తాజా వార్తలు

Updated : 14/06/2021 18:05 IST
Politics: భాజపాలో చేరడం సంతోషంగా ఉంది: ఈటల

దిల్లీ: భాజపాలో చేరడం సంతోషంగా ఉందని తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ పోరాటంలో మొక్కవోని దీక్షతో పోరాడానని అన్నారు. భాజపాలో చేరిన అనంతరం దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ పాలన ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని భావించామని, మేధావుల సూచనలు తీసుకుంటామని మొదట్లో చెప్పిన కేసీఆర్‌.. అనేక మంది మేధావులకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
‘‘ తెలంగాణ కోసం అనేక అవమానాలు భరించాం. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటే మంచిది కాదని చెప్పిన వ్యక్తి కేసీఆర్‌. 90 సీట్లు గెలిచి సంపూర్ణ మెజార్టీ వచ్చిన తర్వాత కూడా 3 నెలలు కేబినెట్‌ రూపొందించలేదు. సంపూర్ణ మెజారిటీ ఉన్నా కేసీఆర్‌ ఫిరాయింపులు ప్రోత్సహించారు. కేసీఆర్‌ది రాచరికపు ఫ్యూడల్‌ మనస్తత్వం. నేనొక్కడినే పాలిస్తే బాగుంటుందని భావించే వ్యక్తి కేసీఆర్. ఏనాడూ ప్రజాస్వామ్య వేదికలను ఆయన గౌరవించలేదు.’’ అని ఈటల అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలను లాక్కుంటే ఆనాడు తామే విమర్శించామని, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ కూడా అదే పని చేశారని విమర్శించారు. కేసీఆర్‌ నేతృత్వంలో ఎంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారో మంత్రులు గుండెలపై చేయివేసుకొని చెప్పాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారందరినీ భాజపాలోకి ఆహ్వానిస్తామన్నారు.

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని