తాజా వార్తలు

Published : 19/06/2021 02:03 IST
నిలోఫర్‌ డైట్‌ కాంట్రాక్టర్‌పై కేసు

రూ.1.13 కోట్లు స్వాహాపై ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆసుపత్రి డైట్‌ కాంట్రాక్టర్‌ కె.సురేష్‌బాబుపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు రికార్డులతో రూ.1.13 కోట్లు స్వాహా చేశారంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.మురళీకృష్ణ అతనిపై గురువారం ఫిర్యాదు ఇచ్చారు. రోగులకు, వైద్యులకు భోజనం పెడుతున్నానంటూ చెప్పి రికార్డుల్లో ఎక్కువగా చూపించి అక్రమాలకు పాల్పడిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. నాలుగేళ్ల క్రితం సురేష్‌బాబు టెండర్‌ ద్వారా ఈ కాంట్రాక్ట్‌ దక్కించుకున్నాడు. జులై, 2020లో కాంట్రాక్ట్‌ పూర్తి కావడంతో తాజా టెండర్లు ఆహ్వానించి, టెండర్‌ను వేరే వ్యక్తికి అప్పగించారు.

డైట్‌ బిల్లుల్లో గోల్‌మాల్‌.... ఆసుపత్రి క్యాంటీన్‌ నుంచి సురేష్‌బాబు సమర్పించిన డైట్‌బిల్లుల్లో గోల్‌మాల్‌ జరిగిందంటూ గతేడాది పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. వెంటనే స్పందించిన ఆసుపత్రి ఉన్నతాధికారులు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. మూడేళ్ల పాటు క్యాంటీన్‌ రికార్డులను కమిటీ పరిశీలించింది. రికార్డుల్లో అంకెలను మార్చారని గుర్తించింది. ఇలా మూడేళ్లలో 1.13 కోట్లు స్వాహా చేశారంటూ నివేదిక ఇచ్చింది. రికార్డులు ఎందుకు మార్చారు? అక్రమాలకు ఎందుకు పాల్పడ్డారంటూ ఆసుపత్రి అధికారులు సురేష్‌బాబుకు రెండుసార్లు షోకాజ్‌ నోటీసులు పంపితే సమాధానమివ్వలేదు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని