తాజా వార్తలు

Updated : 19/06/2021 04:55 IST
టీకాలు ఎంతో సమర్థవంతం

15 వేల మందిపై మెడికవర్‌ ఆసుపత్రి అధ్యయనం

డాక్టర్‌ శరత్‌రెడ్డి

మాదాపూర్‌, న్యూస్‌టుడే: మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రి భారతదేశంలో అందుబాటులో ఉన్న కొవిడ్‌ టీకాలపై అధ్యయనం చేసింది. టీకాల సమర్థత, భద్రత అంశాలపై పరిశోధన కొనసాగింది. ఇందులో భాగంగా టీకాలు వేసుకున్న 15 వేల మంది ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష చేశారు. టీకా వేసుకున్న తరువాత వారిలో కనిపించిన ఫలితాలు, ప్రతికూల ప్రభావాల మీద సమగ్ర విశ్లేషణ చేశారు. నివేదికను శుక్రవారం విడుదల చేశారు. ఆసుపత్రి క్లీనికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శరత్‌రెడ్డి అధ్యయన ఫలితాలు వెల్లడించారు. టీకా మొదటి డోసు తీసుకున్న తరువాత 24 శాతం మందికి కరోనా సోకగా అందులో 18 శాతం మంది ఆసుపత్రిలో అడ్మిట్‌ కావాల్సి వచ్చింది. మిగతా వారంతా స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే మందులు వాడి కరోనాను అధిగమించారు. ఇక రెండో డోసు తీసుకున్న వారిలో కేవలం 2.73 శాతం మందికి మాత్రమే కరోనా బారినపడ్డారన్నారు. ఇందులో కూడా 11 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. టీకాలు తీసుకున్న తరువాత కరోనా ఇన్‌ఫెక్షన్‌ స్వల్పంగా, మధ్యస్థ తీవ్రతలోనే నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు. కొవిడ్‌ టీకా పట్ల ప్రజల్లో ఉన్న సంకోచాన్ని నివారించడానికి తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో అధ్యయనం చేయాల్సి వచ్చిందని డాక్టర్‌ శరత్‌రెడ్డి పేర్కొన్నారు. తమ ఆసుపత్రి సిబ్బంది మాత్రమే కాకుండా వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై పరిశోధన చేసినట్లు చెప్పారు. లక్షణాలు అధికం కాకుండా నిరోధించడమే కాకుండా వ్యాధి సోకినా మరణాన్ని దరిచేరనివ్వని శక్తిశాలిగా టీకాలు పనిచేస్తున్నాయని తమ అధ్యయనంలో తేలిందని ఆయన స్పష్టం చేశారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని