తాజా వార్తలు

Published : 14/06/2021 04:00 IST
నిలిపేందుకు ప్రాణాలు... యువతా కదులు..!

ఆపత్కాలంలో అండగా సహృదయులు
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

శిబిరంలో రక్తదానం చేస్తూ...

ఊహించని ఆపదొచ్చినా, ప్రమాదాల బారినపడి ఆసుపత్రి పాలైనా అత్యవసరమయ్యేది రక్తమే. నిండు ప్రాణాలు నిలవాలంటే సకాలంలో అది సమకూరాలి. ఇలా బాధితుల్లో ఊపిరినింపేందుకు ఏటా వేల మంది ముందుకొస్తున్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. జిల్లా అవసరాలకు సరిపడా రక్తం సమకూరాలంటే యువత మరింతగా ముందుకు రావాల్సి ఉంది. అకుంఠిత దీక్షతో రక్తదానానికి నడుం కట్టాలి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

- న్యూస్‌టుడే, రాజాం

జిల్లాలో ఏటా సంభవిస్తున్న రహదారి ప్రమాదాల్లో వేల మంది క్షతగాత్రులవుతున్నారు. ఎంతో మంది వివిధ రుగ్మతలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇలాంటి ఆపత్కాలంలో రక్తం అత్యవసరమవుతోంది. 50 వేల యూనిట్లు రక్తం ఉంటే తప్ప ఏటా జిల్లా అవసరాలు తీరవు. కాని ఇందులో 17 శాతం కూడా సమకూరటం లేదు. 15 నెలలుగా కొవిడ్‌ ప్రభావంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. రక్తదాన శిబిరాల నిర్వహణే గగనంగా మారింది. రక్తదానం చేసేవారి సంఖ్యా తగ్గింది. కానీ రక్తం అవసరాలు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు రెడ్‌క్రాస్‌ సంస్థ జిల్లా రక్తదాన కేంద్రంలో 11 యూనిట్లు మాత్రమే నిల్వ ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రసవ సమయాల్లోనూ, శస్త్రచికిత్సలు, శరీరం విపరీతంగా కాలినా, తలసేమియా, హీమోఫిలియా రోగులకు, రక్తం తక్కువగా ఉన్న బాధితులకూ రక్తం అత్యవసరమవుతోంది.
స్పందిస్తున్నవారు తక్కువే...
రక్తదానం చేస్తున్న వారే మళ్లీ మళ్లీ చేసేందుకు మందుకు వస్తున్నారు. కొందరు పదుల సంఖ్యలో రక్తదానం చేశారు. జిల్లా జనాభాలో ఇలా స్పందిస్తున్న వారి శాతం తక్కువగానే ఉంటోంది. ఇతరులూ బాధ్యతగా తీసుకోవాలి. 18-60 ఏళ్ల లోపు వారు రక్తదానం చేయాలి. 45 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటే చాలు. హిమోగ్లోబిన్‌ 12.5 గ్రాములు దాటి, హెచ్‌ఐవీ, మలేరియా, క్షయ, క్యాన్సర్‌, బీపీ, మధుమేహం వంటి వాధ్యుల్లేని వారంతా స్పందించాలి. ఈ ఏడాది మే వరకు 9 శిబిరాలు మాత్రమే అతికష్టం మీద నిర్వహించి 327 యూనిట్లు రక్తాన్ని సేకరించారు. జూన్‌లో మరీ తీసికట్టుగా ఉంది. కేవలం మూడు శిబిరాల ద్వారా 51 యూనిట్లు సేకరించగలిగారు.
45 సార్లు చేశాను...
నేను ఇంత వరకు 45 సార్లు రక్తదానం చేశాను. తొలిసారి 2002లో రక్తదానం చేసినప్పుడు కొంత బెరుకుగా అనిపించింది. అప్పటి నుంచి నిరంతరాయంగా అవసరమైన వారికి ఇస్తూనే ఉన్నాను. అర్ధరాత్రి వెళ్లి రక్తం ఇచ్చి ప్రాణాలు నిలిపిన సందర్భలూ ఉన్నాయి. విజయనగరం ఘోషాసుపత్రిలో ప్రసవాలకు వచ్చిన ఎంతో మందికి రక్తం అవసరమవటంతో నేనే స్వయంగా వెళ్లి ఇచ్చాను. ఒ నెగిటివ్‌ రక్తం అవసరమైనవారు నన్ను 94410 17878 నంబరులో సంప్రదించొచ్చు

- ఆర్‌జేవీ శ్రీకర్‌, రాజాం

అపోహలు వీడాలి...
ఏటా జిల్లా అవసరాలకు సరిపడా రక్తం సేకరించలేక పోతున్నాం. అపోహలు వీడి యువత మరింతగా ముందుకు రావాలి. ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణం కాపాడితే అంతకన్నా మానసిక ఆనందం ఇంకేమీ ఉండదు. యువజన సంఘాలూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. 10-20 మంది ముందుకు వచ్చినా శిబిరాలు నిర్వహిస్తాం.

- డా.పి.జగన్మోహనరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రెడ్‌క్రాస్‌ సంస్థ

రక్తదాన శిబిరాల నిర్వహణకు ఈ నంబర్లను సంప్రదించవచ్చు: 94417 08120, 94401 95900

సామాజిక బాధ్యతగా..
రక్తదానానికి సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మా కళాశాలలో ఏడాదికి రెండు సార్లు రెడ్‌క్రాస్‌ సంస్థ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ద్వారా గ్రామాల్లోనూ కొనసాగిస్తున్నాం. నేను ఇంతవరకు 20 సార్లు రక్తదానం చేశాను. కళాశాల ద్వారా వేల కొద్ది యూనిట్లు సేకరించి రక్తం ఇచ్చాము.

- సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్‌, ప్రిన్సిపల్‌, జీఎంఆర్‌ఐటీ, రాజాం

ఏటా శిబిరం నిర్వహిస్తున్నాం...

రక్తదాన శిబిరం ఏటా నిర్వహించటం ఆనవాయితీగా పెట్టుకున్నాను. నా తోటి ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొని రక్తం ఇస్తుంటారు. ఇంతవరకు 10 శిబిరాలు ఏర్పాటు చేసి 821 యూనిట్ల వరకు సేకరించాం. నేను స్వయంగా ఇప్పటికీ 12 సార్లు రక్తదానం చేశాను. మానవసేవే మాధవ సేవ అన్నది ప్రతి ఒక్కరూ గుర్తించి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి.

- దుప్పల ఆశాలత, డీఈ, ఉద్దానం ప్రత్యేక తాగునీటి ప్రాజెక్టు

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని