శనివారం, అక్టోబర్ 31, 2020

ఈ-నాడు

Updated : 08/05/2019 05:54 IST
5G పంచతంత్రం

మారుమూల పల్లెలో ఉన్నా భయం లేదు... నగరాల్లోని వైద్యులు ఉన్నచోట నుంచే సర్జరీ చేసి ప్రాణాలు నిలబెడతారు! షాపింగ్‌ చేద్దామంటే సమయానికి కార్డు చేతిలో లేదనే చింత అక్కర్లేదు. ఒకసారి మీ ‘ముఖారవిందాన్ని’ అలా చూపిస్తే చాలు ఇలా చక్కా షాపింగ్‌ చేసుకొని వెళ్లిపోవచ్చు. అంబులెన్సులు ట్రాఫిక్‌ పద్మవ్యూహాల్లో చిక్కుకునే దుస్థితి తప్పుతుంది. ఆ మాటకొస్తే వాహనాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుని యాక్సిడెంట్లు జరగకుండా రోడ్లపై దూసుకుపోతుంటాయి. టోల్‌ప్లాజాల దగ్గర గంటలుగంటలు ఎదురుచూడాల్సిన అవసరం ఇక ఉండనే ఉండదు. ఇవేమి మంత్రలోకపు మహిమలు కావు... రానున్న 5జీ యుగపు అద్భుతాలు...

బ్యాండ్‌ఎయిడ్లు మాట్లాడతాయి! 

పల్లెల్లో ఉండేవారు ప్రాణాల మీదకు వస్తే... నగరాల్లోని వైద్య నిపుణులని వెతుక్కుంటూ అక్కడ నుంచి పరుగులు పెడుతూ రావాల్సిందే! రవాణా సదుపాయం పక్కాగా ఉండి, సమయానికి వైద్యం అందితే సరే. లేకపోతే? ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందేనా? అవసరం లేదు. 5జీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే రోబోటిక్స్‌ పరిజ్ఞానంతో ఉన్న చోట నుంచే దూరంగా ఉన్న రోగులకి శస్త్రచికిత్సలు చేసే వీలుంటుంది. దాంతో విలువైన ప్రాణాలు దక్కడమే కాకుండా... సమయం, ఇంధనం కూడా ఆదా అవుతాయి. అంతెందుకు... ఒక రోగి తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే అతను ధరించిన ‘వేరబుల్‌ గాడ్జెట్స్‌’(ధరించడానికి వీలుగా ఉండే సాంకేతిక పరికరాలు), గాయాలు మానేందుకు వేసే బ్యాండ్‌ఎయిడ్లు అతని ఆరోగ్య పరిస్థితిని కచ్చితంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటాయి. ఒక పూట రోగికి అందాల్సిన ఔషధం అందకపోయినా ఆ విషయాన్ని డాక్టర్‌కి తెలియజేస్తాయి. రోగి తాలూకు 3డీ స్కాన్లని, బయో మెడికల్‌ చిత్రాలని ఒకేసారి అనేక మంది వైద్య నిపుణులకు చేరవేయడం ద్వారా క్షణాల్లో మెరుగైన వైద్యాన్ని రోగులకి అందించే అవకాశం ఉంది.
యాక్సిడెంట్లు ఉండవా?
టోల్‌గేటు దగ్గర వాహనాలు కిలోమీటర్ల దూరం కొద్దీ బారులుతీరే పరిస్థితి నుంచే కాదు... వాహనాల పార్కింగ్‌ ఎక్కడ చేయాలో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి కూడా ఇక నుంచి ఉండదు. ఎప్పటికప్పుడు కెమెరాల నుంచి రియల్‌టైం ట్రాఫిక్‌ వివరాలని సేకరించడం ద్వారా వాహనాలని దారి మళ్లించి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా అడ్డుకుంటాయి. మనుషుల అవసరం లేని సెల్ఫ్‌డ్రైవింగ్‌ కార్లు సెన్సర్ల సాయంతో ఒకదానితో ఒకటి అనుసంధానించుకుంటూ యాక్సిడెంట్లని నివారించి ప్రాణ నష్టం లేకుండా చేస్తాయి. టోల్‌ప్లాజాల దగ్గర టోల్‌ చెల్లించేందుకు అధిక సమయం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా 5జీ చిప్స్‌ ఈ పనిని క్షణాల్లో చేసిపెట్టేస్తాయి. ఈ విధానంలో ఇంధనంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.
కార్డులకూ కాలం చెల్లుతోందా.... 
చేతిలో డబ్బు ఉండాలనే చింత లేదు. కార్డులు మోసుకెళ్లాలనే బాధలేదు. సూపర్‌మార్కెట్లలోని కెమెరాలు బయోమెట్రిక్‌ ఐడెంటిఫికేషన్‌ సాయంతో మీ దగ్గర నుంచి బిల్లులు వసూలు చేసుకుంటాయి. 5జీ సెన్సర్లు మీ ఇంట్లో నిండుకున్న వస్తువుల వివరాలని ఎప్పటికప్పుడు సూపర్‌మార్కెట్లకి తెలియచేసి ఇంటికి కావాల్సిన కిరాణా సామాన్లు ఆర్డరు ఇచ్చేస్తాయి. ‘సారీ మేడమ్‌ మీరు అడిగిన వస్తువు ఇప్పుడే అయిపోయింది’ అని దుకాణదారులు సాకులు చెప్పడానికి వీలులేకుండా సెన్సర్లు దుకాణంలో వస్తువులు నిండుకోకుండా జాగ్రత్తపడతాయి. వినియోగదారుల సమయం ఆదా చేస్తాయి. కృత్రిమమేధ సాయంతో బిల్లుబోర్డులు, అడ్వర్టైజ్‌మెంట్‌ బోర్డులు.. వినియోగదారుల అవసరాలని గుర్తించి ప్రకటనలని  ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాయి.
పారిశ్రామిక రంగంలో...
భారీ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ‘రిస్క్‌’ తీసుకుని పనిచేసే సందర్భాలే అధికంగా ఉంటాయి. క్రేన్లు వంటి భారీ వాహనాల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాల మీదకే వస్తుంది. భారీనష్టమూ వాటిల్లుతుంది. ఇక నుంచి క్రేన్లే కాదు... అంతకు మించిన యంత్రాల నిర్వహణ కూడా సాంకేతిక సాయంతోనే సాగుతుంది. మనుషుల ప్రమేయం లేకుండా యంత్రాల నిర్వహణ జరుగుతుంది. సిస్టమ్‌ ఇంజినీర్లు శక్తివంతమైన సెన్సర్ల సాయంతో ఎప్పటికప్పుడు పరిశ్రమల్లో జరగబోయే ప్రమాదాలని కచ్చితంగా అంచనా వేయగలగడం ద్వారా నష్టాలని నివారించగలుగుతారు. 
నాణ్యతని గుర్తించేయొచ్చు.. 
ఆన్‌లైన్‌లో మీరు కొన్న వస్తువు ఈరోజు వస్తుందా.. రేపు వస్తుందా అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ నిమిషం ఇప్పుడా వస్తువు ఏ ప్రదేశంలో ఉందో కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన వస్తువు గురించి రియల్‌ టైం ట్రాకర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తాయి. ఒక వేళ వస్తువులో ఏదైనా లోపం తలెత్తితే ఎక్కడ లోపం జరిగిందో గుర్తించి.. వినియోగదారులు నష్టాల బారిన పడకుండా కాపాడతాయి. చేపల దగ్గర నుంచి రైతులు పండించిన పండ్లు, కాయగూరలు వరకూ ఆ వస్తువు మన చేతికి రావడానికి పట్టిన సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవడం ద్వారా వస్తువు నాణ్యతను పక్కాగా తెలుసుకోవచ్చు. 
అన్నం, కూర వండేస్తాయి..
ఆఫీసు నుంచి ఇంటికెళ్లగానే ఏసీ ఆన్‌ చేస్తే అది పనిచేయడానికి సమయం పడుతుంది. పొయ్యిమీద పెట్టిన అన్నం ఉడకడానికి కనీసం అరగంటైనా పడుతుంది. మరోపక్క అవసరం ఉన్నా లేకపోయినా రాత్రంతా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయా? దీనివల్ల బోలెడంత ఇంధనం వృథా అవ్వడంతోపాటు... ఆ కృత్రిమ వెలుగు పర్యావరణానికి హాని చేస్తుంది. 5జీతో మన ఇళ్లే కాదు, నగరాలు కూడా సూపర్‌ స్మార్ట్‌గా మారిపోనున్నాయి. 5జీ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే అవసరం లేకపోయినా రాత్రంతా వీధి దీపాలు వెలుగుతూ ఉండవు. వాహనాలు వెళ్లినప్పుడు మాత్రమే వెలుగుతాయి. లేనప్పుడు... బంద్‌. ఇక ఇంటికెళ్లే ముందు మీ ఫోన్‌ నుంచి కోరితే చాలు... మీరు ఇంటికెళ్లే సమయానికే ఏసీ ఆన్‌ అవుతుంది. అన్నంతోపాటు కూర కూడా సిద్ధంగా ఉంటుంది. వాటర్‌, గ్యాస్‌, విద్యుత్‌ బిల్లుల కోసం నెలాఖరు వరకూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు బిల్లుల వివరాలు తెలిసిపోతూ ఉంటాయి. 
5జీ అంటే.. 
ప్రస్తుత వైర్‌లెస్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌లకు మనం వాడుతున్న 4జీ పరిజ్ఞానానికి తర్వాతి దశ. ఇది ఐదోతరం ఇంటర్నెట్‌ కనెక్టివిటీ. డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ స్పీడ్లు అత్యంత వేగంగా ఉంటాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం కేవలం మొబైల్‌ నెట్‌వర్క్‌లకే పరిమితం కాకుండా... ఏకకాలంలో మరిన్ని డివైజ్‌లను మొబైల్‌ ఇంటర్నెట్‌కి  కనెక్ట్‌ అయ్యేలా వీలు కల్పించడమే ఇందులోని ప్రధాన విషయం. 
బాడీకెమెరాలు అందరికీ...
అనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకున్నారు. లేదా ఆగంతకులెవరో మిమ్మల్ని వెంబడిస్తున్నారు. మీరున్న చోటు, వివరాలు చాలా కచ్చితంగా పోలీసులకు తెలియాలి. ఎలా? ఇలాంటి సమయంలో నేరస్థుల వివరాలు తెలియచేసేందుకు పర్సనల్‌ బాడీ కెమెరాలు బాగా ఉపయోగపడతాయి. నేరాలని అదుపులో ఉంచేందుకు, తక్షణం... రక్షణ సాయం పొందేందుకు అవసరం అయిన బాడీ కెమెరాలని ఇప్పటికే వాడుతున్నా అందరికీ అందుబాటులో లేవు. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే పర్సనల్‌ బాడీ కెమెరాలతో అనుసంధానించిన మొబైల్‌ సేవలు... ప్రమాదాల్లో చిక్కుకోకుండా కాపాడతాయి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని