ప్రధానాంశాలు

Published : 10/05/2021 17:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Gates Divorce: అందుకే మెలిందా మది విరిగిందా?

సియాటిల్‌: దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు బిల్‌గేట్స్‌ - మెలిందా దంపతులు. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోడవడం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కాదు. ఏడాదిన్నర కాలంగా గేట్స్‌ దంపతులు విడాకులపై సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిపారట. విడిపోవడానికి దారితీసిన కారణాలను ఈ జంట  చెప్పనప్పటికీ.. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గేట్స్‌ సంబంధాలు నచ్చని మెలిందా ఆయన నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ పత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది. 

1994లో బిల్‌గేట్స్‌, మెలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 18-25 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలున్నారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకున్న ఈ జంట.. విడిపోతున్నట్లు మే 3న సంయుక్త ప్రకటన చేసింది. అయితే విడాకుల నిర్ణయాన్ని వీరిద్దరూ చాలా కాలం క్రితమే తీసుకున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ కథనం తెలిపింది. తమ దాంపత్య బంధం ‘తిరిగి కొనసాగించలేని విధంగా ముక్కలైంది’ అని చెబుతూ మెలిందా 2019 అక్టోబరులోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. మహమ్మారి విజృంభణ సమయంలో దీనిపై సుదీర్ఘ చర్చల అనంతరం విడాకులపై పరస్పర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌ సంబంధాలు నెరపడం మెలిందాకు నచ్చలేదని, దీనిపై ఇద్దరి మధ్యా విబేధాలు వచ్చాయని బిల్ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ మాజీ ఉద్యోగి ఒకరు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్‌ కథనం పేర్కొంది. 2013లో ఓ దాతృత్వ కార్యక్రమం కోసం గేట్స్‌ దంపతులు ఎప్‌స్టీన్‌ను కలిశారు. అయితే అతడి ప్రవర్తనతో తాను సౌకర్యంగా లేనని మెలిందా అప్పుడే గేట్స్‌కు చెప్పారు. కానీ ఆమె ఆందోళనను విస్మరించి గేట్స్‌, కంపెనీ ఉద్యోగులు కొందరు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు కొనసాగించారు. గేట్స్‌, ఎప్‌స్టీన్‌ పలుమార్లు కలిశారని, ఒక రాత్రంతా గేట్స్‌ అతడి నివాసంలోనే ఉన్నాడని 2019లో అమెరికా పత్రికలు కథనాలు రాశాయి. అయితే తనని కలిసిన మాట వాస్తవమేనని, కానీ తమ మధ్య ఎలాంటి వ్యాపార సంబంధాలు, స్నేహ బంధాలు లేవని అప్పట్లో గేట్స్‌ చెప్పారు. ఆ తర్వాత నుంచి దంపతుల మధ్య పొరపచ్చాలు చినికి చినికి విడాకులకు దారితీసినట్లు వాల్‌స్ట్రీట్‌ తన కథనంలో పేర్కొంది.

2020 ఆరంభంలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తాము పాల్గొనట్లేదని చెపి గేట్స్‌ దంపతులు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకు మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌, బెర్క్‌షైర్‌ హాథవే బోర్డుల నుంచి తాను తప్పుకుంటున్నట్లు గేట్స్‌ ప్రకటించారు. అప్పటికే వీరి మధ్య విడాకులు, ఆస్త పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. అప్పటికే వీరు లాయర్లను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సదరు కథనం వెల్లడించింది. 

ఎవరీ ఎప్‌స్టీన్‌..

వృత్తిపరంగా ఫైనాన్షియర్‌ అయిన జెఫ్రీ ఎడ్వర్డ్‌ ఎప్‌స్టీన్‌ బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసుల్లో 2019 జులైలో అరెస్టయ్యాడు. కోర్టులో విచారణ జరుగుతుండగానే అదే ఏడాది ఆగస్టులో జైలులోనే అనారోగ్యంతో మృతి చెందాడు. 

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net