Updated : 15/05/2021 04:44 IST
ఇది మీ టైం

చదువు, హోం వర్క్‌, ఆన్‌లైన్‌ క్లాసు.. వీటికే సరిపోతోంది. నా టైం ఎప్పుడొస్తుంది?

- కాలేజీ అమ్మాయి ఆవేదన

ఆఫీసులోనే బండెడు పని. నాకంటూ సమయం లేదు.

- యువోద్యోగి బాధ.

చాలామందివి ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితాలే! కాస్త తీరిక చేసుకుంటే ‘మీ టైం’ చేజిక్కించుకోవడం కష్టమేం కాదు. ఇప్పుడు లాక్‌డౌన్‌ కూడా వచ్చేసింది. ఆఫీసులు, కాలేజీలు మూతపడ్డాయి. బోలెడంత సమయం. ఇక మీకు నచ్చినట్టుగా ఉండండి మరి!

అనుబంధాల సమయం
ఒక్కసారి స్నేహితుల జాబితా తిరగేయండి. ముఖ్యంగా చిన్ననాటి, చాలాకాలంగా మాట్లాడని ఫ్రెండ్స్‌. ‘ఏరా మామా.. ఎలా ఉన్నావ్‌?’ అని మనస్ఫూర్తిగా మాట కలపండి. దోస్త్‌ ఖుషీ కాకపోతే ఒట్టు! నిక్కర్లు వేసుకునే రోజుల్లోని అల్లరి, కాలేజీలో అమ్మాయిలకు సైట్‌ కొట్టిన కొంటె పనులు గుర్తుకు తెచ్చుకోండి. కళ్లముందు ఆనాటి సీన్స్‌ మెదులుతుంటే.. ఆహా మనసు మేఘాల్లో తేలిపోతుంది. ఇది మీ టైం కాక మరేంటి?

మర్చిపోదాం బాస్‌
ఆఫీసు, కాలేజీ.. కొన్నాళ్లు ఆ ఊసే మర్చిపోదాం బాస్‌. అతి పని, అతిగా ఆలోచించడం ఒత్తిడిలో దించేస్తుంది. అన్నీ మర్చిపోయి మీకిష్టమైన పనుల్లోకి దూరిపోండి. క్రికెట్‌ ఆడటం, టీవీ చూడటం, పుస్తకాలు చదవడం.. ఏదైనా నచ్చిన పని పిచ్చిపిచ్చిగా చేసేయండి. మీలో ఏదైనా టాలెంట్‌ ఉంటే దాన్ని బయటికి లాగి మెరుగులద్దండి.

పట్టించుకుందాం
ఉరుకులు పరుగుల జీవితాల్లో మనల్ని మనం పట్టించుకుంది తక్కువే. పెళ్లీడుకొచ్చేసరికే ఒళ్లు పెంచి అంకుల్‌, ఆంటీలా మారిపోతున్నాం. ఇది మార్చేద్దాం. దీనికోసం జిమ్‌కెళ్లి హై ఇంటెన్సిటీ వర్కవుట్లు చేయాల్సిన పనిలేదు. ఇంట్లోనే చేయదగ్గ తేలికైన వ్యాయామాలతో మొదలు పెడదాం. మానసిక ప్రశాంతతకి ధ్యానం, యోగాలను ఓ చూపు చూద్దాం. లోపల, బయట ఆరోగ్యంగా ఉంటే మొహం కళకళలాడుతుంది. ఏళ్లు గడిచినా యవ్వనానికి ఢోకా ఉండదు.

ఆస్వాదిద్దాం
ఈమెయిల్‌, సోషల్‌మీడియా, ఫోన్‌, గ్యాడ్జెట్లు మనల్ని ఎప్పుడో కబ్జా చేసేశాయి. ఒక్కసారి వాటికి కటీఫ్‌ చెప్పేయండి. బోలెడంత సమయం దొరక్కపోతే అడగండి. అప్పుడు కిటికీ పక్కన కూర్చొని టీని ఆస్వాదిస్తూ.. చెరువు పక్కనో, బీచ్‌లోనో కూర్చొని అలల్ని తదేకంగా చూస్తూ.. వాకింగ్‌కి వెళ్తూ ఈ లోకాన్ని సరికొత్తగా గమనిస్తుంటే.. మీలోని భావుకుడు బయటికొచ్చి మీకు మీరే కొత్తగా పరిచయమవుతారు.'

నచ్చిందే చేద్దాం
నాకు టైం లేదు.. టైం లేదు అని అరిచే అమ్మాయినో, అబ్బాయినో అడగండి. ‘టైం దొరికితే ఏం చేస్తార’ని? ‘హాయిగా రెండు గంటలు నిద్రపోతా’, ‘మంచి సినిమా చూస్తా’, ‘సరికొత్త వంటకం చేస్తా’.ఇలాంటి సమాధానాలే వస్తాయి.మరింకేం.లాక్‌డౌన్‌తో కుర్రకారుకి బోలెడంత ‘ఇట్స్‌ మై టైం’ దొరికింది. అనుభవించు రాజా అనుకోవడమే మిగిలింది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని