తాజా వార్తలు

Published : 14/06/2021 02:40 IST
కొండలకు పచ్చ కవచం

జిల్లాలో 24 హెక్టార్లలో ప్రయోగం
తొలిసారిగా ఉపాధిహామీలో అమలు

జిల్లాలో అటవీప్రాంతంలో నిబంధనల మేరకు ఉండాల్సిన పచ్చదనం కంటే తక్కువ ఉంది. ఏటా అటవీశాఖాధికారులు పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపడుతున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదు. ఉపాధిహామీ పథకంలో భాగంగాఇప్పటికే మైదాన ప్రాంతాల్లో పచ్చదనం పెంచేందుకు ఆ శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉపాధి హామీలో తొలిసారిగా కొండలపైనా పచ్చదనం పెంచేందుకు ఈ ఏడాది అధికారులు ప్రణాళికతో కార్యాచరణ ప్రారంభించారు.

- కోటబొమ్మాళి, మెళియాపుట్టి, పాలకొండ

తొలకరి పలకరించగానే జిల్లాలో పచ్చదనం పెంపొందించాలని అధికారులు కసరత్తు ప్రారంభించారు.  పచ్చదనం లేని కొండలను ఉపాధిహామీ అధికారులు గుర్తించారు. కోటబొమ్మాళి,మెళియాపుట్టి మండలాల్లో కొండలు అనువుగా ఉన్నట్లు నిర్థారించారు. కోటబొమ్మాళి మండలంలోని బోడికొండలపై 24 హెక్టార్లు, మెళియాపుట్టి మండలంలో మూడు హెక్టార్లలో పచ్చదనం పెంచేందుకు నిర్ణయించిన అధికారులు ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు. దీని కోసం కోటబొమ్మాళి మండలంజర్జంగి గ్రామంలో సుమారు 25 మంది వేతనదారులు కొద్ది రోజులుగా వీటి పనిలో నిమగ్నమయ్యారు.


కోటబొమ్మాళి : జర్జంగిలో విత్తన బంతుల తయారీలో నిమగ్నమైన ఉపాధి వేతనదారులు

తయారీ ఇలా...
ఎంపిక చేసిన విత్తనాలను ముందుగా పురుగుపట్టకుండా శుద్ధి చేస్తారు. అనంతరం బంకమట్టి, ఎర్రమట్టి, వర్మీకంపోస్టును సమపాళ్లలో మిశ్రమం చేసి అందులో రెండేసి విత్తనాలను ఉంచుతారు. వీటిని మూడు రోజులు పాటు నీడప్రాంతంలో ఆరబెడతారు. హెక్టారుకు 3,500 విత్తనాలను వినియోగిస్తున్నారు.

కిష్టుపురం కాకర్లకొండపై తవ్విన గోతుల్లో విత్తన బంతులను వేస్తూ..

పెంపకానికి చర్యలు
నీటి సౌకర్యం లేని కొండలపై మొక్కలు నాటితే పెద్దగా ప్రయోజనం ఉండదని భావించిన అధికారులు విత్తనబంతుల రూపంలో మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతున్నారు. ఎంపిక చేసిన నాణ్యమైన విత్తనాలను అధికారులు ఇప్పటికే ఒడిశాలోని పర్లాఖెముండి నుంచి తీసుకువచ్చారు. కుంకుడు, వేప, కానుగ, చింతకు సంబంధించిన 135 కిలోల విత్తనాలను కొనుగోలు చేశారు. అడుగు దూరంలో విత్తనబంతులను వేస్తారు. విత్తనబంతి సగం భూమిలో పాతిపెడతారు. వర్షాలు కురిస్తే సులభంగా మొలకెత్తే అవకాశం ఉంటుంది.

కొండపై  గోతులను తీస్తున్న వేతనదారులు

వాతావరణ సమతుల్యత కోసం...
జిల్లాలో కొండలపై పచ్చదనం పెంపొందించేందుకు  చర్యలు తీసుకుంటున్నాం. 24 హెక్టార్లను ఇప్పటికే గుర్తించాం. ఉపాధిహామీ పథకంలో భాగంగా వేతనదారులు ఇప్పటికే విత్తనబంతులు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కిష్టుపురం కాకర్లకొండపై తవ్వకాలు చేసిన ట్రెంచ్‌ల్లో విత్తనాలను వేశాం. కొండలపై పెరిగేందుకు అవకాశం ఉన్న విత్తనాలను ఎంపిక చేశాం. వాతావరణ సమతుల్యత కోసమే మొక్కల పెంపకాన్ని చేపట్టాం.

- శిమ్మ శ్యామల, ప్లాంటేషన్‌ మేనేజరు, ఉపాధిహామీ పథకం
 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని