తాజా వార్తలు

Published : 14/06/2021 04:00 IST
యథేచ్ఛగా చెరువు గర్భాల ఆక్రమణ

ఫిర్యాదు చేసినా ఫలితం లేని వైనం

ఎచ్చెర్ల మండలం చినకొంగరాంలో ఆక్రమణకు గురైన పెద్ద చెరువు

ఎచ్చెర్ల, పొందూరు, న్యూస్‌టుడే: చెరువులు, వాటి గర్భాలను ఆక్రమిస్తే భూగర్భజలాలు తగ్గి జీవ సమత్యులత దెబ్బతింటుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. తద్వారా మానవ మనుగడే ప్రమాదకరమవుతుందని పేర్కొంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం యథేచ్ఛగా చెరువులు ఆక్రమణకు గురైపోతున్నాయి. వీటిపై స్థానికులు రెవెన్యూ అధికారులకు పలు సార్లు ఫిర్యాదుచేసినా స్పందన ఉండటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎచ్చెర్ల మండలం కొంగరాం పంచాయతీ చినకొంగరాంలో సర్వే నంబరు 148లోని పెద్ద చెరువు 47 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. దీన్ని గ్రామంలోని కొందరు ఆక్రమించేశారు. వాస్తవ విస్తీర్ణంలో 60 శాతానికిపైగా ఆక్రమించేయటంతో చెరువు పూర్తిగా కుచించుకుపోయింది. ఫలితంగా చెరువు ఆయకట్టు రైతులు పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమణలపై గ్రామస్థులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వేయర్‌, రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి ఆక్రమణలు గుర్తించి హద్దులు నిర్ణయించారు. వాటిని ఉపాధిహామీ పథకంలో భాగంగా తొలగించేందుకు అధికారులు నిర్ణయించారు. పనులు చేసేందుకూ సిద్ధమయ్యారు. ఇంతలో ఆక్రమణదారులు దౌర్జన్యం చేసి అడ్డుకుంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి మట్టితొలగించే పనులు చేపట్టాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నా ఉపాధిహామీ సిబ్బంది మాత్రం ఫిర్యాదు ఇవ్వట్లేదు. దీంతో ఆక్రమణలు అలాగే కొనసాగుతున్నాయి. ఇదే మండలం బడివానిపేట పంచాయతీ పరిధిలోని జాలరకొయ్యాం గ్రామంలోని గారమ్మ చెరువు రెండు ఎకరాలకుపైగా ఆక్రమణలకు గురైంది. దీనిపై ఇటీవల గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో సర్వే అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఆక్రమణలు తొలగించారు. మళ్లీ ఆక్రమణదారులు హద్దులు తొలగించి గతంలో మాదిరిగా ఇళ్లు నిర్మించుకొంటున్నారు.
పొందూరు మండలం రాపాక పంచాయతీలో సచివాలయ నిర్మాణానికి గ్రామాన్ని ఆనుకొని ఉన్న చెరువును ఆక్రమించి నిర్మాణంచే గ్రామస్థాయి అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై గ్రామస్థులు కొందరు స్పందించి చెరువు గర్భాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేశారు. ఇంకా ఇంకా విచారించాల్సి ఉంది. జి.సిగడాం మండలం పాలకండ్యాం కూడలి వద్ద చెరువు గర్భం ఆక్రమించి పలువురు ఇళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు. దీనిపై గ్రామస్థులు కొంతమంది ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు సందర్శించి కొన్ని ఆక్రమణలు గుర్తించి తొలగించారు.

చర్యలు తీసుకుంటాం...
చెరువులు ఆక్రమించకూడదని, ఎవరైనా ఆక్రమిస్తే స్థానిక రెవెన్యూ సిబ్బంది తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎవరైనా దౌర్జన్యంగా ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోంటాం. చెరువుల ఆక్రమణలను ఉపాధి హామీ పథకంలో తొలగించేలా చూస్తాం.

- ఐ.కిశోర్‌, ఆర్డీవో, శ్రీకాకుళం డివిజన్‌

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని