టాలు ఎక్కాక రమ్మనమని అన్నారు..’సంబరంగా అన్నాడు.

‘మా స్కూల్‌ లో కూడా పెద్ద తరగతులకి క్లాసులు మొదలవుతాయి అని అంటున్నారు..’ అంది వైశాలి.

‘అలాగా?..అంటే నీకు సెలవ దొరకదా?..’అనుమానంగా అడిగాడు శివనాథ్‌.

‘సెలవ దొరకదు అన్నది నిజమే కాని అసలు సెలవ అక్కరలేదు..ఆయన ఉండేది అనంతపూర్‌ దగ్గర కదా..శనివారం రాత్రి ట్రైన్‌ లో వెళ్లి ఆయన్ని కలిసి తిరిగి రాత్రి ట్రైన్‌ ఎక్కితే సోమవారం పొద్దున్న కల్లా  హైదరాబాద్‌ లో ఉంటాం..ఇక సమస్య ఏముంది?’ అంది వైశాలి.

‘అమ్మయ్యా!..ఇక రిజర్వేషన్లు ప్రారంభం అయ్యే రోజున ఠంచన్‌ గా కంప్యూటర్‌ ముందు కూర్చుని టికెట్లు కొనుక్కోవటమే మిగిలింది..’అన్నాడు శివనాథ్‌ పొంగిపోతూ.

‘అప్పుడు అడిగితే కొత్తగా పెళ్లి అయిన రోజులు అని ఏమీ చెప్పలేదు..ఇప్పుడు పరిస్థితులు కూడా మెరుగవుతున్నాయి కదా.. ఇప్పుడు చెప్పచ్చు కదా..’అతని ఆనందాన్ని అవకాశంగా తీసుకుని వైశాలి అడిగింది.

‘చెబుతాను..’అని శివనాథ్‌ అంటుంటే వైశాలి అడ్డుపడింది. ‘ముందు నాదో సందేహం తీర్చండి..పెళ్ళిచూపులలో మొదటి సంతానం ఆయన పేరు అని అన్నారు కదా..ఒకవేళ..’ ఆ నాడు కలిగిన చిలిపి ఊహ ఇంకోసారి పలకరించటంతో వైశాలి వదనం చిరునవ్వుతో మెరిసింది.

ఆ చిరునవ్వుని సరిగ్గా అనువదించి అర్ధం చేసుకున్న  శివనాథ్‌ ఇప్పుడు అడ్డు తగిలాడు ‘అబ్బాయి అయితే పర్వాలేదు ముందుగా అమ్మాయి పుడితే పేరేం పెడతారు అని కదా నీ సందేహం?..రాజశ్రీ అని కాని రాజ అన్న శబ్దం పలికేలాగా నీకు నచ్చే విధంగా వేరే పేరు సూచించమని నిన్ను అడిగేవాడ్ని..’

ఆ వివరణ వైశాలికి నచ్చింది.

రాజశేఖరం మాస్టారు చేసిన సాయం గురించి ఆ తరువాత శివనాథ్‌ చెప్పాడు.

శివనాథ్‌ ఏడో తరగతి చదువుతున్నప్పుడు మోపెడ్‌ మీద వెడుతున్న శివనాథ్‌ తల్లితండ్రులు లారీ ఢి కొట్టటంతో మరణించారు.శివనాథ్‌ తండ్రి చిన్నపాటి ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవాడు.తండ్రి మరణం తరువాత యాజమాన్యం నుంచి కొద్ది మొత్తం శివనాథ్‌ కి అందింది.

దాన్ని అందుకోవటం అయితే సందేహం లేకుండా చేశాడు కాని ‘ఈ డబ్బుతో నిన్ను పోషించటమే కష్టం..ఇక చదువుకూడా చెప్పించాలా ?..నా వల్ల కాదు..’అన్నాడు వేరే ఊరిలో ఉన్న మేనమామ.

‘మా ఊర్లో అయితే స్కూలే లేదు..’అన్నాడు పెదనాన్న.

పెదనాన్న మేనమామల తగవుల గుంజాటనలో డబ్బు ఏమయ్యిందో కాని మాయమయ్యింది.

మంచి విద్యార్ధి చదువుకి ఆటంకం రాకూడదు అని రాజశేఖరం మాస్టారు పూనుకుని స్కూల్‌ ఫీజ్‌ కట్టారు.. ఇక మిగిలిన విషయాలకి కూడా ఆయనని ఇబ్బంది పెట్టటం భావ్యం కాదు అని శివనాథ్‌ న్యూస్‌ పేపర్లు పాల పాకెట్లు వేయటం మొదలుపెట్టాడు. దొరికిన పని చేస్తూ శివనాథ్‌ రెండున్నర ఏళ్ళు చాలా అవస్థలు పడ్డాడు.

పదవతరగతిలో మంచి మార్కులు వస్తే కొన్ని కళాశాలలు హాస్టల్‌ వసతితో పాటు ఇంటర్‌ ,యంసెట్‌ శిక్షణ ఉచితంగా అందిస్తారు..గుర్తుంచుకో అని రాజశేఖరం మాస్టారు చెప్పిన మాటలు మనసులో పెట్టుకుని శివనాథ్‌ ఆ లక్ష్యాన్ని సాధించాడు.అలాగే సవాళ్ళని ఎదుర్కుంటూ యంసెట్‌ పరీక్ష కూడా బాగా రాశాడు..

‘ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యింది అని యంసెట్‌ రెండో సారి నిర్వహించారు.మొదటి పరీక్ష రాయగానే హాస్టల్‌ ఖాళీ చేయాల్సి వచ్చింది,నిలవ నీడ లేని నాకు ఆ తరువాత రాజశేఖరం మాస్టారు ఆశ్రయం ఇచ్చారు.రెండో సారి యంసెట్‌ పరీక్ష ఎలా రాస్తానో అన్నదానికన్నా అసలు పరీక్షకి సమయానికి హాజరు అవగాలనా లేదా అన్న ప్రశ్న భూతంలాగా నన్ను భయపెట్టే పరిస్థితి ఎదురయ్యింది..’ శివనాథ్‌ చెప్పాడు.

‘ఏమయ్యింది?’ కుతూహలంగా అడిగింది వైశాలి. 

శివనాథ్‌ పరీక్ష రాయాల్సిన  కళాశాల చాలా దూరంగా పొలిమేరలలో ఉంది.ఒక్క నిముషం ఆలస్యం అయినా లోపలి రానివ్వరు కాబట్టి ఉదయాన్నే బయల్దేరి వెళ్ళాలి అనుకున్నాడు శివనాథ్‌.

అతనితో పాటు హాస్టల్‌ లో ఉన్న ఇంకో ఇద్దరికీ ఆ కళాశాల దగ్గరిలోనే పరీక్ష ఉంది.’మాతో పాటు  ఆటోలో వస్తే సగం దూరం పైగా వెడతావు..ఆ తరువాత నువ్వు బస్సు ఎక్కితే అరగంటలో నీ సెంటర్‌ కి వెళ్ళచ్చు..’అన్నారు వాళ్ళు.

వాళ్ళు ఆటోలో నన్ను బస్‌ స్టాప్‌ దగ్గర దింపి ఏ బస్సు ఎక్కాలో చెప్పారు.ఇంకా రెండు గంటల పైగా సమయం ఉంది పర్వాలేదు అన్న ధీమాతో నన్ను ఏడిపించాలని జోక్‌ చేశారేమో తెలియదు కాని వాళ్ళు చెప్పింది తప్పు దోవ...ఆ సంగతి పావు గంట బస్సు ప్రయాణం తరువాత తెలిసింది శివనాథ్‌ చెప్పాడు.

అప్పుడు ఏమయ్యింది?వైశాలి అడిగింది.

శివనాథ్‌ ఇంకో బస్సు ఎక్కాడు.గంట తరువాత కరక్ట్‌ స్టాప్‌ లోనే దిగాడు.అక్కడ నుంచీ కాలేజీ కిలోమీటర్‌ దూరం అని చెప్పారు.ఇంకో బస్సు ఎక్కటం ఎందుకు అని శివనాథ్‌ పరుగులాంటి నడక అందుకున్నాడు.

నా దగ్గర వాచ్‌ లేదు..టైమ్‌ ఎంత అయ్యిందో తెలియదు.ఎందుకయినా మంచిది అని పరుగు వేగం పెంచాను.అలా హడావిడిలో మలుపు తిరుగుతూ చూసుకోకుండా ఎదురుగా వస్తున్న ఒక కారు కింద పడబోయాను.. శివనాథ్‌ చెప్పాడు.

కారు నడుపుతున్న ఆయనకి శివనాథ్‌ పైన పట్టరాని ఆగ్రహం వచ్చింది. తప్పు నీదే అయినా నీకు ఏమన్నా అయితే నేను ఇబ్బందులలో పడేవాడ్ని రాస్కల్‌! అంటూ చెయ్యి ఎత్తాడు.

పరీక్ష టైమ్‌ అవుతున్నది సార్‌..క్షమించండి అంటూ చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు శివనాథ్‌.

ఆయన కరిగినట్లు కనబడ్డాడు.పరీక్ష ఎక్కడ అని కనుక్కుని కారులో కాలేజీ దగ్గర దింపుతాను అన్నాడు.

నిజంగా మీరు లక్కీ.. అంది వైశాలి అంతవరకూ జరిగినది విని.

శివనాథ్‌ సన్నగా నవ్వాడు. అయిదు నిముషాలు తరువాత ఆయన నన్ను దిగమన్నాడు. పక్కన కూర్చున్న కూతురి మీద నుంచి ఒంగుని కిటికీలోకి తల పెట్టి రోడ్డు మీద నిలబడ్డ నన్ను చూస్తూ ఉమ్మి ఒళ్ళు దగ్గరపెట్టుకుని రోడ్డు మీద నడవటం నేర్చుకో..దిసీజ్‌ ఏ లెసన్‌ టు యూ..ఇప్పుడు ఆ కాలేజీ ఇంకో కిలోమీటర్‌ దూరం ఎక్కువ..అని అన్నాడు

వరుసగా ఎన్ని దురదృష్టాలు వెంటాడాయి!..వైశాలి ఊపిరి బిగపెట్టి వినసాగింది.

నాకు ఏడుపు తన్నుకు వచ్చింది.ఇలా అయితే సమయానికి పరీక్షకి హాజరు అవటం సాధ్యమేనా?నాకు చాలా విరక్తి వచ్చింది.దురదృష్టవంతుడ్ని..అనాధని అయ్యాను..ఇప్పుడుయంసెట్‌ రాయలేకపోతున్నాను..అనుకుంటూ నిలబడ్డాను.కారు మెల్లగా కదిలి ముందుకి వెడుతుంటే కారు లోంచి రుమాల పడింది..ఊహూ!.. పడింది అనటం సరికాదు.ఆయన కూతురు కావాలని కిటికీలోంచి చేయి కిందగా పెట్టి జాగ్రత్తగా రోడ్డు మీద రుమాల వదిలింది అని గ్రహించి ఒంగుని తీశాను.రుమాలలో రెండు పది రూపాయల నోట్లు ఉన్నాయి.. ఆ అమ్మాయి డబ్బు ఎందుకు ఇచ్చింది?...టైమ్‌ ఎక్కువలేదేమో ఆటోలో వెళ్ళటానికి పనికి వస్తాయి అని ఇచ్చి ఉంటుంది అన్న జవాబు కొన్ని క్షణాల తరువాత స్ఫురించింది ఆ నాటి సంగతులు గుర్తు చేసుకుంటూ చెప్పాడు శివనాథ్‌.

సమయానికి ఆటో దొరికింది.చిన్న చిన్న అవాంతరాలు ఎదురయినా అనుకున్నది సాధించే అవకాశ ద్వారాలు తెరిచే ఉంటాయి అన్న ప్రేరణ అతనికి స్ఫూర్తిని ఇచ్చింది. పరీక్ష చక్కగా రాశాడు.

యంసెట్‌ లో మంచి రాంక్‌ రావటం స్కాలర్‌ షిప్‌ రావటం జీవితంలో తీపి మలుపులు.. రాజశేఖరం మాస్టారి ఔదార్యంతో ఇబ్బందులు లేకుండా చదువు పూర్తి చేసుకున్నాను..ఇంకొంచం కష్టపడితే ఉద్యోగం దొరికింది అదీ నా కథ..’ అని శివనాథ్‌ ముగించాడు.

ట్రైన్‌ రిజర్వేషన్లు మొదలు పెట్టిన రోజు వైశాలి చూసేసరికి వెయిటింగ్‌ లిస్ట్‌ అయిదు నడుస్తున్నది. తరువాత శివనాథ్‌ కి ఆ విషయం చెబుతూ ఇప్పటికి వెయిటింగ్‌ లిస్ట్‌ అయిదు ఆరు....చూద్దాం దొరకచ్చు...అంది.

ఎలాగయినా మొదటి అవకాశంలోనే మనం వెళ్ళాలి వైశాలి! అన్నాడు శివనాథ్‌.

రెండు రోజుల తరువాత వెయిటింగ్‌ లిస్ట్‌ ఒకటి రెండు కి చేరి ఆ మర్నాడు ఖాయం అయ్యాయి.

చూశారా..మీ సంకల్పం గట్టిది.వెళ్ళాలి అనుకున్నారు..అలాగే అవుతున్నది..’అంది వైశాలి.అంతలోనే సన్నగా నవ్వుతూ నిజానికి మీరు నాకు థాంక్స్‌ చెప్పాలి..నా లక్కీ హాండ్స్‌ తో బుక్‌ చేశాను..టికెట్లు దొరికాయి.... తల ఎగరవేస్తూ చెప్పింది.

తప్పకుండా థాంక్స్‌ చెబుతాను..నిజానికి టికెట్లు దొరికినందుకు మనం ముఖ్యంగా కృతఙ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళని కూడా విస్మరించకుండా స్మరించుకోవాలి కదా..అన్నాడు శివనాథ్‌ వెళ్ళి పెయింటింగ్‌ ముందు నిలబడుతూ.

అయోమయంగా అతని పక్కన నిలబడింది వైశాలి.

ఆ చిత్రంలో దాగున్న మర్మమో రహస్యమో తెలిసింది  అన్నట్లు శివనాథ్‌ పెదవులు చిరునవ్వుతో మెరిశాయి.

టికెట్లు దొరికాయి కాబట్టి బుక్‌ చేసిన నీది లక్కీ హాండ్‌ అన్నావు..థాంక్స్‌ చెప్పించుకోవాలి అనుకున్నావు..కానీ మన ప్రయాణం ఖాయం అవటానికి నీ చేతిలో అదృష్టం ఉంది అని అనుకోవటానికి ముఖ్య కారణం అయిన వారి గురించి నువ్వు పట్టించుకోలేదు.. అతని స్వరంలో ఆరోపణ లేదు ఆలోచించు అన్న మెత్తటి సూచన ఉంది.

ఆ మాటలు మెత్తగా అయినా గుచ్చుకున్నాయేమో ఎవరండీ ఆ మహానుభావులు ?వ్యంగ్యంగా అడిగింది వైశాలి.

ముందుగా కొనుక్కుని ఆ తరువాత టికెట్లు రద్దు  చేసుకున్న వారి వల్ల మన ప్రయాణం ఖాయం అయ్యింది వాళ్లెవరో మనకి తెలియదు కానీ నిజానికి వాళ్ళకి థాంక్స్‌ చెప్పాలి కదా!?వాళ్ళు ఈ బ్రీఫ్‌ కేస్‌ పట్టుకున్న వ్యక్తి లా ఉండచ్చు..చేతిలో వాకింగ్‌ స్టిక్‌ ఉన్నా నిటారుగా నడుస్తున్న ఈవిడ కావచ్చు..వీళ్ళ పోలికలు కనబడవుఅలాగే టికెట్‌ వద్దు అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకి తెలియదు..

వైశాలి అప్రయత్నంగా తల ఊపింది..శివనాథ్‌ ని ఆ పెయింటింగ్‌ అంతగా ఆకర్షించటానికి కారణం లీలగా తెలిసినట్లయ్యింది.

అసలే హడావిడి పడుతున్న నన్ను తండ్రి ఇంకా ఇబ్బంది పెట్టాడు అని జాలిపడ్డ అమ్మాయిని నేను  సరిగ్గా చూడనే చూడలేదు.. ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు.. వయసు తొమ్మిదా పదా పన్నెండా .. ఊహూ నాకు తెలియదు.. నాకు తెలిసింది ఏమిటంటే సాయం చేయాలి అన్న గొప్ప మనసు ఆ అమ్మాయికి ఉంది అని మాత్రమే.. ఈ నీలం డ్రెస్‌ చూస్తుంటే ఆ రోజు ఆ అమ్మాయి డ్రెస్‌ గుర్తుకి వస్తుంది.ఆమె సాయం ఏమయ్యేది? పరీక్ష రాసేవాడ్ని కాదు... నా జీవితం ఏమయ్యేదో!?... అనుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటాను... ఒంగి నడుస్తున్న ఈయనని చూస్తే పెదనాన్న గుర్తుకి వస్తాడు. చదువు చెప్పించకపోయినా నా తమ్ముడి కొడుకుని పోషించుకుంటాను అని పెదనాన్న పంతం పట్టి ఉంటే ఎన్ని కష్టాలలో ఉండేవాడినో అని తలచుకుంటే ఉద్యోగంలో ఎదుర్కుంటున్న సమస్యలు దూదిపింజలలాగా ఎగిరిపోతాయి.. ఒక్కొక్క సారి ఒక్కొక్క విషయం ఒక్కొక్క వ్యక్తీ గుర్తుకి వస్తారు....’’ గొంతుకి ఏదో అడ్డు వచ్చినట్లు శివనాథ్‌ మాటలు ఆగాయి.

‘అవును నిజమే అనుకుంది’ వైశాలి... వైశాలి టెన్త్‌ పరీక్షకి వెడుతున్నప్పుడు హాల్‌ టికెట్‌ పడిపోయింది... చూసుకోకుండా వెళ్లిపోతుంటే పరుగున వచ్చి ఒక చిన్నపిల్లాడు ఇచ్చాడు.

శివనాథ్‌ భుజం పైన చేయి వేసి పక్కన నిలబడి పెయింటింగ్‌లో ఆ పిల్లాడిని గుర్తు పట్టే ప్రయత్నం చేసింది వైశాలి. 

- కె.శ్రీఉదయిని; 92468 49318

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని