Updated : 27/11/2019 01:45 IST
చకచకా.. ఎత్తేస్తాం.. ఎంతెంతో బరువులు!

‘పిట్టకొంచెం.. కూత ఘనం’ అని మీరు వినే ఉంటారుగా! అలాగే ‘జీవులు కొంచెం.. మోత ఘనం’ గురించి మీకు తెలుసా?! తెలియకుంటే... ఇప్పుడు తెలుసుకుందాం! ‘మేం బలంలో బాహుబలులం, చాలా బరువులు ఎత్తేస్తాం’ అని ఓ మూడు జీవులు మన పేజీలోకి వచ్చాయి.. ఇంకెందుకాలస్యం వాటి గురించి చదివేద్దామా మరి!

ఒంటి కొమ్ము.. ఒళ్లంతా దమ్ము!

చూడ్డానికి అచ్చం.. ఖడ్గమృగంలా ఉండే దీని పేరు రైనోసరస్‌ బీటిల్‌ (ఖడ్గమృగ పురుగు). దీనికి ఓ కొమ్ము ఉంటుంది. వీటిలో రెండు, మూడు, నాలుగు కొమ్ములుండేవి కూడా ఉంటాయి. వీటిలో దాదాపు 300 రకాలున్నాయి. ఇవి మహా బలశాలులు. ఇవి తమ శరీర బరువుకన్నా.. ఏకంగా 850 రెట్ల బరువును ఎత్తేస్తాయి. ఇది ఓ మనిషి 65 టన్నులను ఎత్తడంతో, ఓ ఏనుగు 850 ఏనుగులను తన వీపుపై మోయడంతో సమానం. ఇవి కుస్తీరాయుళ్లలా పోరాటాలు చేస్తుంటాయి. ఓ పురుగు.. మరో పురుగును అమాంతం గాల్లో లేపి పడేస్తుంది. వీటి దమ్మంతా.. వీటి కొమ్ముల్లోనే ఉంటుంది.

పేడ పురుగు.. ఎంతో మెరుగు

నం ఓస్‌.. పేడపురుగా!... అని చాలా తేలికగా, చులకనగా చూస్తాం కానీ.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ బరువులు మోసే కీటకం ఇదే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఇది తన శరీర బరువుకన్నా.. 1,141 రెట్లు బరువును మోయగలదు. ఇది ఓ మనిషి ఆరు డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని మోసినదానితో సరిసమానం. అంతేకాదు.. దీని పరుగూ వేగంగా ఉంటుంది. వీటికి రెక్కలూ ఉంటాయి. గాల్లోనూ ఎగరగలవు. ఇవి పేడను గుండ్రటి బంతుల్లా చేసి... తరలిస్తుంటాయి. తర్వాత వీటిలో ఓ చోట భూమిలో కప్పెడతాయి. దీని వల్ల భూమి సారవంతం అవుతుంది. మొక్కలు, చెట్లకు కావాల్సిన ఎరువు దొరుకుతుంది. ఓ రకంగా వీటిని పారిశుద్ధ్య కార్మికులుగా, పర్యావరణ రక్షకులుగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఇవి పేడను బంతుల్లా చేసి ఎందుకు తరలిస్తాయంటే.. వాటిలో తమ గుడ్లు పెట్టడానికి! పేడపురుగులతో పాటు.. వాటి  లార్వాలకు సైతం పోషకాలతో కూడిన పేడ చక్కటి ఆహారం. ఈ కీటకాల్లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. ఇవి ఎంతో బలవంతులైనప్పటికీ వీటి జీవితకాలం కేవలం మూడు సంవత్సరాలే.

చిన్న చీమైనా.. ఎంతో మిన్న!

చూడటానికి చిన్న చీమ.  దీని పేరు ఆకులు కత్తిరించే చీమ(లీఫ్‌ కట్టర్‌ యాంట్‌). కానీ బరువులు ఎత్తేయడంలో దీనికి ఇదే సాటి. ఇందులో దాదాపు 47 రకాలుంటాయి. ఇవి ఎక్కువగా మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంటాయి. ఇవి చెట్ల ఆకుల్ని, పువ్వుల్ని, గడ్డిని కత్తిరిస్తాయి. కేవలం కత్తిరించడమే కాదు.. వీటిని చాలా దూరం మోసుకుపోతాయి. ఎందుకో తెలుసా? ఇవి వ్యవసాయం చేస్తాయి మరి! అవును నిజమే.. ఇవి తమ పుట్టల్లో ఫంగస్‌ను పెంచుతాయి. వాటికి ఎరువుగా.. ఆకుల్ని, పువ్వుల్ని తీసుకెళ్తాయన్నమాట! ఇంతకీ ఇవి ఫంగస్‌ను ఎందుకు పెంచుతాయో తెలుసా?.. తమకు కావాల్సిన ఆహారం కోసం! ఈ క్రమంలో అవి తమ శరీర బరువుకన్నా.. 50రెట్లు అధిక బరువున్న ఆకుల్ని, పువ్వుల్ని మోస్తాయి. వీటి దవడలు అంత శక్తిమంతంగా ఉంటాయి మరి. ఇవి దాదాపు 500 మి.గ్రా.ల బరువును మోయగలవు. ఓస్‌.. అంతేనా! అనేయకండి.. ఎందుకంటే వీటికి ఈ బరువు ఓ మనిషి ట్రక్కును ఎత్తినదానితో సమానం. మరో విషయం.. ఇవి మనిషిని కనుక కుట్టాయంటే.. చర్మం మంట లెక్కాల్సిందే!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని