ఈ-నాడు

Updated : 30/12/2020 05:39 IST
దోసకాయ చెక్కుతో ప్యాకేజీ పొర!

అదెట్టా!

దోసకాయ కనిపిస్తే చెక్కు తీసేసి, ముక్కలు కోసి, ఉప్పు కారం చల్లుకొని తినేస్తాం. పప్పులో వేసో, టమోటాలతో కలిపో కూర వండుకుంటాం. మనలాగే చేస్తే వాళ్లు శాస్త్రవేత్తలెలా అవుతారు? అందుకే ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు భిన్నంగానే ఆలోచించారు. దోసకాయ చెక్కు గట్టిగా, చేదుగా ఉంటుందని పారేయటమేనా? దీన్ని కొత్తగా వాడుకోలేమా? అని అనుకున్నారు. రెండేళ్లు కష్టపడి వినూత్నమైన ప్యాకేజీ పొరను సృష్టించారు. ఇది పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు సరికదా, నూటికి నూరు శాతం క్షీణించిపోతుంది కూడా. దోసకాయ చెక్కులో సెల్యులోజ్‌ అనే ఒకరకం చక్కెర దండిగా ఉంటుంది. శాస్త్రవేత్తలను ఆకర్షించింది ఇదే. ఎందుకంటే మరే కూరగాయలు, పండ్ల తొక్కల్లోనూ ఇంత ఎక్కువ సెల్యులోజ్‌ ఉండదు. దీంతోనే అతి పలుచని, దృఢమైన ప్యాకేజింగ్‌ పొరను సృష్టించటంపై దృష్టి సారించారు. ఇలాంటి పొరలను తయారుచేయాలంటే అతిసూక్ష్మమైన అణువులు అవసరం. సాధారణంగా వీటిని పిండి పదార్థాలు లేదా ప్రొటీన్ల నుంచి సంగ్రహిస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ముందుగా అరటి, నారింజ తొక్కలతో ప్రయోగాలు చేశారు. వీటితో తయారుచేసిన ప్యాకేజీ పొరలు తేలికగా చిరిగిపోవటం నిరాశ కలిగించింది. దీంతో సెల్యులోజ్‌ ఎక్కువగా ఉండే దోసకాయ చెక్కు మీద పరిశోధనలు చేశారు. యాసిడ్‌ హైడ్రాలిసిస్‌ పద్ధతి ద్వారా దీని నుంచి నీటిలో కరిగే, ఆమ్లంలో కరిగే, క్షారంలో కరిగే సూక్ష్మ అణువులను సేకరించారు. అనంతరం సెల్యులోజ్‌ నానోక్రిస్టల్స్‌ను సంగ్రహించారు. వీటితోనే కొత్తరకం ప్యాకేజీ పొరను తయారుచేశారు. ఇది సమర్థంగా ఆక్సిజన్‌ బయటకు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవటమే కాదు, బలంగానూ ఉండటం విశేషం. దీన్ని వివిధ కూరగాయలకు చుట్టి పరీక్షించగా మరింత ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటున్నట్టు తేలటం గమనార్హం.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని