తాజా వార్తలు

Published : 15/06/2021 05:55 IST
కొవిడ్‌ బారిన 23 మంది విద్యార్థులు

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో శిక్షణ పొందుతున్న 23 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్లు పరిపాలనాధికారి జి.రామ్మోహన్‌ తెలిపారు. గిరిజన విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఐటీడీఏ అధికారులు గత విద్యా సంవత్సరం నుంచి సూపర్‌-60 పేరిట 120 మందికి ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానం సమీపాన గల శిక్షణ కేంద్రం(వైటీసీ)లో వీరికి సౌకర్యాలు కల్పించి నిపుణులైన అధ్యాపకులతో బోధన అందిస్తున్నారు. కరోనా కారణంగా దేశవ్యాప్త్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా వీరికి మాత్రం మంజూరు చేయలేదు. పలుమార్లు ఆ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించడంతో గత మే నెల 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు సెలవులు ఇచ్చారు. ఈనెల 2వ తేదీ నుంచి తరగతులు పునః ప్రారంభించారు. తాజాగా వీరందరికీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 23 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. ఈ మేరకు బాధిత విద్యార్థులను పాత్రునివలస కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో ఉంచినట్లు వైటీసీ పరిపాలనాధికారి తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని