తాజా వార్తలు

Updated : 14/06/2021 06:56 IST
TS News: రేవ్‌పార్టీ కాదు.. అంతకుమించి!

శివారులో నిబంధనలొదిలి పుట్టినరోజు వేడుక

నిర్వాహకులతోపాటు 68 మందిపై కేసులు

ఆమనగల్లు (కడ్తాల్‌) న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఫాంహౌస్‌లో మద్యం సేవిస్తూ డీజే శబ్దాలతో చిందులేస్తూ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న పలువురు యువతీ, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులతోపాటు 67 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల కేంద్రం సమీపంలోని బాక్స్‌ కంటైనర్‌ ఫాంహౌస్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్‌ మండల కేంద్రం సమీపంలోని బాక్స్‌ కంటైనర్‌ ఫాంహౌస్‌లో శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వరుణ్‌గౌడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జన్మదిన వేడుకలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని వివిధ కంపెనీలకు చెందిన సుమారు 70 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. రాత్రి మద్యం సేవిస్తూ, డీజే శబ్దాలతో హోరెత్తిస్తూ చిందులు వేస్తూ, నృత్యాలు చేస్తున్నారు. ఎస్‌వోటీ పోలీసులు, కడ్తాల్‌ ఎస్‌ఐ సుందరయ్య ఆధ్వర్యంలో ఫాంహౌస్‌పై రాత్రి 11.30 గంటలకు దాడులు నిర్వహించారు. వరుణ్‌గౌడ్‌ పారిపోగా.. ముగ్గురు నిర్వాహకులు, 21 మంది యువతులు, 43మంది యువకులను అరెస్టు చేశారు. 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు మండలం రాచులూరుకి చెందిన ఫాంహౌస్‌ యజమాని భరత్‌ ఏ-1, నిర్వాహకులు మెహిదీపట్నానికి చెందిన జిషాన్‌అలీఖాన్‌ ఏ-2, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన అన్వేష్‌ ఏ-3, పరారీలో ఉన్న వరుణ్‌గౌడ్‌పై ఏ-4గా కేసు నమోదు చేశారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు తెలిపారు.

సోషల్‌ మీడియాలో చక్కర్లు..: ఈ పార్టీ వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. రేవుపార్టీని మించిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ రేవు పార్టీయేనని.. పోలీసులకు చిక్కడంతో బర్త్‌డే పార్టీగా నిర్వాహకులు మార్చారని వారు వివరిస్తున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని