గురువారం, ఆగస్టు 06, 2020

జంతువులోచ్...

ఈ పక్షులు విలన్లు!

ఏంటీ పక్షుల్లో క్రూరమైనవా? అని ఆశ్చర్యపోకండి. అసలు విషయం తెలిస్తే.. అంతకంటే పెద్ద మాటే అంటారు. ఎందుకంటే.... తిండి కోసం ఎంతకైనా తెగిస్తాయి. వాటి విశేషాలు తెలుసుకుందాం రండి..

ఆ పక్షుల సంగతేంటంటే.. పశ్చిమ ఆఫ్రికా, పాపువా న్యూ గిని, బ్రెజిల్‌, ఫ్లోరిడా, టెక్సాస్‌లలో గడ్డి భూములు, అటవీ ప్రాంతాలెక్కువ. అప్పడప్పుడూ ఆ అడవులు అంటుకుని మంటలు ఎగసిపడుతుంటాయి. ఎన్నో జీవులు ఆ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడుస్తాయి. మరెన్నో ఆవాసాలు కోల్పోయి.. వలసలు వెళ్లిపోతాయి. ఇంతకీ.. ఆ మంటల్ని ఎవరు పెట్టారు? కొన్నాళ్ల దాకా ఇదో పెద్ద ప్రశ్న.

పరిశోధనలు మొదలయ్యాయి..

మాటి మాటికీ మంటలెందుకు ఎగసిపడుతున్నాయో.. పరిశోధకులకు అంతుపట్టేది కాదు. చివరికి ఆస్ట్రేలియాకు చెందిన ఆదివాసీల ద్వారా అసలు విషయం తెలిసింది. బ్లాక్‌ కైట్స్‌, విజిలింగ్‌ కైట్స్‌, బ్రౌన్‌ ఫాల్కన్స్‌ అనే పక్షుల పనే అదంతా అని!

నమ్మలేని నిజాలు

ఆ పక్షులు దగ్గర్లోని జనావాసాల నుంచి మండుతున్న కట్టె పుల్లల్ని దొంగిలించి తెచ్చేస్తాయి. అక్కడ సవన్నా గడ్డి భూములు, అటవీ ప్రాంతాల్లో

పడేస్తాయి. ఇంకేముంది? భగ్గున మంటలెగసి, అడవంతా పాకిపోతుంది. కొంతసేపట్లోనే మొత్తం మాడి మసైపోతుంది.

ఎందుకలా చేస్తాయంటే

ఆహారం కోసమట! అడవిని మండించేస్తే ఆహారం ఎలా దొరుకుతుంది అంటారా! అదే మరి.. వాటి తెలివి. అడవిని ముట్టిస్తే.. కలుగులు, బొరియలు, పుట్టలు, చెట్టు తొర్రల్లోనివన్నీ బయటికొస్తాయని! వాటికి కావాల్సిన ఆహారం.. ఎలుకలు, పాములు, బల్లులు, చిన్న పక్షులు.. మరెన్నో చిన్న జంతువులు, కీటకాలు. అలాంటివి మంటల వేడికి తట్టుకోలేక బయటికి వస్తాయి కదా! వాటిని పట్టేసి హాంఫట్‌ చేసేస్తాయన్నమాట! ఇంత క్రూరమైనవి కనుకనే ఈ మూడు జాతుల పక్షుల్ని కలిపి .. ఫైర్‌ హాక్‌ రాప్టర్స్‌, ఆర్సన్‌ రాఫ్టర్స్‌ అనీ పిలుస్తారు.

మరింత అధ్యయనం

పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్శిటీ - ఆల్టూనాలో ‘మార్క్‌ బోంటా’ భౌగోళిక శాస్త్రవేత్త. ఆయన తన బృందంతో కలిసి ఫైర్‌ రాప్టర్ల మీద అధ్యయనం చేస్తున్నారు. ఈ పక్షుల ప్రవర్తనకు సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అది తెలిస్తే వాటి ప్రవర్తనను మార్చేందుకు ఏం చేయాలో ఆలోచించవచ్ఛు ఇంకా చాలా జంతువుల్ని, పక్షుల్ని కాపాడవచ్చు కదా. మరి ఈ పరిశోధనలో ఏ కొత్త విషయాలు వెలుగులోకొస్తాయో...!

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని