ఆదివారం, నవంబర్ 01, 2020

Published : 03/06/2020 00:35 IST
ఓ కన్నేసి ఉంచండి

స్కామర్లతో జాగ్రత్త

నేరాలు.. సైబర్‌ క్రైమ్‌లు.. వాస్తవ ప్రపంచంలో కొన్నయితే, వర్చువల్‌ వరల్డ్‌లో ఇంకొన్ని. దీంతో ఇంటిల్లిపాదినీ నెట్టింట్లో కూడా ఓ కంట కనిపెట్టాల్సిన పరిస్థితి. ఎట్నుంచి ఏ స్కామర్లు ఎలా వల విసురుతున్నారో అర్థం కాని పరిస్థితి.. ఏ సోషల్‌ వాల్‌పై ఇంటి గుట్టుని ఎలా రట్టు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన స్థితి.. ఎన్ని రోజులని చెబుతారు? ఎంతని నిఘా వేస్తారు? ఇంటి చుట్టూ గోడ కట్టినట్టుగా.. ఇంటికి పెద్ద తాళం వేసినట్టుగా.. నెట్టింటికి రక్షణ కట్టడం వీలు కాని పని... మరైతే, సైబర్‌ మోసగాళ్లకు చిక్కకుండా ఉండాలంటే.. సింపుల్‌.. వయసుతో సంబంధం లేకుండా నెట్టింట్లో సంచరించేవారందరూ సైబర్‌ స్కామ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అది ఎవరికి వారే ఓ నియమంలా పెట్టుకోవాలి. ఇదిగోండి.. గూగుల్‌, సైబర్‌ సపోర్టు నెట్‌వర్క్‌ సంయుక్తంగా అందుబాటులోకి తెచ్చిన ‘స్కామ్‌ స్పాటర్‌’లోకి వెళ్లండి. నెటిజన్‌గా మారిన ప్రతి సిటిజన్‌ తప్పక స్కామ్‌ స్పాటర్‌తో చైతన్యవంతం కావాల్సిందే. రండి.. అందరం కలిసి స్కామ్స్‌కి చెక్‌ పెడదాం..


క్విజ్‌లో పాల్గొనండి..

ఎంత స్పృహతో ఉన్నప్పటికీ కొన్ని సార్లు అనుకోకుండా తప్పులో కాలేసే అవకాశం లేకపోలేదు. అందుకే హ్యాకర్ల పన్నాగాల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలంటే స్కామ్‌ స్పాటర్‌ ‘క్విజ్‌’లో పాల్గొనాల్సిందే. హ్యాకర్ల నుంచి మీకు వచ్చే మెసేజ్‌లు మొదలు.. ఫోన్‌కాల్స్‌.. ఇతర ప్రయత్నాల్ని ఎలా తిప్పికొట్టాలో తెలుసుకోవచ్ఛు.

వెబ్‌సైట్‌: https://scamspotter.org/


ఇదో ప్రత్యేక అడ్డా

లాటరీ పేరుతో మోసపోయాననో.. సాయం చేయబోయి బకరా అయ్యాననో.. నెట్టింట్లో నెత్తిన చేతులు పెట్టుకోకుండా ఉండేందుకు స్కామ్‌ స్పాటర్‌ మూడు నియమాల్ని చెబుతోంది. వాటిని ఫాలో అయితే హ్యాకర్ల పాచికలకు చిక్కకుండా చెక్‌ పెట్టొచ్ఛు అవేంటంటే..

* నింపాదిగా ప్రశ్నించాలి (Slow it down)

స్కామర్లు ఎప్పుడూ ఆలోచించుకునే టైమ్‌ ఇవ్వకుండా ఉచ్చులోకి దించేందుకు ప్రయత్నిస్తారు. ప్రేరేపిస్తారు. అప్పుడే మనం విచక్షణతో నింపాదిగా ఆలోచించాలి. ప్రశ్నలు అడుగుతూ స్పష్టత కోరాలి. ఈ క్రమంలోనే నేరగాళ్ల బుద్ధి బయటపడుతుంది.

* అప్పటికప్పుడే చెకింగ్‌ (Spot check)

ఫోన్‌ కాల్‌ రూపంలోనో, మెయిల్‌ ద్వారానో ఏదైనా వస్తే.. వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్‌ చేయాలి. చెప్పేది.. చదివేది.. ఎంత వరకూ నిజమో సరి చూసుకోవాలి. ఉదాహరణకు బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం అని ఏదైనా కాల్‌ వస్తే.. తొందరపడొద్ధు బ్యాంకు కస్టమర్‌ కేర్‌కో.. బ్రాంచ్‌కో ఫోన్‌ చేసి కనుక్కోవాలి.

* ఆగి ఆలోచించాలి.. పంపకండి (Stop! Don't send)

బ్యాంకులుగానీ.. మరేదైనా ఏజన్సీగానీ ఎప్పుడైనా వెంటనే డబ్బులు పంపాల్సిందే లేదంటే మీ ఎకౌంట్‌ని తొలగిస్తామనో.. కేసు పెడతామనో చెప్పరు. అలాగే, ఏదైనా చెల్లింపులు చేస్తే భారీగా నజరానా ఇస్తామనో కూడా చెప్పవు. అందుకే.. ఏదైనా బిల్లు చెల్లింపులకు సంబంధించి భారీ గిఫ్ట్‌ కూపన్‌లు వస్తే కాస్తాగండి. అవి కచ్చితంగా మోసపూరితమైనదే!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని