తాజా వార్తలు

Published : 14/06/2021 05:40 IST
2,995 యూనిట్ల రక్త సేకరణ

క్లిష్ట సమయంలో సైబరాబాద్‌ పోలీసుల సాంత్వన

రాయదుర్గం, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితులతో రక్త కొరత ఏర్పడి తలసీమియా, క్యాన్సర్‌ రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాతలు బయటికి వచ్చే పరిస్థితి లేదు. సేకరణ తగ్గి రక్తనిధి కేంద్రాలు నిండుకున్నాయి. కొరతను గుర్తించిన సైబరాబాద్‌ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ (సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌) రక్తదాన శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు సోమవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు వారాలుగా.. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (ట్రెడా), రెడ్‌క్రాస్‌ సొసైటీ, తలసీమియా సికిల్‌ సెల్‌ సొసైటీ, సేవా భారతి, ఇండో అమెరికన్‌ ఛాంబర్‌ కామర్స్‌ సహకారంతో పలు గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో దాతల చెంతకే వెళ్లి శిబిరాలు నిర్వహించారు. కమ్యూనిటీ సెంటర్లు, క్లబ్‌హౌస్‌లు, సామాజిక భవనాల్లో నిర్వహించగా దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అలా మొత్తం 2,995 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు సైబరాబాద్‌ పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సేకరించిన రక్తాన్ని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, రెడ్‌ క్రాస్‌ సొసైటీ, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు, ఎన్‌టీఆర్‌ బ్లడ్‌ సొసైటీ తలసీమియా, సికిల్‌ సెల్‌ సొసైటీలకు అందిస్తారు. దాతలు రక్తదానానికి ముందుకు రావాలని, తద్వారా బాధితుల ప్రాణాలను రక్షించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని