తాజా వార్తలు

Published : 14/06/2021 02:58 IST
ప్రత్యామ్నాయం లేక... అప్పు తప్పక

బ్యాంకు రుణాలు ప్రశ్నార్థకం

రైతుబంధు సాయం జాప్యం

ఖరీఫ్‌ సాగుకు అన్నదాతల అవస్థలు

న్యూస్‌టుడే, పాత తాండూరు

* బషీరాబాద్‌ మండలానికి చెందిన రైతు శ్రీనివాస్‌రెడ్డి 20 ఎకరాల్లో పత్తి, కంది పంటను సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది బ్యాంకు రుణం అందకపోవడంతో భార్య వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తాండూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో తనఖా పెట్టి రూ.1.50లక్షలు తీసుకొని ఎరువులు, విత్తనాలు, సాగు ఖర్చులకు వినియోగించుకుంటున్నాడు.


* యాలాల మండలం జక్కేపల్లికి చెందిన రైతు నర్సింహులుకు పత్తి, మినుము, మొక్కజొన్న పంట సాగు చేసేందుకు రూ.40వేలు పెట్టుబడి కోసం అవసరమయ్యాయి. తనకు 9ఎకరాల పొలం ఉండగా.. రైతుబంధు నగదు రూ.45వేలు వస్తాయని భావించాడు. సమయానికి వచ్చే పరిస్థితి లేక వడ్డీ వ్యాపారి వద్ద రూ.40వేలు అప్పు చేయాల్సి వచ్చింది. అన్నదాతలకు పెట్టుబడి కష్టాలు వెంటాడుతున్నాయనడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.

కాలంలో బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడం..సాగు నాటికి రైతుబంధు నగదు చేతికందడంలో ఆలస్యం కావడం...తదితర కారణాలతో రైతన్న సతమత మవుతున్నాడు. వానా కాలం సాగుకు సూచనగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో విత్తనాలు విత్తేందుకు, ఎరువులు, సాగు ఖర్చులకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు వాపోతున్నారు. చేతిలో నగదు ఉంటేనే సేద్యం సజావుగా జరుగుతుందని, ముందస్తుగా పత్తి విత్తనాలు విత్తితేనే దిగుబడి వస్తుందంటున్నారు. ఎక్కువ శాతం రైతులు తక్షణ అవసరం నేపథ్యంలో బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి పెట్టుబడికి నగదు సమకూర్చుకుంటున్నారు. బ్యాంకు రుణం, రైతుబంధు సాయం ఎప్పుడందుతుందా.. అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ’న్యూస్‌టుడే’ కథనం...

తక్షణం రూ.10వేలు అవసరం: జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు, 18 మండలాల పరిధిలో 5.80లక్షల ఎకరాల్లో పత్తి, కంది, వరి, మొక్కజొన్న, మినుము, పెసర తదితర పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పంటల సాగుకు సరాసరిగా ఎకరాకు రూ.20-30వేల వరకు ఖర్చవుతుంది. ఇలా.. మొత్తం సుమారు రూ.1,200 కోట్లు అవుతుండగా, తక్షణంగా ఎకరాకు రూ.10వేలు అవసరం. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టరుతో విత్తనాలు విత్తడం, కూలీల ఖర్చు వంటి వాటికి పెట్టుబడికి నగదు చేతిలో ఉండాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

ఖరారు కాని రుణ ప్రణాళిక

ప్రతి ఏడాది ఏప్రిల్‌ నాటికే రుణ ప్రణాళిక సిద్ధం అయ్యేది. ఈఏడాది ఇప్పటి వరకు వ్యవసాయ రుణ ప్రణాళిక ఖరారు కాలేదు. రుణాల రెన్యువల్‌ సైతం ఆగిపోయాయి. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో బ్యాంకులు సరిగా పని చేయకపోవడంతో ఏ పనీ తొందరగా కావడంలేదు. గతేడాది సైతం రూ.1,500కోట్ల రుణాలను రైతులకు అందజేయాల్సి ఉండగా.. 65శాతం మాత్రమే రుణాలిచ్చారు. ఈఏడాదైనా కేంద్ర ప్రకటించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం అవసరమైనంత రుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

మద్దతు ధరలు పాతవే..: పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు పెరగలేదని రైతులు అంటున్నారు. పత్తి ఎకరాకు గతంలో రూ.15 పెట్టుబడి కాగా, ప్రస్తుతం రూ.25వేలు దాటిపోతుందని, క్వింటాలు పత్తి రూ.8వేలు ప్రభుత్వం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

వడ్డీ వ్యాపారులదే జోరు: గతేడాది పంటలు దెబ్బతినడంతో పెట్టుబడి సైతం రాలేదు. దీంతో గతేడాది, ఈఏడాది అప్పు కలిపి వడ్డీ వ్యాపారులు భూములు తాకట్టు పెట్టుకొని నగదును అందజేస్తున్నారు. మరికొందరు రైతులు ఇంటి స్థలాలను తాకట్టు పెట్టి నగదును తీసుకుంటున్నారు. రూ.100కు 3శాతం వడ్డీకి నగదు, డీఏపీ, ఇతర ఎరువులు, విత్తన పొట్లాలకు సైతం సాధారణ ధరకంటే రూ.150 అదనంగా అరువు లెక్కలు రాసుకుంటున్నారు. పంట చేతికొచ్చి ఇచ్చే నాటికి వడ్డీతో సహా వసూలు చేస్తామని ఒప్పంద పత్రాలు రాయించుకుంటున్నారు.

రాయితీ విత్తనాలతో కాస్త ఊరట..: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి మండలానికి ఎంపిక చేసిన గ్రామాల్లో వంది మంది రైతులకు ఉచితంగా రాయితీపై కంది విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.దీంతో చిన్నకారు రైతులకు కంది విత్తనాల కొనుగోలు భారం తగ్గింది.

రెండు రోజుల్లో ప్రణాళిక సిద్ధం: రాంబాబు, లీడ్‌బ్యాంకు మేనేజరు, వికారాబాద్‌

రైతులకు ఇబ్బందుల్లేకుండా ఆయా బ్యాంకుల్లో రెన్యువల్స్‌ కొనసాగుతున్నాయి. ఈఏడాదికి సంబంధించి వ్యవసాయ రుణ ప్రణాళిక రెండు రోజుల్లో సిద్ధం అవుతుంది. బ్యాంకుల వారీగా వివరాలను సేకరించారు. సకాలంలో రైతులకు రుణాలిచ్చి వారికి చేయూతనిస్తాం. అన్ని విధాలా ఆదుకుంటాం.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని