తాజా వార్తలు

Published : 14/06/2021 02:58 IST
‘మమ్మల్ని ఆదుకోండి సారూ’
ఆర్థిక సాయానికి ఎమ్మెల్యేకు విన్నపం

మొర పెట్టుకుంటున్న వెంకటమ్మ

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): ఉన్నత చదువులు చదివి చేతికొచ్చిన కొడుకును చూసుకుని ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. ఇక బిడ్డ భవిష్యత్తుకు ఢోకా లేదనుకున్నారు. విధి వక్రించింది. అనారోగ్యం పాలయ్యాడు. కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని పేద తల్లిదండ్రులు శక్తికి మించి రూ.లక్షలు అప్పు చేసినా ప్రాణం దక్కలేదు. అటు కొడుకు మిగలక, ఇటు ఆర్థికంగా కోలుకోలేక ఆ కుటుంబ పరిస్థితి దీనావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో మృతుని తల్లి తమను ఆదుకోవాలని ఆదివారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని వేడుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేముల్‌ మండలం గాజీపూరు గ్రామానికి చెందిన యువకుడు మంతటి శ్రీనివాస్‌ (34) ఎంఏ, బీఈడీ చేశాడు. గత నెలలో తీవ్ర అనారోగ్యం పాలయాడు. వైద్యులు పరిశీలించి ఊపరితిత్తులు పాడై పోయాయని చెప్పారు. ఎలాగైనా కొడుకును బతికించుకోవాలని కుటుంబ సభ్యులు అప్పులు చేసి హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకోసం మొత్తం రూ.22లక్షలకుపైగా ఖర్చు చేశారు. అయినా జూన్‌ 1న ఆస్పత్రిలో మృతి చెందాడు. అప్పులు తీర్చే పరిస్థితులు లేక మృతుడి తల్లి వెంకటమ్మ క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యేను కలిసి ఆర్థికంగా ఆదుకోవాలని మొర పెట్టుకుంది. స్పందించిన ఎమ్మెల్యే తానే స్వయంగా సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సబ్‌ కోర్టుతోపాటు అదనపు కోర్టుకు హామీ

తాండూరు, న్యూస్‌టుడే: తాండూరులో రోజురోజుకు పెరిగిపోతున్న కేసుల పరిష్కారం కోసం సబ్‌ కోర్టుతో పాటు అదనపు కోర్టు ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. కేసులు సత్వర పరిష్కారం కోసం అదనపు కోర్టుతో పాటు సబ్‌ కోర్టు ఏర్పాటు చాలా ముఖ్యమని తెలిపారు. పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం ఇదే విషయమై రాష్ట్ర న్యాయశాఖ మంత్రిని కలిసేందుకు నిర్ణయించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌తో పాటు న్యాయవాదులు శ్రీనివాస్‌, ఫరీద్‌, శేఖర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌, గోపాల్‌, మస్తాన్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని