తాజా వార్తలు

Published : 14/06/2021 04:00 IST
ఇంకెన్నాళ్లు..!

పూర్తి కాని భూగర్భ పెట్రోలియం పైపులైన్‌

రెండేళ్లుగా నత్తనడకన పనులు
న్యూస్‌టుడే- నరసన్నపేట, నరసన్నపేట గ్రామీణం, జలుమూరు


జలుమూరు మండలం రాణ సమీపంలో నిర్మాణ తీరు

జిల్లాలో ఐవోసీఎల్‌ ఆధ్వర్యంలో మొదలైన భూగర్భ పైపులైన్‌ పనులు నేటికీ కొలిక్కిరాలేదు. ఐవోసీఎల్‌ అధికారులు సకాలంలో పనులు పూర్తిచేయక, ఎక్కడివక్కడే వదిలేయడంతో పలు గ్రామాల్లో రైతులు ఖరీఫ్‌లో సాగు చేయక తీవ్రంగా నష్టపోయారు.  2019 నాటికే పూర్తి చేసేందుకు లక్ష్యం కాగా ఇప్పటికీ చిన్నా చితకా పనులు మిగిలి ఉన్నాయి. పలు చోట్ల కోర్టు కేసులు, ఇతరత్రా అడ్డంకులు, కరోనా కారణంగా పనులు ముగింపు సాధ్యం కాలేదు. పొలంలో పైపులైన్లు ఏర్పాటు చేసిన తరువాత సరిగా చదును చేయక గోతులుగా వదిలేశారు. పైపులను అస్తవ్యస్తంగా వదిలి వేయడంతో సాగు చేసేందుకు అవకాశం లేక రైతులు పొలాలను విధిలేక ఖాళీగానే విడిచిపెట్టారు. ఇప్పటికే ఐదేళ్ల కాలం పట్టిందని, ఇంకా ఎన్నాళ్లకు పూర్తవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనుమతి లేకుండా...
మా పొలంలో అనుమతి లేకుండా పైపులైన్‌ వేశారు. అడిగితే అధికారుల ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. కోర్టుకు వెళ్లి తేల్చుకోండి అంటున్నారు.  పొలంలో పైపులు వేశారు. జిల్లా అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.

- సనపల కొండలరావు, సనపలవానిపేట, ఆమదాలవలస

జిల్లాలో..
కిలోమీటర్లు : 192 కి.మీ  
నిర్మాణం : ఇచ్ఛాపురం నుంచి పైడిభీమవరం వరకు 18 మీటర్ల వెడల్పులో భూముల సేకరణ, 1.5 మీటర్ల లోతులో పైపుల ఏర్పాటు, ప్రతి 50 కిలోమీటర్ల దూరంలో ఓ దగ్గర 0.55 సెంట్ల విస్తీర్ణంలో సేప్టీ వాల్వ్‌లు దాని చుట్టు సెక్షన్‌ లైజ్‌డ్‌ వాల్‌ నిర్మాణం.
ఎన్ని మండలాల మీదుగా : 16

గడువు ముగిసినా : పైపులైన్‌ పనులు ప్రారంభించి అయిదేళ్లు గడుస్తున్నా పనులు కొలిక్కిరాలేదు.

దౌర్జన్యంగా వేశారు
ఐవోసీఎల్‌ పైపులైను పనులు మా పొలంలో దౌర్జన్యంగా వేశారు. వారు వచ్చిన సమయంలో పలుమార్లు అడ్డుకున్నాం. పరిహారం ఇస్తామన్నారు ఇవ్వలేదు. రైతుగా నా అంగీకారం తీసుకోలేదు. పొలంలో గోతులు తీసి వదిలేశారు. పంట నష్టం కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం పంట వేసుకునే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేదు.

- పంచిరెడ్డి శిమ్మన్న, రైతు లింగాలవలస

ఏటా తప్పని ఇబ్బందులు
నిర్మాణ పనులు పూర్తి కానందున ప్రతి ఏటా సాగు సమస్యలు ఎదుర్కొంటున్నాం. అసంపూర్తిగా నిర్మాణ పనులు కారణంగా పొలాలు గోతులమయంగా ఉన్నాయి. సత్వరంగా పనులు పూర్తి చేస్తే తమ భూముల్లో సాగుకు వీలుంటుంది. నాతో పాటు మా గ్రామానికి  చెందిన మరికొందరు రైతులు కూడా ఇలాగే సమస్యలు ఎదుర్కొంటున్నారు.  

- పోలాకి కేశవమూర్తి, బాలమ, నరసన్నపేట మండలం

చివరిదశకుచేరాయి
జిల్లా వ్యాప్తంగా పనులు చివరి దశకు చేరాయి. ఆమదాలవలస మండలంలో చిన్న చిన్న పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్లాస్టింగ్‌ తదితరాలు చేయాల్సి ఉంది. పైపులైన్‌కు అనుసరించి ఓఎఫ్‌సీ కేబుల్‌ అమర్చాలి. ప్రతి 4 కి.మీ పరిధిలో ఒక చోట తవ్వకాలు జరపాల్సి ఉంది. మరో మూడు నాలుగు నెలల్లో మొత్తం  పూర్తి చేస్తాం.  

- రమేష్‌, ఐవోసీఎల్‌ జిల్లా ప్రతినిధి

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని