శుక్రవారం, అక్టోబర్ 30, 2020

Published : 03/06/2020 00:36 IST
బంగారూ.. కంగారొద్దు

అలర్ట్‌

ప్రపంచ దేశాలన్నీ కరోనాని కట్టడి చేయడంలో తలమునకలు అవుతుంటే.. ఇదే అదునుగా చేసుకుని హ్యాకర్లు సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు. అందుకు పలు వినూత్న మార్గాల్ని వెతుకుతూ స్కామ్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్లు పన్నుతున్న మరో కొవిడ్‌-19 స్కామ్‌ ముందుకొచ్చింది. అదేంటంటే.. ‘మిమ్మల్ని కలవడం వల్లే మరొకరి కరోనా వచ్చింది..’ అని నమ్మిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారు. నిజమేనేమో అని కంగారు పడేలా చేస్తున్నారు. ఆ వెంటనే హ్యాకర్ల వలలో చిక్కుకుంటున్నారు. అదెలాగో ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం..


అప్రమత్తం చేస్తున్నట్టుగానే..

అమెరికా నుంచి ఇండియా వరకు అన్ని దేశాలూ కరోనా సోకిన వారిని పసిగట్టి సాధారణ ప్రజానీకం నుంచి వారిని దూరంగా ఉంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు రకాల ‘కాంటాక్ట్‌-ట్రేసింగ్‌ యాప్‌’లను వాడుతూ స్మార్ట్‌ పద్ధతుల్ని ప్రవేశపెడుతున్నాయి. దాంట్లో భాగంగానే భారత ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ని ప్రచారంలోకి తీసుకొచ్చింది. అందరినీ విధిగా వాడమంటూ ప్రోత్సహిస్తోంది. ఇలా ప్రభుత్వాలు అనేక మార్గాల్ని అన్వేషిస్తూ కరోనా లక్షణాలతో సంచరించే వారిని ట్రాక్‌ చేస్తున్నాయి. మెసేజ్‌, ఫోన్‌ కాల్స్‌తో ఎప్పటికప్పుడు అనుమానితుల్ని అప్రమత్తం చేస్తూ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండమని అవగాహన కల్పిస్తున్నాయి. దీన్నే అదునుగా చేసుకుని హ్యాకర్లూ ‘కాంటాక్ట్‌-ట్రేసింగ్‌’ పేరుతో మలిషస్‌ ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు.


మీరే కారణం అంటూ..

హ్యాకర్లు కొందరు వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని కొవిడ్‌-19 అలర్ట్‌ మెసేజ్‌లు పంపుతున్నారు. మిమ్మల్ని కలవడంతోనే మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని నమ్మబలికేట్టుగానో.. లేదంటే మిమ్మల్ని కరోనా లక్షణాలు ఉన్నవారిగా గుర్తించామనో మెసేజ్‌లు చేస్తూ ట్రాప్‌లోకి లాగుతున్నారు. మరిన్ని వివరాలకు లింక్‌ని ఓపెన్‌ చేయమని ప్రేరేపిస్తున్నారు. ఆందోళనతో మలిషస్‌ లింక్‌పై క్లిక్‌ చేస్తే చాలు. మాల్‌వేర్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయ్యి పని ప్రారంభిస్తుంది. ఫోన్‌ని పూర్తిగా వారి కంట్రోల్‌లోకి తీసుకుని వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది. దీంతో హ్యాకర్లు బ్యాంకింగ్‌ వివరాల్ని తెలుసుకుని ఎకౌంట్‌లను లూటీ చేస్తున్నారు కూడా.


జాగ్రత్త సుమా!

కొవిడ్‌-19 మలిషస్‌ స్కామ్స్‌కి చిక్కకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం.. తొందరపడి లింక్‌పై క్లిక్‌ చేయొద్ధు పైగా ఏ దేశ ప్రభుత్వమైనా కరోనాని కట్టడి చేసే ప్రయత్నంలో పంపుతున్న మెసేజ్‌ల్లో ఎలాంటి వెబ్‌ లింక్‌లను జోడించదు. ఒకవేళ ఏదైనా అదనపు సమాచారాన్ని తెలియపరిచేందుకు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ని మాత్రమే జత చేస్తారు. అలాగే, హ్యాకర్ల స్కామ్స్‌ తరహా స్పామ్‌ మెసేజ్‌ల వలకు చిక్కకుండా ఉండేందుకు ‘స్పామ్‌-బ్లాకింగ్‌ టూల్స్‌’ని వాడొచ్ఛు వ్యక్తిగత అవసరాలకు వాడే వెబ్‌ సర్వీసులకు ‘టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌’ని కచ్చితంగా ఎనేబుల్‌ చేసి వాడాలి. నిత్యం ఫోన్‌లో అప్‌డేటెడ్‌ యాంటీ వైరస్‌ని వాడడం తప్పని సరి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని