తాజా వార్తలు

Published : 15/06/2021 05:55 IST
ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలి

● గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ


అధికారులకు సూచనలిస్తున్న మంత్రి శ్రీరంగనాథరాజు, చిత్రంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన, మంత్రి అప్పలరాజు, కలెక్టరు లఠ్కర్‌ తదితరులు

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో 90,716 గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ‘నవరత్నాలు-పేదలందరికీ’ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో గృహనిర్మాణశాఖ అధికారులతో సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గృహనిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని అధికారులు విజయవంతం చేయాలని కోరారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో మరో 97 లేఅవుట్లు గుర్తించి అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ నిర్మాణాలు ప్రారంభమైతే కూలీలు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండానే సొంత ఊరిలోనే ఉపాధి దొరుకుతుందన్నారు. లబ్ధిదారులందరికీ సకాలంలో వారి ఖాతాల్లోనే బిల్లులు చెల్లింపులు చేస్తామన్నారు. సాంకేతిక లోపంతో జాప్యం జరిగినా లబ్ధిదారులు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా ఇళ్లనిర్మాణంలో రాష్ట్రంలోనే ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. ఇంటి నిర్మాణాలకు సంబంధించి గత ప్రభుత్వం బకాయిపడ్డ రూ.1400 కోట్లను కూడా వైకాపా ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు.

అందరికీ అందిస్తాం..: అనంతరం ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ అర్హులందరికీ ఇళ్లు నిర్మించి అందజేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి చెరుకువాడను కోరారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ లేఅవుట్లు, పట్టాల పంపిణీ తదితర వివరాలను మంత్రికి వివరించారు. ముందుగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ దువ్వాడ, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి, గృహనిర్మాణ సంస్థ జేసీ హిమాంశు కౌశిక్‌, ఆశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అధికారుల్లో సమన్వయ లోపం..

జిల్లాలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు గమనించినట్లు మంత్రి చెరుకువాడ పేర్కొన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్తు, ఇతర శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా జగనన్న కాలనీల్లో వసతుల కల్పనలో పనులు మందగించినట్లు తెలుస్తోందన్నారు. అంతా సమన్వయం చేసుకుంటూ సకాలంలో గృహనిర్మాణం పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని