తాజా వార్తలు

Published : 14/06/2021 05:08 IST
అక్రమ నిర్మాణాలకు ఆదిలోనే అడ్డుకట్ట

గ్రేటర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌లో అనుమతి లేని కట్టడాలను ఆదిలోనే అడ్డుకునేలా జీహెచ్‌ఎంసీ ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) బృందాలను నియమించింది. రోడ్డు విస్తరణ, భూసేకరణ అవసరాల కోసం గతంలో బల్దియా న్యాక్‌ సంస్థ ద్వారా యువ ఇంజినీర్లను నియమించుకుంది. ప్రస్తుతం వాళ్లు విధుల్లో ఉన్నారు. వాళ్లు రోజువారీ తనిఖీ వివరాలను సంబంధిత అధికారులకు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ద్వారా చేరవేస్తారు. జోనల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందం వాటిని మరోమారు పరిశీలిస్తుంది. అక్రమ నిర్మాణాలని తేలితే.. చట్ట ప్రకారం కూల్చుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేశామని, త్వరలోనే తనిఖీలు, చర్యలు మొదలవుతాయని కేంద్ర కార్యాలయం స్పష్టం చేస్తోంది.

జోనల్‌ కమిషనర్లే బాధ్యులు

అనుమతి లేని నిర్మాణాలను నివారించే బాధ్యత జోనల్‌ కమిషనర్లదే అని కేంద్ర కార్యాలయం చెబుతోంది. అక్రమ కట్టడాలను పునాది దశలో కూల్చినప్పుడే నివారణ సాధ్యమంటోంది. అందులో భాగంగా ఎస్‌టీఎఫ్‌ బృందాలను అందుబాటులోకి తెచ్చామని, జోనల్‌ కమిషనర్‌ ఆ బృందాలకు విభాగాధిపతిగా, సూపరింటెండెంట్‌ ఇంజినీరు, పోలీసు శాఖ డీసీపీ సభ్యులు, జాయింట్‌ కమిషనరు/ఉప కమిషనరు హోదా అధికారి నోడల్‌ అధికారిగా ఉంటారు.

మొత్తం 12 బృందాలు

జోన్‌కు రెండు చొప్పున మొత్తం 12 ఎస్‌టీఎఫ్‌ బృందాలు ఏర్పాటయ్యాయి. నోడల్‌ అధికారి కింద డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కలిపి ఇద్దరు సభ్యుల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు రెండు ఉంటాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి అనుమతి లేని నిర్మాణాల ఫొటోలు, వివరాలు ఇచ్చేందుకు ఒక్కో బృందానికి ఒక్కో న్యాక్‌ ఇంజినీరు పనిచేస్తారు.

పౌరులూ ఫిర్యాదు చేయొచ్చు

మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌యాప్‌, కంట్రోల్‌ రూం నం. 040 2111 1111, జీహెచ్‌ఎంసీ ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా అక్రమ నిర్మాణాలపై వచ్చే ఫిర్యాదులనే కాక రాతపూర్వకంగా, ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులనూ సంబంధిత టాస్క్‌ఫోర్స్‌ బృందాలకు చేరవేస్తామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.


న్యాక్‌ ఇంజినీర్లే కీలకం

ప్రస్తుతం ప్రణాళిక విభాగం అధికారులే నిర్మాణ అనుమతులు ఇచ్చి, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది అవకతవకలకు పాల్పడుతూ అనధికార నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారన్న ఫిర్యాదులతో.. జీహెచ్‌ఎంసీ ఎస్‌టీఎఫ్‌ బృందాలను తెరపైకి తెచ్చింది. వాటిలో న్యాక్‌ ఇంజినీరు కీలకం. ప్రస్తుతం 75 మంది ఇంజినీర్లున్నారు. డివిజన్లవారీగా కొత్తగా జరిగే నిర్మాణాలను పరిశీలించాక.. ఒక్కో ఇంజినీరుకు ఒకటి, రెండు లేదా మూడు వార్డులు అప్పగించామని అధికారులు చెబుతున్నారు. టాస్క్‌ఫోర్స్‌లో వీళ్లు భాగమైనప్పటికీ.. జోనల్‌ కార్యాలయాల్లో కాకుండా.. సంబంధిత సర్కిల్‌ కార్యాలయం నుంచి పని చేస్తారు. ప్రతి 20రోజులకోసారి కేటాయించిన డివిజన్‌ మొత్తాన్ని తనిఖీ చేసి, అనుమతి లేని నిర్మాణాల పూర్తి సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారికి రోజూ చేరవేయాలి. తనిఖీల్లో భాగంగా నిర్మాణాల యజమానులు ఇంటి అనుమతిపత్రాన్ని చూపించకపోతే లేదా అందుబాటులో లేక పోతే.. జీపీఎస్‌ సాంకేతికతతో సదరు ఇంటి అనుమతి వివరాలను తెలుసుకునే సాఫ్ట్‌వేర్‌ను బల్దియా అందుబాటులోకి తెచ్చింది. దాని ద్వారా న్యాక్‌ ఇంజినీరు అనుమతిలేని భవనాలను గుర్తించొచ్ఛు ఇంజినీరు అక్రమ నిర్మాణాలను గుర్తించడం విఫలమైతే అతనిపై చర్యలుంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. న్యాక్‌ ఇంజినీరుతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు తరచుగా బదిలీలు ఉంటాయంటున్నారు. మున్ముందు.. ఒక జోన్‌ పరిధిలోని బృందాలకు, ఇతర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేత బాధ్యతలు ఇచ్చే విధానం అమల్లోకి రానుందని గుర్తుచేస్తున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని