తాజా వార్తలు

Published : 14/06/2021 04:00 IST
వీడని చిక్కు... వరుణుడే దిక్కు!

పిల్ల కాలువలా మారుతున్న నది
వరదనీరు మళ్లించేందుకే పైడిగాం పరిమితం

పైడిగాం ప్రాజెక్టు ఆనకట్ట వద్ద ఇదీ పరిస్థితి

సోంపేట, న్యూస్‌టుడే: జిల్లాలో రెండు నియోజకవర్గాలకు ప్రధాన సాగునీటి వనరైన పైడిగాం ప్రాజెక్టుకి వరుణుడే దిక్కయ్యాడు. మహేంద్రతనయ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకి ఒడిశాలో భారీగా వరద ముంపు ఏర్పడితే తప్ప, చుక్కనీరు చేరే అవకాశం లేదు. ప్రాజెక్టు నిర్మించి ఆరు దశాబ్దాలవుతున్నా జలాశయాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. ఫలితంగా భారీ వర్షాలు పడి మహేంద్రగిరుల నుంచి వరద నీరు నదిలో చేరితేనే ఖరీఫ్‌లో పైడిగాం భూములకు సాగునీరందుతుంది. ఇక్కడ నీటి నిల్వకూ అవకాశం లేకపోవడంతో వర్షాకాలంలో వరద నీరు సముద్రంలోకి చేరుతుంది. ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన ఆనకట్ట పెంచేందుకు వీల్లేక వరదనీరు మళ్లించేందుకే పైడిగాం పరిమితం అవుతుంది. ప్రాజెక్టు పరిధిలో సరైన ఆనకట్ట లేక నదిలో వరద నీరు ఉంటేనే కాలువ ద్వారా ఆధారిత చెరువులకు నీరు చేరే పరిస్థితి ఉంది.


చుక్కనీరు లేని కాలువ

నిండేది సగం చెరువులే...
ఖరీఫ్‌లో పైడిగాం ప్రాజెక్టు ద్వారా 67 చెరువులు నిండాల్సి ఉంది. ఈ నదిలోకి పూర్తిస్థాయిలో వరద నీరు చేరితే సగం చెరువులే నిండుతాయి. ప్రధాన కాలువ నిర్మాణంలో నెలకొన్న ఇబ్బందులతో ఆనకట్ట ఎత్తు పెంచే అవకాశం లేక నీటి మళ్లింపు ఇబ్బందిగా మారింది. ప్రాజెక్టు పరిధికి ఒడిశా నుంచి 185 క్యూసెక్కుల వాటా నీరు రావాల్సిఉండగా ఒడిశాలో పురియాసాహి, ఇతర ప్రాంతాల్లో అనధికారికంగా నిర్మించిన నిర్మాణాలు, ఎత్తిపోతల పథకాలతో రావలసిన వాటా నీరు చేరడం లేదు. ఒడిశా అక్రమ నిర్మాణాలపై గతంలో 2 రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైనా ప్రయోజనం లేకుండా పోయింది. మహేంద్రగిరుల నుంచి వచ్చే వరద నీటిపై పైడిగాం ఆయకట్టు భూములు ఆధారపడుతున్నాయి.
నానాటికి పెరుగుతున్న సమస్యలు...
కొద్దిపాటి నిధులతో రెండుచోట్ల జలాశయాలు ఏర్పాటు చేస్తే 10 వేల ఎకరాల పంట పొలాలు సస్యశ్యామలమవుతాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రధాన కాలువ పరిధి 2.2 కి.మీ., 3.2 కి.మీ.ల వద్ద మినీ జలాశయాలు ఏర్పాటు చేస్తే రెండు పంటలకు సాగు నీరందించే అవకాశం ఉంటుంది. దీనిపై మూడు దశాబ్దాల క్రితం అధికారులు ప్రతిపాదనలు చేసినా అది అమలుకు నోచుకోలేదు. హంసమేర, లొద్దగుడ్డిల వద్ద జలాశయాలు ఏర్పాటుచేసి కాల్వకు అనుసంధానిస్తే వరదనీరు సద్వినియోగపడటమే కాక ఖరీఫ్‌తో పాటు రబీలోను సాగునీరు అందుబాటులో ఉంటుంది. వరద నీటి నిల్వకు నదిలో ఏర్పాట్లు లేకపోవడంతో నానాటికీ సాగు, తాగునీటి సమస్యలు ఎక్కువవుతున్నాయి.
 ఆనకట్టగా మార్చాలి
పైడిగాం వద్ద నిర్మించిన ఆనకట్టతో అంతగా ప్రయోజనం లేదు. బకుడ వద్ద ఆనకట్ట నిర్మిస్తే ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీటితో చెరువులన్నీ నింపొచ్చు. వరదనీరు సద్వినియోగపరుచుకొనే పరిస్థితి లేక పైడిగాం ప్రాజెక్టు అలంకారప్రాయంగా మారుతుంది. రెండుచోట్ల మినీ రిజర్వాయర్లు నిర్మిస్తే పూర్తిస్థాయిలో ఆయకట్టు భూములకు సాగునీరందే అవకాశమున్నా, రైతు గోడు పట్టించుకోవడం లేదు. నాలుగైదు ఏళ్లకు రూ.కోట్లలో నిధులు ఖర్చు చేస్తున్నా, రైతుకి ఆ ప్రయోజనం అందడం లేదు.  

- బుద్దాన లోకనాథం, రైతు, సోంపేట

ఇది మళ్లింపు ప్రాజెక్టు మాత్రమే...

పైడిగాం ప్రాజెక్టు నీటి మళ్లింపు వనరు మాత్రమే. నీటి నిల్వ లేకపోవడంతో వరద నీరు నదిలోకి చేరితే కాలువ ద్వారా చెరువులు నింపేందుకు చర్యలు చేపడుతున్నాం. మినీ రిజర్వాయర్లు నిర్మిస్తే ప్రయోజనం ఉండటంతో రైతులు వీటిని నిర్మించమని అడుగుతున్నారు. వర్షాలు పడితే నదిలోకి నీరు చేరితే కాల్వ ద్వారా మళ్లించేందుకు చర్యలు తీసుకుంటాం

. - మధుసూదనపాణిగ్రాహి, ఏఈఈ, జలవనరులశాఖ

ఇదీ పరిస్థితి  
సాగునీటి వనరు: పైడిగాం ప్రాజెక్టు
ప్రధానకాలువ పొడవు: 16.5 కి.మీ.
పిల్ల కాలువ విస్తీర్ణం: 33 కి.మీ.
ఆధారపడిన చెరువులు: 67
సాగునీటి సదుపాయం పొందే పంట భూములు: 10 వేల ఎకరాలు

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని