హాయ్ బుజ్జీ

Published : 22/12/2020 02:09 IST
ప.. ప.. పాము కాదు.. బ.. బ.. బల్లే!

బుజ్జి నేస్తాలూ! ఈ చిత్రాల్లోని జీవులను చూసి పాములు అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ‘కళ్లెదుట అంత చక్కగా పాములు కనిపిస్తుంటే.. తప్పులో కాలు అంటారేంటి?’ అని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి ఇవి సర్పాలు కానే కావు. బల్లి జాతికి చెందిన జీవులు. వీటిని ‘కాళ్లు లేని బల్లులు’ అని పిలుస్తుంటారు. వీటి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉందా?.. అయితే ఇంకెందుకాలస్యం.. చదివేయండి మరి!  

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 రకాల ‘కాళ్లు లేని బల్లుల’ రకాలు జీవిస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం ఉత్తర అమెరికాలో, మరి కొన్ని రకాలు యూరప్‌, ఆసియా, ఆస్ట్రేలియాలో కనిపిస్తున్నాయి. మన భారతదేశంలోనూ వీటి ఉనికి ఉంది. ఇవి కొండలు, గుట్టలు, గడ్డి నేలల్లో జీవించగలవు. ఏటా కొన్ని వేల ఈ కాళ్లు లేని బల్లులు ప్రపంచవ్యాప్తంగా మన మనుషుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. వీటిని చూసి పాములని పొరబడుతుండటమే దీనికి ప్రధాన కారణం. నిజానికి ఇవి చూడటానికి అచ్చం పాముల్లాగే ఉంటాయి! వాటిలాగే పాకుతాయి కూడా!
కానీ సర్పాలకు, వీటికి కొన్ని భేదాలూ ఉన్నాయి. ముఖ్యంగా వీటికి కనురెప్పలుంటాయి. కానీ పాములకు ఉండవు. ఇవి గరిష్ఠంగా రెండు నుంచి మూడు అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. నత్తలు, పురుగులు, చిన్న చిన్న పక్షుల్నీ తింటాయి. ప్రధానంగా కీటకాలను తిని మన మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. మానవులు, పక్షులు, అడవి పిల్లులు, నక్కలు వీటికి ప్రధాన శత్రువులు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీటి జాతుల్లో 50 శాతం గుడ్లు పెట్టి పొదిగితే.. మరో 50 శాతం నేరుగా పిల్లల్నీ కంటాయి. ఇవి 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. జూలు, సంరక్షణ శాలల్లో మాత్రం 38 సంవత్సరాల వరకు బతకగలవు.
మొత్తానికి ఇవండీ పాములు కానీ పాములైన కాళ్లు లేని బల్లుల గురించిన విశేషాలు!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని