శుక్రవారం, అక్టోబర్ 30, 2020

హాయ్ బుజ్జీ

Updated : 24/02/2020 00:09 IST
ఏటా సగం భూగోళం చుట్టేస్తాం!

జీవితం

 

నన్ను చూడగానే మీకు ‘చిట్టి చిలుకమ్మా.. అమ్మ కొట్టిందా.. తోటకెళ్లావా.. పండు తెచ్చావా..’ పాట గుర్తుకు వస్తే.. మీరు పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే నేను చిలుకను కాదు ఓ బుల్లి డేగను.. మరి!

నా పేరు. అముర్‌ ఫాల్కన్‌

* నేను ఎక్కువగా దక్షిణ సైబీరియా, ఉత్తర చైనాలో కనిపిస్తుంటా.

* చూస్తే చిలుకలా.. పరిమాణంలో చిన్నసైజు పావురంలా ఉంటాను కానీ.. నేను ఏటా దాదాపు సగం భూగోళం చుట్టేస్తాను తెలుసా?!

* శీతాకాలంలో చలి నుంచి తప్పించుకోవడానికే మేం ఇలా చేస్తాం.

* మేం చలికాలానికి ముందే పెద్ద పెద్ద గుంపులుగా ముందుగా భారతదేశంలోని నాగాలాండ్‌లోకి ప్రవేశిస్తాం.

ఉండి పోం.. ఉండి.. పోతామంతే!●

* నాగాలాండ్‌కు చేరుకున్న తర్వాత మేం అక్కడే ఉండిపోం. కేవలం రెండు వారాలు మాత్రమే ఉండి సేదతీరి పోతామంతే!.

* తర్వాత అటు నుంచి శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా ఆఫ్రికాలోని డ్రాకన్స్‌బర్గ్‌ పర్వత ప్రాంతాలకు చేరుకుంటాం.

* మేం భారతదేశం మీదుగా ప్రయాణించినా ఒక్క నాగాలాండ్‌లో తప్ప ఇంకెక్కడా ఆగం. అందుకే మీరు పెద్దగా మమ్మల్ని చూసి ఉండరు.

ప్రయాణంలోనే బొజ్జ నింపుకొంటూ..

* మేం ఇలా ప్రయాణించే క్రమంలోనే మా ఆహారాన్ని వెతుక్కుంటాం.

* ఎలా అంటే.. సరిగ్గా అదే సమయంలో మాల్దీవులు, లక్షద్వీపాల నుంచి మడగాస్కర్‌, ఆఫ్రికాకు తూనీగలు పెద్ద సంఖ్యలో వలస వెళతాయి.

* ఇందులో కొన్ని మాకు ఆహారంగా పనికి వస్తాయి.

* వీటికి తోడు చీకట్లో సంచరించే కీటకాలు, మిడతలు, మిణుగురు పురుగుల వంటి వాటినీ హాయిగా తినేస్తాం.

* ఇలా ఎంచక్కా బొజ్జ నింపుకొంటూ ఆఫ్రికాకు పయనమవుతాం అన్నమాట.

* ప్రయాణం ముగిసిన తర్వాత.. పచ్చని వృక్షాలు, ఆహ్లాదకర వాతావరణంతో ఉండే ఆఫ్రికా మాకు మరింత పుష్కలంగా ఆహారాన్ని అందిస్తుంది.

* మేం ప్రయాణంలో మాత్రమే కీటకాలను ఆహారంగా తీసుకుంటాం. దక్షిణ సైబీరియా, చైనా, నాగాలాండ్‌లోనూ, అక్కడి నుంచి ఆఫ్రికాకు చేరుకున్నాక కీటకాలతో పాటు చిన్న చిన్న పక్షులు, ఇతర జీవులనూ ఆహారంగా తీసుకుంటాం.

మేలో తిరిగి చలో చలో...

* తిరిగి మేలో మేమంతా అరేబియా సముద్రం మీదుగా ఆసియా చేరుకుంటాం.

రష్యాలోని బైకాల్‌ సరస్సు దగ్గరలోని పర్వతాల్లో మేం రెండు నుంచి మూడు గుడ్లు పెట్టి పొదుగుతాం.

* మాలో కొన్ని అక్కడే ఉండిపోతే.. మరికొన్ని ఉత్తర చైనాలోని పర్వతప్రాంతాలకు వెళ్లిపోతాయి.

తీరులో ఆడ.. మగ వేరు●

* మీరు మాలో ఆడ, మగ పక్షుల్ని తేలిగ్గా గుర్తించగలుగుతారు.

* మగవి ముదురు బూడిద రంగులో, పొట్ట దగ్గర కాస్త తెలుపు వర్ణంలో, కళ్ల చుట్టూ ఎర్రని చారతో ఎరుపు వేళ్లతో అందంగా ఉంటాయి.

* ఆడవి కాస్త భిన్నంగా తెలుపు నలుపు మచ్చలతో ఆకట్టుకునేలా ఉంటాయి.

* శరీర పరిమాణంలో మాత్రం పెద్దగా తేడా ఏమీ ఉండదు.

* రెక్కలు విప్పితే 63 సెంటీ మీటర్ల నుంచి 71 సెంటీమీటర్ల వరకు పొడవుంటామంతే.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని