తాజా వార్తలు

Published : 17/05/2021 04:51 IST
పని దొరకదు.. ఆకలి ఆగదు..

ఇబ్బందుల్లో రోజువారీ కూలీలు

శాపంగా మారిన కర్ఫ్యూ


పనులు చేస్తున్న వేతనదారులు(పాత చిత్రం)

వారంతా రోజువారీ కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. నిత్యం రెక్కల కష్టంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కరోనా కట్టడికి విధించిన పాక్షిక కర్ఫ్యూ వీరి పాలిట శాపంగా మారింది. ఎవరూ పనులకు పిలవడం లేదు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వ్యవసాయ, భవన, రహదారుల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అప్పటి వరకూ సజావుగా సాగిన వీరి జీవితం ఒక్కసారిగా అంధకారంగా మారింది. చేతి నిండా పని దొరికే దగ్గరి నుంచి చేద్దామన్నా పని చెప్పే వారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు కూలీ పైనే ఆధారపడిన లక్షలాది కుటుంబాలు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

ఆంక్షల భయంతో

జిల్లాలో మెజారిటీ కుటుంబాలు పేద, మధ్య తరగతికి చెందినవే. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు రోజువారీ కూలీలుగా పనులకు వెళ్తుంటారు. వ్యవసాయ, భవన నిర్మాణ పనులకు వెళ్లే వారే ఎక్కువ. రోజంతా పనిచేస్తే రూ.300-450 వరకూ కూలీ దక్కేది. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో ఎవరూ పనులు చేయించుకోవడం లేదు. భవన నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. వ్యవసాయ పనులకు వెళ్లే వారూ కర్ఫ్యూ భయంతో పోలీసులు కొడతారేమోననే భయంతో వెళ్లడం లేదు. వాస్తవానికి వ్యవసాయ పనులు చేసుకునే రైతులకు, కూలీలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. వారిని ఎక్కడా ఎవరూ ఆపడం లేదు. కానీ వారిని కొవిడ్‌ భయమూ బెంబేలెత్తిస్తోంది. ఫలితంగా వ్యవసాయ పనులు ఉన్నా వెళ్లే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు.

పని కోసం ఎదురు చూస్తున్న మహిళలు

వలస నుంచి వెనక్కొచ్ఛి...

వలస కూలీలకు జిల్లా పెట్టింది పేరు. ఇక్కడి నుంచి దాదాపు 20 వేల మంది కూలీలు మహరాష్ట్ర, గుజరాత్‌, కేరళ, చెన్నై, పశ్చిమ బంగ, తెలంగాణ, తదితర రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలకు పొట్టకూటి కోసం వలస వెళ్తుంటారు. కొవిడ్‌ విజృంభణ తీవ్రంగా ఉండడంతో అన్నిచోట్లా లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అనివార్యమయ్యాయి. వారంతా పొట్ట చేతపట్టుకుని మళ్లీ స్వగ్రామాలకు చేరుకున్నారు. వ్యవసాయ, భవన నిర్మాణ, ఉపాధి హామీ పనులు ఇలా ఏవీ లేకపోవడంతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది.

సగానికి పడిపోయింది...

గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద ప్రజలకు ఉపాధి హామీ పనులు వరంగా మారాయి. కనీసం ఒక్కొక్కరికీ ఏడాదిలో 100 రోజులు పనిదినాలు కల్పించడమే ఈ పథకం లక్ష్యం. రోజూ కనీసం 3.5 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యేవారు. ఇప్పుడు ఆ సంఖ్య సగానికి పడిపోయింది. రోజూ నాలుగైదు గంటలు పనిచేసినా రూ.150-200 వరకూ కూలీ దక్కేది. కొవిడ్‌ కారణంగా చాలా గ్రామాల్లో ఆ పనులూ నిలిచిపోయాయి. ఒక గ్రామానికి చెందిన వారందరికీ ఒకేచోట పనులు కల్పిస్తున్నారు. అక్కడే కూలీలంతా గుమిగూడి నాలుగైదు గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఇలా గుంపులుగా ఒకచోట చేరి పనిచేయడం వల్ల కొవిడ్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అందుకే కొన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులూ నిలిపేశారు. అధికారికంగా కాకపోయినా గ్రామ పెద్దలు తీర్మానం చేసి పనులు నిలిపేశారు. ఫలితంగా వాటిపైనే ఆధారపడి జీవించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

పల్లెల నుంచి పట్టణాలకు...

గ్రామాలకు చెందిన కూలీలు పనుల కోసం రోజూ కిలోమీటర్ల దూరం ప్రయాణించి దగ్గరలోని పట్టణాలకు వెళ్తున్నారు. ఉదయాన్నే అన్నం క్యారేజీ చేత పట్టుకుని పట్టణాలకు వస్తున్నారు. ఎంత సేపు ఎదురుచూసినా ఎవరూ పనులకు పిలవక పోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లా కేంద్రం సహా ముఖ్య పట్టణాల్లో ఈ దృశ్యాలు రోజూ దర్శనమిస్తున్నాయి. ఒక్క రోజైనా పని దొరక్కపోతుందా అని ఆశతో వారు రోజూ పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. మధ్యాహ్నం 12లోపు ఇళ్లకు చేరుకోకపోతే పోలీసులు చేతికి చిక్కుతామేమోననే భయం మరోవైపు వీరిని వెంటాడుతోంది. ఎన్ని భయాలు వెంటాడినా కుటుంబంలో ఆకలి కేకలు తీరాలంటే ఈ ఇబ్బందులు తప్పడం లేదని కూలీలు వాపోతున్నారు.

నిరాశతో ఇంటికెళ్తున్నాం

పనుల కోసం రోజూ ఏదో ఒక సెంటర్‌ దగ్గర నిలబడుతున్నాం. పది రోజుల క్రితం వరకూ రోజూ ఏదో ఒక పని దొరికేది. కర్ఫ్యూ ఆంక్షలు పెట్టినప్పటి నుంచి పనులు లేవు. ఏరోజుకారోజు గంపెడు ఆశతో ఇక్కడికి వస్తున్నాం. ఎవరూ పనులకు పిలవడం లేదు. నిరాశతో, వట్టి చేతులతో మళ్లీ ఇంటికి చేరుకోవాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో పస్తులు తప్పడం లేదు.

- పాపడు, శ్రీకాకుళం

పది శాతం మందికే...

మా స్వగ్రామం మురపాక. స్థానికంగా పనులు లేక నగరానికి వస్తున్నాం. ఇక్కడికి నాలాగా రోజూ వందల మంది వస్తున్నారు. వారిలో పది శాతం మందికే చిన్న చిన్న పనులు దొరుకుతున్నాయి. ఒకరోజు పని ఉంటే నాలుగైదు రోజులు ఉండడం లేదు. ఈ ఆంక్షల వల్ల పనులు లేక కుటుంబం గడవడం కష్టంగా మారింది. కరోనా ఎప్పటికి తగ్గుతుందో...మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పటికి వస్తాయో తెలియడం లేదు.

- రామలక్ష్మి, మురపాక

అడిగిన వారికి పని కల్పిస్తున్నాం

గ్రామస్థాయిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను నిలిపే హక్కు, అధికారం ఎవరికీ లేవు. పని కావాలని ఎక్కడ, ఎవరు, ఎంత మంది ముందుకొచ్చి అడిగినా పని కల్పిస్తాం. పని కావాలి అని స్థానిక క్షేత్ర సహాయకులని అడిగితే సరిపోతుంది. కొవిడ్‌ నిబంధనలపై అవగాహన కల్పించి, పని ప్రదేశంలో వాటిని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కర్ఫ్యూ సమయంలో ఇతర పనులు లేని నేపథ్యంలో ఉపాధి పనుల కల్పనపై మరింత ఎక్కువ దృష్టి సారించాం.

- హనుమంతు కూర్మారావు, డ్వామా పీడీ

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని