కథలు

Published : 22/12/2020 02:09 IST
గోడలకు చెవులుంటాయి!

కైవల్యపురం మహారాజు శ్రీనివాసవర్మకు ఆంతరంగికుడి అవసరం పడింది. ఇంతకు మునుపు ఉన్న ఆంతరంగికుడు మహారాజుకు సంబంధించిన ఏ ఒక్క విషయమూ బయటకు పొక్కనిచ్చేవాడు కాదు. ఆయన అనారోగ్యంతో హఠాత్తుగా కాలం చేయడంతో ఆ స్థానం భర్తీ చేయాల్సిన అవసరం మంత్రి మహాబుద్ధి మీద పడింది.
ఆసక్తి ఉన్న వాళ్లందరూ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి దేశంలో దండోరా వేయించడంతో కుప్పలు తెప్పలుగా అర్జీలు వచ్చి పడ్డాయి. అభ్యర్థులందరికీ సకల శాస్త్రాలు, కత్తి, కర్ర సాముల్లోనూ రకరకాల వడపోతలు నిర్వహించిన మీదట సుమనస్కుడు, అజయుడు చివరి వరకు నిలబడ్డారు. వాళ్లిద్దరిలో ఒక్కరికి మాత్రమే మహారాజుకు ఆంతరంగికుడిగా ఉండే అవకాశం, అదృష్టం లభిస్తుంది.
మరుసటి రోజు మంత్రి వాళ్లిద్దరినీ తన దగ్గరకు పిలిపించుకొని ముందుగా అజయుడికి ఒక విషయం చెప్పాడు. ఆ సమాచారాన్ని నూకాలమ్మ గుడి దగ్గర సత్రంలో ఒక గదిలో ఉన్న రాముడికి చెప్పి రావాలని పంపించాడు. అజయుడికి మార్గమధ్యంలో ఒక వ్యక్తి ఎదురయ్యాడు. సత్రం గదిలో ఉన్న మనిషికి ఓ విషయం చెప్పి రమ్మని మంత్రి నిన్ను పంపారని తెలుసని.. ఆ సమాచారమేంటో తనకు చెబితే ఊహించని ధనం ఇస్తానని ప్రలోభపెట్టాడు. అజయుడు ఒప్పుకోలేదు. సత్రానికి వెళ్లి గదిలోని రాముడికి విషయం చేరవేసి, మంత్రి వద్దకు వెళ్లి పని పూర్తి చేశానని చెప్పాడు.
మంత్రి మరుసటి రోజు సుమనస్కుణ్ని పిలిచి అజయుడికి చెప్పినట్లే చెప్పాడు. సుమనస్కుడు కూడా దారిలో ఎదురైన వ్యక్తి ప్రలోభానికి లోనవకుండా పనిపూర్తి చేశాడు.
మరుసటి రోజు సభ పౌరులతో కిటకిటలాడుతోంది. మహారాజు సభలో ఆసీనులై ఉన్నారు. మహారాజుగారికి ఆంతరంగికుడిగా ఉండే భాగ్యశాలిని మంత్రి ప్రజలకు పరిచయం చేసేది ఆ రోజే.
‘మహారాజా.. అన్ని పరీక్షల్లోనూ ఇద్దరూ సమ ఉజ్జీలుగా నిలిచారు. చివరిగా ఇచ్చిన కార్యాన్ని కూడా పూర్తి చేశారు’ అన్నాడు మంత్రి.
‘అయితే ఎంపిక జఠిలమే’ అన్నాడు మహారాజు. ‘లేదు మహారాజా! సుమనస్కుడే విజేతగా నిలిచాడు. ఎలాగంటే సత్రం గదిలోకి వెళ్లిన అజయుడు, రాముడికి సమాచారాన్ని సరిగానే చేరవేశాడు. అయితే సుమనస్కుడు నెమ్మదిగా రాముడి చెవిలో విషయాన్ని చెప్పాడు. గోడలకు చెవులు ఉంటాయంటాయన్న సంగతి మనకు తెలిసిందే. మీకు సంబంధించిన రహస్యాలు చాలా జాగ్రత్తగా కాపాడతాడని నాకు సంపూర్ణ విశ్వాసం కుదిరింది. మీకూ సమ్మతమైతే సుమనస్కుడినే ఆంతరంగికుడిగా ప్రకటిద్దాం’ అన్నాడు మంత్రి. రాజు కూడా సరే అన్నాడు.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని