తాజా వార్తలు

Published : 14/06/2021 02:58 IST
కుంచారానికి నిబంధనల అడ్డు

అనుమతివ్వని కర్ణాటక

తిరగని రాష్ట్ర ఆర్టీసీ బస్సులు

కుంచారం ప్రభుత్వ ఆసుపత్రి

బంట్వారం, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు అమలు చేస్తున్న నిబంధనలు ప్రజలకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. తెలంగాణలో ఉదయం 6 నుంచి 5 వరకు రవాణా సేవలు కొనసాగుతున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో మాత్రం కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. కర్ణాటకలోని సరిహద్దు గ్రామమైన కుంచారానికి చుట్టు పక్కల తెలంగాణ సరిహద్దుగా ఉన్న బొపునారం, తొర్మామిడి, బండమీదిపల్లి, బస్వాపూర్‌, తట్టేపల్లి గ్రామాల నుంచి వందల మంది ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు, వైద్యం కోసం వస్తూ పోతుంటారు. కర్ణాటక రాష్ట్రం లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడంతో కుంచారం వెళ్లడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ ఆసుపత్రే అందుబాటు

చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కుంచారం ఆసుపత్రి మాత్రమే అందుబాటులో ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు ఆంక్షలు విధించడంతో సమస్యలు తప్పడం లేదు. సరిహద్దు గ్రామాల ప్రజలు జహీరాబాద్‌ పోవాలన్నా కుంచారం మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో మధ్యాహ్నం 12 తర్వాత పోలీసులు అనుమతించడం లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు జహీరాబాద్‌కు రావాల్సి ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులను ఇక్కడికి అనుమతించడం లేదు. దీంతో ద్విచక్ర వాహనాల పై వెళ్లాలని ప్రయత్నించినా పోలీసుల ఆంక్షలతో ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కుంచారంలో ప్రతి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంత జరుగుతుంది. చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు సంతలో కూరగాయలు, ఆయా వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు సంతకు కొద్ది సమయం ఉండడంతో కూరగాయలు సైతం కొనలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు.

30 కి.మీ వెళ్లాలి - శ్రీనివాస్‌, బొపునారం

మా గ్రామం నుంచి తాండూర్‌ లేదా వికారాబాద్‌ వెళ్లాలంటే దాదాపు 30 కి.మీ. వెళ్లాల్సి ఉంటుంది. జహీరాబాద్‌ 20 కిమీ దూరం మాత్రమే ఉంటుంది. ఎప్పుడూ కుంచారంలోనే నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేవాళ్లం. కర్ణాటక రాష్ట్రం లాక్‌డౌన్‌ విధించడంతో మధ్యాహ్నం 12 తర్వాత ఇక్కడికి రానివ్వడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా వైద్యం కోసం వెళ్తే ఆంక్షలు చూపి అడ్డుచెబుతున్నారు. కరోనా కాలం కావడంతో సరిహద్దు గ్రామ ప్రజలకు ప్రత్యేక సదుపాయ సౌకర్యాన్ని కల్పిస్తే బాగుంటుంది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని