తాజా వార్తలు

Published : 14/06/2021 02:58 IST
పల్లె ప్రగతి.. సాకారమయ్యేనా?

పంచాయతీల నిధులు పక్కదారి

అభివృద్ధి ఆమడ దూరం

ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలతోనైనా మారేనా

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

మిట్టబాస్పల్లిలో తొలగని మురుగు

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందుకోసం ‘పల్లె ప్రగతి’ పేరిట వివిధ పనులను చేపట్టింది. నిర్వహణ కోసం నెలనెలా రూ.10 కోట్లకుపైగా నిధులు జమ చేస్తోంది. అదనంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా కేంద్రం నిధులు, ఆస్తి పన్ను ద్వారా ఆదాయం సమకూరుతోంది. అయితే జిల్లాలో దాదాపు సగానికిపైగా పల్లెల రూపురేఖలు మారలేదు. పనుల పర్యవేక్షణకు కొత్తగా మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో అధికారుల్ని నియమించినా అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించడం లేదు. ఇదే విషయమై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 19 నుంచి తానే స్వయంగా ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అభివృద్ధి పనులు, ఫలితాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

గతేడాదే శ్రీకారం

గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గతేడాది ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాలను ప్రతిష్ఠాతక్మకంగా చేపట్టింది. తొలిసారిగా పంచాయతీల ఆధ్వర్యంలో ఇంటింటి నుంచి చెత్త సేకరించి, దిబ్బలకు తరలించి సేంద్రియ ఎరువుల తయారీకి నడుం బిగించింది. ప్రతిరోజు కాల్వలను శుభ్రం చేయడం, వీధులు, రహదారులను శుభ్రం చేసేందుకు, 1, 11, 21 తేదీల్లో తాగునీటి ట్యాంకుల క్లోరినేషన్‌కు కార్యాచరణను రూపొందించి అమలుకు ఆదేశించారు. తొలుత మూడు నెలలపాటు అన్ని పంచాయతీల్లో అమలు చేసినా క్రమంగా నిర్లక్ష్యం వహించారు. ప్రస్తుతం పాతిక శాతం పంచాయతీల్లో మాత్రమే కొనసాగిస్తున్నారు. మిగిలిన పంచాయతీల్లో కార్యాచరణ అమలుకు నోచడం లేదు. దీంతో గ్రామీణ వీధుల్లో మురుగు, చెత్తతో అపరిశుభ్రత పెరిగిపోతోంది. అధికారుల ఒత్తిళ్లతో జిల్లా వ్యాప్తంగా 500కుపైగా పంచాయతీల్లో వైకుంఠ ధామాలు, చెత్త దిబ్బలు నిర్మించగా పట్టుమని 200 పంచాయతీల్లోనూ ఉపయోగించడంలేదు.

పర్యవేక్షణ లేకపోవడం

ప్రభుత్వం పంచాయతీలపై పర్యవేక్షణ పెంచేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు పెద్దఎత్తున ప్రతి పంచాయతీకి ఒకరు చొప్పున 400లకుపైగా కొత్త కార్యదర్శుల్ని నియమించింది. మండలానికి ఒకరు చొప్పున 18మంది ఎంపీఓలను, నలుగురు డీఎల్‌పీఓలను, ఇద్దరు అదనపు పాలనాధికారుల్ని నియమించింది. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు మండలానికి ఒక గ్రామాన్ని కూడా సందర్శించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

నిధుల ఖర్చులో గోప్యత

14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు పంచాయతీ ఖాతాల్లో నేరుగా నెలనెలా జమవుతున్నాయి. వీటితో పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు గ్రామాల్లో ప్రత్యేకంగా నమోదు చేసి ప్రదర్శించాలని పల్లెప్రగతిలో ఆదేశించారు. గతేడాది పంచాయతీ కార్యాలయాలు, రచ్చకట్టల వద్ద గోడలకు రంగులతో పట్టిక రూపంలో నిధులు, ఖర్చులను నమోదు చేశారు. ఆ తర్వాత నిధుల గుట్టు తెలియకుండా వ్యహరిస్తున్నారు. అదేమంటే రెండుమూడు నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదంటూ నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.

పచ్చదనం కోసం పంచాయతీకో నర్సరీ

పెరుగుతున్న మొక్కలు

ప్రభుత్వం ప్రత్యేకంగా హరితహారం పేరిట పథకాన్ని ఆరు సంవత్సరాలుగా అమలు చేస్తోంది. తొలుత మండలానికి ఒక నర్సరీని ఏర్పాటు చేయగా గతేడాది నుంచి ఏకంగా పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేయించి 5వేల నుంచి 10వేల మొక్కలను సిద్ధం చేయిస్తోంది. మొక్కలు బతకకుంటే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించడంతో చాలాచోట్ల మొక్కలను లక్ష్యంమేరకు నాటుతున్నారు. ఆ తర్వాత సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మొక్కల్లో చాలా వరకు ఎదగలేక వృథా అవుతున్నాయి.

మరింత వేగంగా పనులు: చంద్రశేఖర్‌రావు, డీఎల్‌పీఓ, తాండూరు

ఈనెల 19 నుంచి ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీలు చేపడతానని చెప్పడం మంచి పరిణామం. దీంతో గ్రామాల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కొన్నిచోట్ల సర్పంచుల సహకారం లేకపోవడం, స్థలాల సమస్యలు వంటి కారణాలతో వైకుంఠధామాలు, చెత్తదిబ్బలు వంటివి నిర్మించలేకపోయాం. ఇకనుంచీ వేగంగా సాగుతాయి.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని