చిచ్చర పిడుగులు

Published : 21/12/2019 00:24 IST
చిట్టి చేతులు.. గట్టి చేతలు

పదేళ్ల వయసు.. అయిదో తరగతి.. అందరూ ఏం చేస్తారు? తమ క్లాసు పుస్తకాలతో కుస్తీ పడతారు! మార్కుల కోసం.. తపిస్తారు.. కానీ ఓ ఇద్దరు బుడతలు మాత్రం ఉడతా భక్తిగా పర్యావరణ పరిరక్షణ కోసం పరితపిస్తున్నారు. ఇది అమెరికాలో.. అదీ మన తెలుగువారు! ఆ ఇద్దరు ఎవరు? ఏంటీ విషయం తెలుసుకుందామా?

నిహాల్‌.. మిహిర్‌ ఇద్దరూ వరుసకు అన్నదమ్ములు. వీరి అమ్మానాన్నల స్వస్థలం విజయవాడ. కొన్ని సంత్సరాల క్రితమే ఈ ఇద్దరు చిన్నారుల కుటుంబాల వారు అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం నిహాల్‌.. మిహిర్‌ ఇద్దరూ న్యూజెర్సీలో అయిదో తరగతి చదువుతున్నారు. పర్యావరణానికి నిత్యం జరుగుతున్న హాని.. ప్లాస్టిక్‌తో ఏర్పడుతున్న ముప్పు గురించి పత్రికలు, టీవీల్లో చూసి చలించిపోయారు. తమ వంతుగా ఏమైనా చేయాలి అనుకున్నారు. ముందు భారత్‌లోనే పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామనుకున్నారు. కానీ అమెరికాలో ఉండి.. భారత్‌లో చేయడం సాధ్యం కాదని పెద్దలు తెలిపారు. దీంతో అమెరికాలోనే తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. ఈ ఇద్దరు తమ లక్ష్యం వైపు సాగారు.

బ్యాటరీలతో మహా ముప్పు!

ప్లాస్టిక్‌తో పాటు పర్యావరణానికి అత్యంత హాని కలిగించేవి బ్యాటరీలు. సాధారణంగా జనం బ్యాటరీలను వాడి చెత్తబుట్టల్లో పడేస్తారు. అలా అవి డంపింగ్‌ యార్డుకు చేరతాయి. మాములు చెత్తతో పాటే వాటినీ పడేస్తుండటమే సమస్యకు ప్రధాన కారణమవుతోంది. బ్యాటరీల్లో సీసం, కాడ్మియం, జింక్‌, లిథియం, మెర్క్యురీ వంటి ప్రమాదకర రసాయనాలుంటాయి. పర్యావరణంతో పాటు మూగజీవులకూ ఇవి ప్రమాదమే. కొన్ని సార్లు ఇవి కారుచిచ్చులకూ కారణమవుతున్నాయి. పాడైన బ్యాటరీలను ధ్వంసం చేసే క్రమంలో అందులోంచి నిప్పురవ్వలు ఎగసి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలూ ఉన్నాయి.

‘రీసైకిల్‌ మై బ్యాటరీ’...

బ్యాటరీల వల్ల ఇంత ప్రమాదం జరుగుతుందని తెలుసుకున్న తర్వాత ఈ చిన్నారులిద్దరూ.. ఎలాగైనా నివారించాలనుకున్నారు. తమ స్థాయిలో తాము ప్రారంభిస్తే.. ఇతరుల్లో స్ఫూర్తి నింపినట్లై.. క్రమక్రమంగా.. అందరూ ఈ దిశగా అడుగులేస్తారని ఆశించారు. వీరు తమ కుటుంబసభ్యుల సహకారంతో రీ సైకిల్‌ మై బ్యాటరీ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. వీరిద్దరూ ఓ వెబ్‌సైట్‌ సైతం నిర్వహిస్తున్నారు.

పాడైనవి సేకరించి..

స్కూళ్లు, ఆఫీసులు, గ్రంథాలయాల్లో పాత, పాడైన బ్యాటరీలు సేకరించేందుకు ఓ 40 చోట్ల అట్టెపెట్టెలను ఏర్పాటు చేశారు. వీటిని 150కి పెంచాలన్న లక్ష్యంతో వీరు పనిచేస్తున్నారు. గత ఆగస్టు నుంచే వీరు ఈ పని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇలా దాదాపు 3,500 బ్యాటరీలు సేకరించారు. వీటిని రీసైక్లింగ్‌ కోసం ఓ ఆర్గనైజేషన్‌ వారికి అందిస్తున్నారు. వీటిని తరలించడంలో నిహాల్‌ వాళ్ల నాన్నగారు వంశీ సాయపడుతున్నారు. నిహాల్‌, మిహిర్‌ వీరిద్దరూ చేస్తున్న ఈ పనికి ఐటీ సర్వ్‌ అలియన్స్‌ వారు తమ మద్దతు పలుకుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఈ చిన్నారులు పలు వేదికల మీద మాట్లాడుతూ బ్యాటరీల రీసైక్లింగ్‌ అవసరాన్ని ప్రచారం చేస్తున్నారు.

బ్యాటరీలు రీసైక్లింగ్‌ చేసే క్రమంలో వాటి నుంచి లెడ్‌(సీసం), ప్లాస్టిక్‌, యాసిడ్‌ను వేరుచేస్తారు. యాసిడ్‌ను న్యూట్రలైజ్‌ చేస్తారు. ప్లాస్టిక్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి తిరిగి కొత్త బ్యాటరీల తయారీలో వాడతారు. బ్యాటరీల లోపల ఉండే లెడ్‌లాంటి వాటిని సైతం ప్రమాదరహితంగా తిరిగి కొత్తవాటి తయారీలో ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల ఎంతో విషపూరితమైన పదార్థాలతో గాలి, నేల, నీరు కలుషితం కాకుండా ఉంటాయి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని