రివైండ్
టెక్నాలజీ రంగంలో మార్పు నిత్య నూతనం. రోజుల వ్యవధిలోనే కొత్తది అనుకున్న మోడల్ పాతది అయిపోతోంది. ‘అయ్యో.. తొందరపడి కొన్నానే’ అనుకునే పరిస్థితి రావొద్దు అనుకుంటే వీటి జోలికి వెళ్లకుంటేనే మేలు. ఎందుకంటే.. వాటి పనైపోయింది. మీరింకా వాటినే వాడదాం అనుకుంటే.. టెక్ జమానాలో వెనకబడినట్టే!!
కెమెరాలు తెరమరుగు..
ఇప్పుడు వస్తున్న అన్ని ఫోన్లలోనూ అత్యధిక మెగాపిక్సల్ కెమెరా కళ్లే. అందుకే.. ఎవరి చేతిలోనూ డిజిటల్ కెమెరాలు కనిపించడం లేదు. ఫోన్‌తోనే క్లిక్ మనిపించి.. యాప్‌లతో వాటికి మరిన్ని మెరుగులు అద్దుతున్నారు. అందుకే... మీరు ఇప్పటికీ ‘పాయింట్ అండ్ షూట్’ కెమెరాల గురించి ఆలోచిస్తున్నట్లయితే విరమించుకోవడం మంచిది.
మెమొరీ కార్డుల మాటే లేదు..
ఏ చిన్న బేసిక్ ఫోన్‌ని చూసినా.. 32జీబీ నుంచి 64జీబీ వరకూ సపోర్టు చేస్తున్నాయి. ఇక హై ఎండ్ ఫోన్లలో అయితే 128జీబీని వాడుకోవచ్చు. అదనంగా కావాలనుకుంటే..క్లౌడ్ స్టోరేజ్‌లు ఉండనే ఉన్నాయి. ఇక ఎక్స్టర్నల్ మెమొరీ కార్డులతో పనేముంది. వాటి ఊసే మర్చిపోతున్నారు నేటి తరం టెక్నాలజీ ప్రియులు.
జాక్‌లు హైజాక్ అయినట్టే..
ఫోన్లో పాటలు వినాలంటే.. 3.5 జాక్ ఎక్కడుందా? అని వెతుక్కునే రోజులు పోయాయి. ఇప్పుడంతా బ్లూటూత్ స్పీకర్ హెడ్‌ఫోన్లే. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్.. దేంట్లోనైనా బ్లూటూత్ సపోర్టు ఉంటే చాలు. వైర్‌లెస్‌గానే మ్యూజిక్‌తో మస్తీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో 3.5జాక్ లేకుండానే ఫోన్లు అత్యంత నాజూకుగా టెక్నాలజీ ప్రియుల్ని అలరించనున్నాయి.
హెచ్డీ టీవీలు..3జీ ఫోన్లు
ఇప్పుడు ఫుల్ హెచ్డీ, 4కే టీవీలు సైతం బడ్జెట్ ధరల్లో లభిస్తున్నాయి. ఇక హెచ్డీ టీవీలతో పనేముంది. ఇక 4జీ ఎంత స్పీడ్‌గా నడుస్తోందో ఇప్పటికే చూస్తున్నాం. త్వరలో 5జీ జమానా కూడా మొదలవనుంది. ఇంకా నాన్4జీ ఫోన్ కొందామనుకుంటే వెనుకబడ్డట్లే.